సేంద్రీయ వ్యవసాయంలో విప్లవాత్మక విత్తన సంరక్షణ పద్ధతి రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి, భూమిని సుసంపన్నంగా నిలబెట్టుకుంటూ పంటలు పండించడం నేటి రైతుల ముందున్న అతిపెద్ద సవాలు. ఈ సవాలుకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయం (APCNF) పరిచయం చేసిన విత్తన గుళిక విత్తన ప్రపంచంలో నిజమైన విప్లవం. ఒక్కో విత్తనం చుట్టూ సహజసిద్ధమైన పదార్థాల పొరలు అద్దడం ద్వారా తయారయ్యే ఈ గుళిక విత్తనానికి సొంత కవచంలా పనిచేస్తుంది. భూమిలోని చెడు వ్యాధులు, పురుగులు, తేమ లోటు ఏ ప్రతికూలత వచ్చినా అది విత్తనాన్ని తట్టుకొనేలా చేసే అద్భుత శక్తి విత్తన గుళికకు ఉంది. “తొలకరి ముందు నవధాన్యాల సాగులో విత్తే విత్తుకు విత్తన గుళిక రక్ష” విత్తన గుళిక అంటే ఏమిటి ? విత్తన గుళిక పొరల నిర్మాణం మొదటి పొర : బూడిద రక్షణ కవచం & తేమ నియంత్రణ. రెండవ పొర : ఘనజీవామృతం సూక్ష్మజీవుల వనరు. మూడవ పొర : బంకమట్టి అంటుకునే పొర. నాల్గవ పొర : బీజామృతం విత్తన శుద్ధి ద్రావణం. మధ్యలో : విత్తనం ఈ అయిదు పొరల నిర్మాణం విత్తనాన్ని చుట్టుముట్టి, దానికి సహజమైన బలాన్ని అందిస్తుంది. బూడిద వంటి అతి సాధారణ పదార్థం కూడా విత్తనానికి ఎంత విలువైన రక్షణ ఇస్తుందో ఈ పద్ధతి నిరూపిస్తుంది. దశల వారీగా తయారీ విధానం దశ 1 : విత్తనశుద్ధి: విత్తనాలను గోనెసంచిలో వేసి బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. ఇది విత్తన మరియు భూమి నుండి వచ్చే తెగుళ్ళను నివారించే మొదటి దశ. దశ 2 :బంకమట్టి పూత: గోనెసంచిని అటు ఇటు కుదుపుతూ జల్లెడ పట్టిన పొడి బంకమట్టిని కలపాలి. మధ్య మధ్యలో బీజామృతం చిలకరించాలి. దశ 3 : ఘనజీవామృతం : మెత్తగా జల్లెడ పట్టిన ఘనజీవామృతాన్ని జల్లాలి. ఇందులో కోట్లాది సూక్ష్మజీవులు ఉండి విత్తనానికి జీవశక్తి ఇస్తాయి. మధ్య మధ్యలో బీజామృతం చిలకరించాలి. దశ 4 : బూడిద పొర : చివరగా జల్లెడ పట్టిన పొడి బూడిదను చల్లాలి. ఇది తేమను గ్రహించి విత్తనాలు అప్పటికప్పుడు మొలకెత్తకుండా కాపాడుతుంది. దశ 5 : పరిమాణం : విత్తన పరిమాణం కంటే గుళిక ఐదు రెట్లు పరిమాణం వచ్చే వరకు అంటే ప్రతి దశను పదే పదే చేయాలి. ఇలా చేయడం వల్ల పొరలు దట్టంగా అమరుతాయి. దశ 6 : ఇంగువ పొడి : బంకమట్టి, ఘనజీవామృతం, బూడిదతో పాటు ఇంగువ పొడి కూడా కలపాలి. దీని ఘాటైన వాసన చీడపీడల బారి నుండి భూమి నుంచి సంక్రమించే శిలీంధ్రాల నుండి రక్షణ కల్పిస్తుంది. దశ 7 : గుళిక తయారీ : ప్రతి విత్తనాన్ని విడివిడిగా తీసుకొని గుళికలుగా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. తొందర పాటు చేస్తే పొరలు సరిగా అమరవు. విత్తన గుళిక వల్ల లాభాలు విత్తన శుద్ధి : బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం నుండి లేదా భూమి నుండి వచ్చే తెగుళ్ళను పూర్తిగా నివారించవచ్చు.రసాయన పదార్థాలను ఉపయోగించి శుద్ధి చేయనవసరం లేదు. తేమ నిలుపుదల : బంకమట్టి పొర విత్తనంలోని తేమ శాతాన్ని 8-12% వద్ద స్థిరంగా నిలిపి, ఆవిరయ్యే అవకాశాన్ని నిరోధిస్తుంది. సూక్ష్మజీవుల వృద్ధి : ఘనజీవామృతం విత్తనంలోని జీవాన్ని ప్రేరేపిస్తుంది. మొలకెత్తిన తర్వాత భూమిలో అనేక హితకర సూక్ష్మజీవులు విస్తరిస్తాయి, అవి మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. 80% అధిక మొలకశాతం : సాధారణ మొలకలతో పోల్చినప్పుడు విత్తన గుళికలు 80% అధిక మొలక రేటు కలిగి ఉంటాయని క్షేత్ర పరీక్షలు నిరూపించాయి. పురుగుల నుండి రక్షణ : ఇంగువ పొడి వాసన చీమలు, ఇతర హానికర క్రిముల దాడిని నిరోధిస్తుంది. తెగుళ్ళు కూడా రాకుండా కాపాడుతుంది. తక్కువ ఖర్చు : బూడిద, బంకమట్టి, ఘనజీవామృతం ఇవన్నీ ఇంట్లోనే తయారుచేసుకోగలిగే పదార్థాలు. రసాయన వ్యయం సున్నా. అందరికీ అందుబాటులో ఉండే పద్ధతి. ఏ విత్తనాలు గుళికలు గా చేయవచ్చు? సులభంగా మార్చగలిగే విత్తనాలు : అనుమలు, పప్పుశనగ, కందులు, మినుములు, మొక్కజొన్న, జొన్నలు, గోంగూర, బెండ, గుమ్మడి, పుచ్చ, కాకర, బీర, చిక్కుడు, అలసందలు, పొద్దుతిరుగుడు, బీన్స్, ఫ్రెంచి బీన్స్, జాక్ బీన్స్, కుసుమలు, పెసలు, ఉలవలు, పిల్లిపెసర, అవిశ, జీలుగ, జనుము, నేతి బీర, గోరు చిక్కుడు, సజ్జలు, బూడిద గుమ్మడి. గుళికలుగా మార్చడం కష్టమైనవి : రాగులు, కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, వరిగెలు, అండు కొర్రలు ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి క్షేత్ర స్థాయిలో గుళికలుగా మార్చడం కష్టం. (ఆకు, కాయ కూరగాయలు) : టమాటా, వంగ, మిరప, క్యాప్సికం, ఉల్లి, దోస, క్యారెట్, బీట్రూట్, కాలిఫ్లవర్, క్యాబేజీ మరియు కొన్ని రకాల ఆకుకూర విత్తనాలు. ఈ పొరల నిర్మాణం విత్తనాలను పురుగులు, భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు మరియు కష్టమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షిస్తుంది, అదే సమయంలో మొలకెత్తే శక్తిని పెంచుతుంది. విత్తన గుళిక మన విత్తనానికి మనమే కవచం విత్తన గుళిక పద్ధతి అనేది కేవలం విత్తన సంరక్షణ మాత్రమే కాదు . ఇది సేంద్రియ వ్యవసాయం వైపు రైతు తీసుకునే మొదటి అడుగు. తక్కువ ఖర్చుతో, ఇంటి పరిసరాల్లో దొరికే సహజ పదార్థాలతో, రసాయనాలు లేకుండా చేయగలిగే ఈ పద్ధతి .ప్రతి రైతు నేర్చుకోవాల్సిన అవసరమైన నైపుణ్యం. మీ పొలం, మీ విత్తనం, మీ భవిష్యత్తు వాటిని కాపాడుకోండి. ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ