పంటలలో నత్రజని సద్వినియోగం- మెరుగైన దిగుబడులకు మార్గాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిరప పంటలను, ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, మామిడిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా నత్రజని ఎరువుల కోసం రైతులు ఎక్కువగా యూరియాని వినియోగిస్తున్నారు. నత్రజని వినియోగ సామర్థ్యం వివిధ పంటలకు అనుగుణంగా 30-40 % మించి ఉండటం లేదు. కాబట్టి వినియోగ సామర్థ్యం పెంచే దిశగా ఉన్న అవకాశాలను అన్వేషించాలి.ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసే పంటలలో నత్రజని అవసరం ఎక్కువ ఉండడం వలన ఈ పోషకాన్ని అధిక మోతాదులో యూరియా రూపంలో అందిస్తారు. సహజంగా యూరియా పొలంలో వేసిన వెంటనే త్వరగా నీటిలో కరిగి, గాలిలో ఆవిరై, లీచింగ్ తగ్గిపోయి తద్వారా వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. ఈ సందర్భంలో యూరియా వినియోగ సామర్థ్యం పెంచి ఎక్కువగా మొక్కకు అందేలా చేయడం కోసం కొన్ని పద్ధతులను/మెళకువలు పాటించడం ద్వారా యూరియా మీద పెట్టే ఖర్చుని ఆదా చేసుకోవడమే కాకుండా మొక్కకి కావాల్సిన మోతాదులో నత్రజని లభిస్తుంది. అలాగే దీని ద్వారా సంభవించే నష్టాన్ని అరికట్టవచ్చు.

యూరియా వినియోగ సామర్థ్యాన్ని పెంచే పద్ధతులు

దఫ దఫాలుగా యూరియాను వాడడం: వివిధ దశలలో ఎరువులని వేయడం వలన పంట కీలక దశలో పోషకాలు అందడం వలన పంటల ఉత్పత్తి పెంచుకోవచ్చు. ఉదాహరణకు వరిలో మూడు సార్లు అనగా నాటు వేసే సమయంలో, పిలక దశలో, కంకి దశలో వేసుకోవడం వల్ల పంటకి విరివిగా లభించి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

నీమ్ యూరియా (వేప పూత పూసిన యూరియా) : వేపపూత నూనె వాడడం వలన యూరియా నెమ్మదిగా విడుదలరై మొక్కకి వివిధ కీలక దశల్లో లభిస్తుంది.

డ్రిప్ ద్వారా నత్రజని ఎరువులని ఇవ్వడం: ఈ పద్ధతి లో నత్రజని నష్టాన్ని తగ్గించి, నీటితోపాటు ఎరువులు మొక్క వేర్లకి నేరుగా అందించబడి వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.

ఆకుల మీద పిచికారీ చేయడం: 1-2 శాతం యూరియాని పంటను బట్టి మొక్కల ఆకుల మీద పిచికారీ చేయడం ద్వారా తక్కువ యూరియాతో ఎక్కువ వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం: మట్టి నమూనా పరీక్ష ద్వారా సిఫారసు చేసిన నత్రజని ఎరువులని పంటలకి వేసుకోవడం వలన వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అధిక మోతాదు లో వాడడం వలన పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది.బయోచార్ లేదా మట్టి తో యూరియాకి పూత పెట్టడం వలన నెమ్మదిగా నత్రజని విడుదలరై వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పద్ధతి 30 నుంచి 50% వరకు నష్టాన్ని తగ్గిస్తుంది.

బయో చార్ కోటెడ్ యూరియా తయారీ విధానం

పంట అవశేషాలను గుంతలో వేసుకుని కాల్చి చల్లార్చి, తర్వాత బయో చార్ ను తయారు చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న బయో చార్ ని 2. మి. మీ. కన్నా తక్కువ పరిమాణంలో ఉండేలా పొడి చేసుకోవాలి.

ఒక భాగం మట్టి 3 భాగాల నీటిని కలిపి పూత పూయడానికి సరిపడేలాగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.

తరువాత 100 కే.జి ల యూరియాని స్వల్పంగా నీటితో తడపాలి (తడికాకుండా, తేమ గ).

మొదటగా తేమగా ఉన్న యూరియాని 5-10 కే. జి. ల బయోచార్ పొడితో కలిపి యూరియా గుళికలు నల్లగా మారేంత వరకు కలపాలి.

తదుపరి బయోచార్‌తో ధూళీకరించిన యూరియాని, మట్టి జల్లెడలో ముంచి మళ్లీ 5 కే. జి. ల బయో చార్‌తో ధూళీకరించాలి.

నత్రజనిని మొక్క దగ్గర చిన్న గుంత తవ్వి వేయడం : నత్రజనిని మొక్క పక్కనే చిన్న గుంత ను తీసిన సిఫారసు చేసిన ఎరువును అందులో వేసి గుంతను మూసివేయాలి. ఉద్యాన పంటలలో అయితే, యూరియా గుళికలని 2-3 అంగుళాల లోతులో వేయడం వలన నత్రజని వాయు రూపంలో జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

ఆకు రంగు చార్ట్ : వ్యవసాయ, ఉద్యాన పంటలలో ఈ పద్ధతి వాడడం వలన మొక్కకి అవసరమైన దశలో నత్రజని ఎరువులని వేసుకోవచ్చు. తద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు.ఇతర పోషకాల సమతుల్యత : భాస్వరం, పొటాష్, గంధకం, జింకు, లాంటి పోషకాలను సరైన మోతాదులలో ఇవ్వాలి. ఈ పోషకాలు సమతుల్యంగా లేకపోతే యూరియా శోషణ తగ్గిపోతుంది.

యూరియా, జీవన ఎరువులు కలిపి వాడటం : ఈ విధానంలో నేల సారవంతంగా మారి యూరియా వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

యూరియా స్థిరీకరించే కారకాలు : ఎ.బి.పి.టి. (ఎన్-బ్యుటైల్ థయో ఫాస్ఫరిక్ ట్రైమైడ్) వంటి రసాయనాలు యూరియా నీటిలో కరిగే సమయాన్ని పెంచుతుంది. తద్వారా నత్రజని నష్టాన్ని తగ్గించవచ్చు.ప్రకృతిలో లభించే వావిలాకు, వేప గింజల పొడితో కూడా యూరియాకి పూత లా పూసి, వేసుకున్న యెడల నత్రజని విడుదల నెమ్మదిగా జరిగి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.పైన పేర్కొనబడిన పద్ధతులు / మెళకువలు పాటించి, రైతు సోదరులు యూరియాను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా అధిక దిగుబడిని పొందవచ్చు.

ఆధారం: తెలంగాణ వ్యవసాయ మరియు సహకార శాఖ