తెలంగాణ వ్యవసాయంలో పంట మార్పిడి ఆవశ్యకత - సుస్థిర ఆర్థిక వృద్ధికి మార్గాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగడంతో గత దశాబ్ద కాలంలో పంటల సాగు విస్తీర్ణం సుమారు కోటిన్నర ఎకరాల నుండి 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు చేరింది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ, సాగు విధానంలో ఒక పెద్దమార్పు వచ్చింది. గతంలో వైవిధ్యమైన పంటలు వేసే రైతులు, ఇప్పుడు కేవలం వరి, పత్తి పంటల వైపే మొగ్గు చూపుతున్నారు.మొత్తం సాగు విస్తీర్ణంలో 80 శాతానికి పైగా కేవలం వరి, పత్తి, మొక్కజొన్న పంటలే ఆక్రమించాయి. ముఖ్యంగా వరి సాగు 50 లక్షల ఎకరాల (33 శాతం) నుండి ఏకంగా 1 కోటి 25 లక్షల ఎకరాలకు (57శాతం) పెరిగింది. అదే సమయంలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటల సాగు 40 శాతం మేర పడిపోయింది.

ఏక పంట విధానం - దాగి ఉన్న ముప్పు

ఒకే రకమైన పంటను (ముఖ్యంగా వరి) ఏళ్లతరబడి పండించడం వల్ల రైతులకు, భూమికి అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి.

మార్కెట్ సంక్షోభం: తెలంగాణలో ప్రస్తుతం వినియోగ అవసరాలు (40 లక్షల మెట్రిక్ టన్నులు) పోను, ఏటా 130 లక్షల మెట్రిక్ టన్నుల వరి బియ్యం మిగులు ఉంటుంది.

దిగుమతులపై ఆధారం: మరోవైపు మనకు కావల్సిన పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలలో 20-50 శాతం మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్నాం.

భూసార క్షీణత, పెట్టుబడి పెరుగుదల: ఒకే పంట వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. ఫలితంగా పెట్టుబడి ఖర్చులు పెరిగి, ఆశించిన లాభాలు రావడం లేదు.ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే 'పంటమార్పిడి', 'సమగ్ర వ్యవసాయం' అత్యంత ఆవశ్యకం.

లాభసాటి పంటల సరళి - శాస్త్రవేత్తల సిఫార్సులు

వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన కింది పంటల సరళిని పాటించడం ద్వారా చీడపీడలను అదుపు చేస్తూ, భూసారాన్ని పెంచి అధిక ఆదాయం పొందవచ్చు.

వరి పండించే పొలాల్లో మార్పిడి విధానాలు

వానాకాలం వరికి ముందు: జూన్ నెలలో వరి నాటడానికి ముందు జీలుగ లేదా పెసర సాగు చేసి, పూత దశలో భూమిలోనే కలియదున్నాలి. దీనివల్ల భూమికి సహజ నత్రజని అంది, తదుపరి వరి పంటకు రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది.

యాసంగిలో (నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు): వరి కోసిన తర్వాత నిరంతరం వరి వేయకుండా కింది పద్ధతులు పాటించాలి.

పెసర - వరి - నువ్వులు

వరి - మినుము / పెసర / జనుము

వరి - మొక్కజొన్న లేదా వరి - పొద్దుతిరుగుడు

వరి - వేరుశనగ లేదా వరి - బెండ / పుచ్చ

వర్షాధార ఎర్ర నేలల్లో పత్తికి ప్రత్యామ్నాయాలు: పత్తిని ఏకపంటగా వేసే బదులు పత్తి + కంది (మధ్యకాలిక) (4:1 లేదా 6:1 నిష్పత్తిలో) లేదా పత్తి + పెసర (1:2 నిష్పత్తిలో) అంతర పంటలుగా వేయాలి. తేలికపాటి నేలల్లో పత్తికి బదులు పూర్తిగా కంది సాగు చేయడం వల్ల కరువు ముప్పును తట్టుకోవచ్చు.

పత్తి తర్వాత పంటలు

నీటి వసతి ఉన్నచోట పత్తి తీసేసిన తర్వాత మొక్కజొన్న, నువ్వులు, మినుము, శనగ లేదా జొన్న (పి.వి.కె.ఎస్-2) సాగు చేయాలి.

భూసారం పెంపు: పత్తి మోడులను క్రషర్ సహాయంతో పొలంలోనే కలియదున్నితే భూసారం పెరుగుతుంది.

తేలికపాటి, ఇరుకైన నేలల్లో లాభదాయక పద్ధతులు

పట్టణ ప్రాంతాలకు దగ్గరగా: సాధారణ మొక్కజొన్నకు బదులు తీపి మొక్కజొన్న (స్వీట్ కార్న్) సాగు చేయడం ఎంతో లాభదాయకం.

ఏడాదికి మూడు పంటలు: తేలికపాటి నేలల్లో నీటి వసతి ఉంటే పెసర - మొక్కజొన్న - వేరుశనగ చొప్పున ఏడాదికి మూడు పంటలు వేయవచ్చు.

మధ్యస్థ నేలలు: మధ్యస్థ, ఇరువైన నేలల్లో సోయాచిక్కుడు - మొక్కజొన్న సాగు శ్రేయస్కరం.

అంతర పంటల లాభాలుస్థిరమైన ఆదాయం: సోయాచిక్కుడు + కంది (6:1) లేదా కంది + మొక్కజొన్న (1:3) విధానం వల్ల స్థిరమైన ఆదాయం వస్తుంది.

తోటలలో అంతర పంటలు (అదనపు ఆదాయం)

కొత్తగా వేసిన ఆయిల్ పామ్ (లేత పామాయిల్) తోటలలో మొదటి 3-4 ఏళ్ల వరకు చెట్ల మధ్య ఖాళీ స్థలంలో పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు, పుచ్చ, కర్బూజ, బీర, బెండకాయ వంటి అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. అదే విధంగా పండ్ల తోటలలో కూరగాయల సాగు చేపట్టవచ్చు.సమగ్ర వ్యవసాయ విధానం (Integrated Farming)కేవలం పంటలపైనే ఆధారపడకుండా, ప్రధాన పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, పశుగ్రాసాలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ.. వాటితో పాటు పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం చేపట్టడాన్ని సమగ్ర వ్యవసాయం అంటారు.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు

ఏడాది పొడుగునా ఆదాయం: పంట చేతికి రాని కాలంలో పాడి లేదా జీవాల ద్వారా ప్రతిరోజూ / ప్రతి వారం ఆదాయం అందుతుంది.

పోషకాహార భద్రత: కుటుంబానికి కావాల్సిన పాలు, గుడ్లు, మాంసం, కూరగాయలు ఇంట్లోనే లభిస్తాయి.

పెట్టుబడి ఖర్చుల తగ్గింపు: పశువుల పేడ, మూత్రం పొలానికి ఎరువుగా మారుతుంది. పంట వ్యర్థాలు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా భూమి సారవంతంగా ఉంటుంది.

ముగింపు: తెలంగాణ వాతావరణం, మార్కెట్ డిమాండ్, తమకున్న వనరులను బట్టి రైతులు ఏకపంటల మొండి వైఖరి వీడాలి. వైవిధ్యమైన బహుళ పంటల సాగు, సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. తద్వారా రైతులకు ఆర్థిక భద్రత, రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతాయి.

ఆధారం : తెలంగాణ వ్యవసాయ శాఖ