ఎక్కువ పరిమాణం లో కావలసిన నిష్పత్తిలో వివిధ రకాల సూటి ఎరువులు (ఉదా: యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, సున్నము వంటివి ) భౌతికం గా మిళితం (mixing ) చేయడం ద్వారా తయారయ్యే ఎరువులను “మిశ్రమ ఎరువులు” (bulk blended Fertilizers) అంటారు. ఈ మిశ్రమ ఎరువులలో ముడి పదార్ధములను మిశ్రమం లో గుర్తించవచ్చును. పంట అవసరం మేరకు ఈ మిశ్రమము లను తయారు చేస్తారు. ఈ ఎరువులలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. మిశ్రమ ఎరువులను రైతు స్థాయిలో కొద్ది పరిమాణము లో తయారు చేసుకొనవచ్చును. చిన్న పరిశ్రమలు ఎక్కువ పరిమాణములో తయారు చేసి ఎక్కువ మంది రైతులకు అందించవచ్చు. రైతు స్థాయి మిశ్రమ ఎరువులు (Farm Mixtures) ఏ రసాయనిక ఎరువులు కలపాలో అవి పొరలు పొరలు గా పోసుకొని, బాగా కలియు నట్లు పారలతో కలపాలి. ఈ మిశ్రమాలను పంటకు వేయ బోయే రోజునే కలుపు కోవాలి. నిల్వ యున్నచో గడ్డ కట్టవచ్చు లేదా విష పదార్ధం గా మారవచ్చు. యాంత్రిక మిశ్రమాలు ఎక్కువ మోతాదులలో వివిధ ఎరువులను యంత్రముల సహాయంతో కలపగా వచ్చే ఎరువులు “యాంత్రిక మిశ్రమాలు” అంటారు ఈ పద్ధతిలో ఎరువుల మధ్య రసాయనిక చర్య జరగకుండా వుండే వాటినే ఎంపిక చేసుకోవాలి. ఆమ్ల లక్షణము కలిగి యున్న ఎరువులను క్షార స్వభావము కలిగిన ఎరువులతో కలపరాదు .ఉదా:అమ్మోనియం సల్ఫేట్ తో క్షార స్లాగ్ కలపరాదు . ఎక్కువ తేమ శాతం కలిగిన ఎరువులు లేదా తేమను పీల్చుకొనే లక్షణం కలిగిన ఎరువులు వాడరాదు ఉదా: అమ్మోనియం నైట్రేట్, యూరియా మిశ్రమ ఎరువులు ముద్ద కాకుండా చూసు కోవాలి. గుల్లగా ఉండడానికి పొడి చేసిన మొక్కజొన్న కండెలు లేదా కోకో చిప్పలు కలపాలి. గడ్డ కట్టకుండా (caking)ఉండేందుకు తక్కువ స్థూల సాంద్రత గల పాటి మట్టిని లేదా సిలికా వంటి పదార్ధాలు కలపాలి. ఒక నిష్పత్తి లో పోషకాల నిమిత్తం వివిధ ఎరువులు వాడేటప్పుడు నేల ఆరోగ్య రక్షణ కొరకు కేవలం రసాయన ఎరువులే కాక సేంద్రియ ఎరువులయినటు వంటి నూనె పిండి పదార్ధాలు (oil cakes) వాడవలెను. అనుకొన్న మిశ్రమ పరిమాణము కొరకు ఫిల్లర్ పదార్ధాలు అయిన ఇసుక, మట్టి, బొగ్గు, బూడిద, సున్నం వాడవలెను. నేల పునరుద్ధరణ (soil amelioration) దృష్టి లో పెట్టుకొని కొన్ని రసాయనాలు అంటే జిప్సం, సున్నం వంటివి కూడా కలుపుకునే అవకాశం ఉంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు