వేరుశనగ పంట ఆశించిన దిగుబడి రావాలంటే, పంటకు సరిపడా పోషకాలను అందించాల్సి ఉంటుంది. ఇతర పంటల లాగానే ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు, ద్వితీయ పోషకాలు అయిన కాల్షియం, గంధకము కూడా చాలా అవసరం. వీటితో పాటు జింక్, ఇనుము, బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. జింక్ లోపం వేరుశనగకు జింకు అత్యంత ఆవశ్యకం. మొక్కలకు కావాల్సిన హార్మోన్ల తయారీకి, నత్రజని, భాస్వరాల సమర్థ వినియోగానికి జింకు చాలా అవసరం. కొన్ని ఎంజైములలో కూడా జింక్ ఒక ముఖ్య భాగం. జింక్ లోపించినప్పుడు మొక్కలలో ఎదుగుదల ఉండదు. కణుపుల మధ్య దూరం తగ్గి ఆకులు చిన్నవిగా, మందంగా, ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. ముదురు ఆకుల అంచుల కొన భాగం నుంచి ఈనెల మధ్య భాగం వివర్ణమై పసుపు పచ్చగా మారుతుంది. ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగుమచ్చలు ఏర్పడతాయి. లోప సవరణ వేరుశనగకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను మూడు పంటలకు ఒకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పంటపైన జింకు లోప లక్షణాలు కనిపించినప్పుడు 0.2 % (2 గ్రాములు ఒక లీటరు నీటికి) జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చెయ్యాలి. ఇనుప ధాతు లోపం ఆకులలో పత్ర హరితం తయారు కావడానికి ఇనుప ధాతువు ఆధారం. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాల తయారీకి సహాయ పడుతుంది. మొక్కలలోని జీవ క్రియలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడు తుంది. మొక్క ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే ఇనుము తప్పనిసరి. ఇనుము లోపించినప్పుడు లేత ఆకులు పసుపు రంగుకు మారతాయి. ఇది ఈనెల మధ్య పచ్చదనం కోల్పోయి వివర్ణమవడం ప్రారంభం అవుతుంది. క్రమంగా ఆకు మొత్తం తెల్లగా పాలిపోతుంది. ఆకుల కొనలు ఎండిపోతాయి. ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు వస్తాయి. దీని వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. లోప సవరణ : ధాతు లోపం కనిపించే నేలలలో ఎకరాకు 4 కిలోల ఫెర్రస్ సల్ఫేట్ను దుక్కిలో వేసుకున్నట్లయితే ఈ లోపం రాదు. పంటపైన ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు 0.5% అన్నభేధి (5 గ్రాములు ఒక లీటరు నీటికి) 0.1% (లీటరు నీటికి 1 గ్రాము) నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. దీని వల్ల ఆకులు తిరిగి ఆకు పచ్చగా మారతాయి. బోరాన్ లోపం బోరాన్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో తయారయ్యే పిండి పదార్థాల రవాణాకు, మొక్కలలో ప్రత్యు త్పత్తికి, ఊడలు బాగా పెరిగి నేలలో దిగుటకు అవసరం. మాంసకృత్తుల తయారీకి, కణ విభజనకు బోరాన్ అవసరం. బోరాన్ కొరత ఉన్నప్పుడు ఆకులు ముదురు ఆకు పచ్చగా మారతాయి. లేత ఆకులు చిన్నవిగా వికారంగా మారతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. పక్క రెమ్మలు ఎక్కువై, మొక్క పొట్టిగా, గుబురుగా, కనిపిస్తుంది. కాండం చివరలు ఎండిపోతాయి. పూత సరిగా రాదు. కాయలు డొల్లగా తయారై, పప్పు నల్లగా మారుతుంది. లోప సవరణ ఎకరాకు 2 కిలోల బోరాక్స్న ఇతర ఎరువులతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. పంటపై బోరాన్ లోపం కనిపించినప్పుడు 0.1% (1.0 గ్రాము ఒక లీటరు నీటికి) బోరాక్స్ ద్రావణాన్ని పూతదశకు ముందే పిచికారీ చేయాలి. మాంగనీస్ లోపం లేత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. తీవ్రమైన లోపం ఉన్నప్పుడు, ఆకులు పల్చగా, పేపర్ లాగా మారిపోతాయి. మాంగనీస్ లోపం వేరుశనగ గింజల్లో నూనె ఏర్పడే శాతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. లోప సవరణ మాంగనీస్ సల్ఫేట్ ఒక లీటరు నీటికి 5-10 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. మట్టిలో వేయడానికి మాంగనీస్ సల్ఫేట్ ఒక ఎకరానికి 25 కిలోలు వేయాలి. మెగ్నీషియం లోపం లోపం ముందుగా ముదురు ఆకులలో కనిపిస్తుంది. ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది, అయితే ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు, ఆకుల అంచులపై చిన్న గోధుమ రంగు మచ్చలు లేదా ఎండిపోయిన ప్రదేశాలు ఏర్పడతాయి. తీవ్రమైన లోపం కారణంగా మొక్క పెరుగుదల మందగిస్తుంది. మెగ్నీషియం సల్ఫేట్ 4–5 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫెర్రోమాగ్ 5 కిలోలు/ఎకరం నేలలో వేయాలి. కాల్షియమ్ లోపం కొమ్మల చివరల దగ్గర చిన్నగా వంకర తిరిగిన ఆకులు. చివర మొగ్గలు నల్లగా మారి అభివృద్ధి చెందవు. అభివృద్ధి చెందుతున్న కాయలలో అత్యంత కాల్షియమ్ లోపం సాధారణ లక్షణం గింజ ఏర్పడక పోవడం. విత్తన అంకురోత్పత్తి తగ్గుతుంది. లోప సవరణ : ఎకరానికి 200 కిలోల చొప్పున జిప్సం నేలలో వేయాలి. ఈ విధంగా సూక్ష్మ ధాతులోపం సవరణకు సమగ్ర పోషకాల యాజమాన్యం చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చును. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా.వి.సంపత్ కుమార్ సీనియర్ ప్రొఫెసర్ (ఆగ్రోనమీ) ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు.