పోషకాలు సరిగ్గా దిగుబడి అధికంగా మానవుడి శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, జీవ రసాయన చర్యలకు ఏవిధంగా పోషకాలు అవసరమో అలాగే మొక్క ఎదుగుదలకు, రసాయన చర్యలకు, ఉత్పాదకతకు కూడా పోషకాల అత్యావశ్యకమైనవి. 17 మూలకాలు మాత్రమే ఆవశ్యక మైన మూలకాలుగా చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. దాన్నే మూలకాల ఆవశ్యక సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు అవి నిర్వర్తించే చర్యలు, వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకొని తద్వారా ప్రాధమిక, ద్వితీయ, సూక్ష్మపోషకా లుగా కూడా విభజించడం జరిగింది. మూలకాల ఆవశ్యకత ఏదైనా మూలకం లోపించినట్లయితే మొక్క జీవితచక్రం అసంపూర్తిగా ఉంటుంది. ప్రతి మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేం. ఈ మూలకం చర్య మొక్క జీవక్రియల్లో ప్రత్యక్షంగా ఉండటం. నిర్మాణాత్మక మూలకాలు: కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ఉప నిర్మాణాత్మక మూలకాలు : నైట్రోజన్, ఫాస్పరస్, సల్ఫర్ఆహార మూలకాలను అదుపుచేసేవి : కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంసూక్ష్మ పోషకాలు/ఉత్ప్రేరకాలు: ఇనుము, మాంగనీస్, కాపర్, జింకు, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్, నికేన్.ప్రయోజనకరమైన మూలకాలు : సోడియం, సిలికాన్, అల్యూమినియం. మొక్క ఎదుగుదల, ఉత్పాదకతతో పోషకాల ఆవశ్యకత జీవ రసాయనక్రియ. నత్రజని పత్రహరితం, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలలో ఇది ఒక ఆవశ్వకమైన అంతరంగిక భాగం. ఇది మొక్కలలో ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం ఇతర పోషకాలను మొక్క సమర్థవంతంగా ఉపయోగించుకునేలా దోహదపడుతుంది. కావున ఈ మూలకం లోపించినట్లయితే పైన పేర్కొనబడిన చర్యలన్నీ మందగిస్తాయి. భాస్వరం ఇది మాంసకృత్తులు, కేంద్రకామ్లాలు, ఫాస్ఫోలిపిడ్లు, ఎంజైముల్లో ఒక అంతరంగిక భాగం. అదేవిధంగా భాస్వరం క్రోమోజోముల్లో ఒక భాగం అందువలన కణవిభజన, మొక్క ఎదుగుదలకు బలమైన వేరువ్యవస్థ ఏర్పడడానికి అవసరం. అధిక నత్రజని వేయడం వల్ల కలిగే అనర్థాలను అదుపు చేస్తుంది. మొక్కలకి కీటకాలు, తెగుళ్ళను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బ్యాక్టీరియా పనితీరును పెంచి వేళ్ళలో బుడిపెలు అధికంగా ఏర్పడి తద్వార అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. పొటాషియం ఇవి మొక్క కణజాలంలో ఉండటం చేత మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూర్చుతుంది. అదే విధంగా మొక్కలలో జరిగే అనేక చర్యలకు ఉపయోగపడేటటువంటి 60 రకాల ఎంజైములు పనిచేయడానికి దోహదపడుతుంది. పొటాషియం పత్ర రంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడంలోనూ, నీరు మొక్కకు అందటంలో, కాండానికి బలాన్ని చేకూర్చి పైరు పడి పోకుండా ఉంచడంలోనూ, మొక్క చీడపీడలను తట్టుకొనుటకు కావాల్సిన నిరోధక శక్తిని కల్పించడం లోనూ, ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను సరఫరా చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ద్వితీయ పోషకాలు కాల్షియం : కణకవచం తయారీకి, కణాల ఉత్పత్తికి, పెరుగుదలకు కాల్షియం అవసరం. అంతేకాకుండా విత్తన అభి వృద్ధికి, కణాల మధ్య కణకవచాల ద్వారా సాగే ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది, కాల్షియం పత్రహరితంలో ఒక ముఖ్యభాగం. ఆకులకు రంగును ఇవ్వటంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం: ఇది మొక్క వివిధ పోషకాలను వినియోగిం చుకునే ప్రక్రియను నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా నూనె ఏర్పడడానికి, ప్రొటీన్ తయారీకి ఇది అత్యంత ఆవశ్యకం. గంధకం : దీని ఉపయోగం. చేసే పనులు నత్రజనికి పోలి ఉంటాయి. ఇది అనేక ఎంజైముల తయారీకి కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరపడానికి నత్రజని స్థిరీకరణకు అలాగే నూనెగింజల పైర్లలో మాంసకృత్తులు, నూనెలు తయారవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి ఘాటు రావడానికి, విత్తన తయారీకి ఇది ప్రాధాన్యం. సూక్ష్మపోషకాలు ఇనుము : ఎంజైముల తయారీకి మొక్కల్లో జరిగే శ్వాసక్రియకు, పత్రహరితం తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ఇనుము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాత్ర పోషిస్తుంది. మాంగనీసు : ఇది మొక్కల్లో ఇనుము పోషకానికి చేదోడు వాదోడుగా ఉంటూ వివిధ జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కిరణజన్య సంయోగ క్రియలో నత్రజని జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం తయారీలో దోహదపడుతుంది. అంతే కాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్ మోతాదు. నియంత్రిం చడంలో మాంగనీసు ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాగి : ఇది విటమిన్ల తయారీలోనూ, ఎంజైముల వ్యవస్థలోనూ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జింకు : పెరుగుదలకు అవసరమయ్యే ఆక్సిన్ తయారు కావడానికి నత్రజని, భాస్వరం, ఇతర పోషకాల సమర్థ వినియోగా నికి ఉపయోగపడుతుంది. మాంసకృత్తులు, అమైనో ఆమ్లాల తయారీలోనూ జింకు ఉపయోగపడుతుంది. బోరాన్ : ఇది మొక్క కాల్షియం గ్రహించడానికి, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరం. అదేవిధంగా మొక్కల్లో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. మొక్కల్లో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. పువ్వుల మధ్య సంపర్కం జరగటానికి తర్వాత కాయగా లేదా పంట ఉత్పత్తిగా మారటానికి అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. మాలిబ్డినం : మొక్కలు ఇనుమును గ్రహించడానికి వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది నైట్రోజనేజ్ అనే ఎంజైములో భాగమై ఉండడం వల్ల నత్రజని స్థిరీకరణలో కూడా తోడ్పడుతుంది. ఈవిధంగా అన్ని పోషక మూలకాలు తమ తమ ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తున్నాయి. అన్ని ఆవశ్యక మూలకాల సమతుల్యత కూడా ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. సరైన పోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఆహారం మనం పొందాలంటే ముందుగా మొక్కకు సరైన మోతాదులో అన్ని పోష కాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక