మెట్టవ్యవసాయంలో యాంత్రీకరణ రాష్ట్రం మొత్తం సాగు భూమి లో మెట్ట వ్యవసాయ ప్రాంతాలు సుమారు 38% ఉన్నాయి. ఈ మెట్ట వ్యవసాయ భూములు ప్రధానంగా రాయలసీమ జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ఉత్తర తూర్పు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలలో సగటు వార్షిక వర్షపాతం 400-800 మి.మీ. మాత్రమే ఉండి, అది కూడా ప్రధానంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు 2-3 నెలలపాటు కేంద్రీకృతమవుతుంది. మిగిలిన నెలల్లో పంటలకు, పశువులకు తగినంత నీటి లభ్యత చాలా పరిమితంగా ఉంటుంది. మెట్ట వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి ఎందుకు ? ప్రధాన మెట్ట పంటలు చిరుధాన్యాలు : జొన్న, సజ్జ,పప్పుధాన్యాలు: పెసర, మినుము శనగ, అలసంద, కంది,నూనె గింజలు: వేరుశనగ, నువ్వులు, ఆముదంమారుతున్న పరిస్థితులు : వాతావరణ మార్పులు కారణంగా పంట కాలం మార్పు సమయానికి పనులు పూర్తి చేయలేక పోవడం. శ్రామిక లోపం కారణంగా పంట నష్టం పెరగడం. ఈ పరిస్థితులలో, వ్యవసాయ యాంత్రీకరణ ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో పంట ఉత్పత్తి నిలకడగా ఉండటానికి, ఖర్చు తగ్గించు కోవడానికి, రైతుల ఆదాయం పెంచుకోవడానికి అత్యవసరం అవుతోంది. మెట్ట వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికుల లభ్యత గత 15-20 సంవత్సరాల్లో 25-30% తగ్గింది మరియు రోజు వారీ వేతనాలు .రూ 150 (2005) నుండి రూ. 500, రూ.600 (2024) కి పెరిగాయి. సమయానికి విత్తనం లేదా కోత జరగకపోతే 10-15% వరకు దిగుబడి నష్టం జరుగుతుంది. అంతేకాక,ఇన్ పుట్స్ (విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల) ధరలు కూడా 50– 70% పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ వుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యాంత్రీకరణ వలన శ్రామిక ఖర్చు 20-30% వరకు తగ్గించుకోవచ్చు, సమయానికి పనులు పూర్తి చేయడం ద్వారా. పంట నష్టాన్ని నివారించవచ్చు, నీటి వినియోగసామర్థ్యం 20– 35% వరకు మెరుగు పడుతుంది. పంట దిగుబడి 15-25% వరకు పెరుగుతుంది. డ్రోన్ సీడ్-కమ్- ఫర్టిలైజర్ డ్రిల్, పెన్యూమాటిక్ ప్లాంటర్, ఇంటర్- కల్టివేటర్, స్ప్ర్పేయర్, రీపర్, వేరుశనగ డిగ్గర్ వంటి పరికరాల వినియోగం ద్వారా పంటలలో ఉత్పాదకత పెంపు, ఖర్చుల తగ్గింపు, మరియు రైతుల ఆదాయం పెరుగుదల సాధ్యమవుతుంది. కాబట్టి, మెట్ట వ్యవసాయ ప్రాంతాల స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి యాంత్రీకరణ అనివార్యం. మెట్ట వ్యవసాయంలో యంత్రాల అందుబాటు, వాడుక ఆంధ్రప్రదేశ్‌లో మెట్ట వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు ప్రస్తుతం ప్రభుత్వ యాంత్రీకరణ పథకాలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు (CHCs) ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన యాంత్రికరణ పరికరాలు ట్రాక్టర్ (35-50HP): ట్రాక్టర్ మెట్ట వ్యవసాయంలోఅత్యంత కీలకమైన యంత్రం. ఇది భూమి దున్నడం, కలుపు తొలగించడం, విత్తనం వేయడం, కోత పరికరాలను నడపడం మరియు రవాణా వంటి అనేక పనులకు ఉపయోగపడుతుంది. పెద్ద విస్తీర్ణాన్ని తక్కువ సమయంలో సిద్ధం చేయవచ్చు. రోటావేటర్ : ఇది గడ్డలను పొడి ముక్కలుగా మార్చి తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది, అలాగే పంట అవశేషాలను మట్టిలో కలిపి సేంద్రియ పదార్థం పెరుగుదలకు సహాయ పడుతుంది. ఒక " ఎకరా భూమిని 45-60 నిమిషాల్లో సిద్ధం వేయగలదు. కలుపు నియంత్రణ లో కూడాఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. సీడ్-కమ్- ఫర్టిలైజర్ డ్రిల్ : విత్తనం, ఎరువును ఒకేసారి సరైన లోతులో వేయగల పరికరం. రెండు వేర్వేరు హావర్లలో విత్తనం, ఎరువు ఉంచి, పైపుల ద్వారా నేలలో వేస్తుంది. ఈ పరికరం వాడడం వల్ల విత్తన వృథా తగ్గుతుంది, మొలకలు సమానంగా వస్తాయి, మరియు శ్రామిక ఖర్చు తగ్గుతుంది. ఇంటర్ కల్టివేటర్: వరుసల మధ్య కలుపు తొలగించడానికి, నేల తేమ నిల్వను మెరుగు పరచడానికి ఉ పయోగించే పరికరం. ట్రాక్టర్‌తో అటాచ్ మెంట్ గా వాడి పంట రక్షణ పనులను వేగంగా పూర్తి చేయవచ్చు. డ్రోన్ స్ప్రేయర్ : ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మపోషకాలను వంటపై సమానంగా పిచికారీ చేయడానికి డ్రోన్ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఒక గంటలో 6-8 ఎకరాలు పిచికారీ చేయగలదు. రసాయన వినియోగం 25-30% తగ్గుతుంది, శ్రామిక ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రీపర్ : జొన్న, సజ్జ, శనగ, కంది వంటి పంటలను వెగంగా కోయడానికి ఉపయోగపడే పరికరం. బ్లేడ్ మరియు కన్వేయర్ సిస్టమ్ ద్వారా పంటను కోసి వరుసలుగా వరుస్తుంది. కోత సమయాన్ని 60-70% తగ్గిస్తుంది. వేరుశనగ డిగ్గర్ : వేరుశనగ పంటను నేల నుండి పైకి తీయడానికి, వరుసలుగా పరచడానికి ఉపయోగపడే పరికరం. V- ఆకారం మరియు వైబ్రేటింగ్ రాడ్లు పంటను సులభంగా పైకి లాగుతాయి. పంట నష్టాన్ని 10-15% తగ్గిస్తుంది. మల్చర్ : వంట అవశేషాలను మట్టిలో కలిపి సేంద్రియ పదార్థం పెంచే పరికరం. ఇది పొలాన్ని తదుపరి పంటకు సిద్ధం చేస్తుంది, మరియు మట్టిలో తేమ నిల్వను పెంచుతుంది. డ్రిప్/ స్ప్రింక్లర్/రెయిన్ గన్ : మెట్ట ప్రాంతాల్లో నీటిని సమర్థ వంతంగా వినియోగించడానికి ఈ పరికరాలు ఉపయోగ పడతాయి. డ్రిప్సిస్టమ్ ద్వారా నీరు నేరుగా వేర్లకు చేరి 40-50% నీటి ఆదా అవుతుంది. స్ప్రింక్లర్, రెయిన్ గన్ పద్ధతులు సమానంగా నీటిని పంచి పంట ఎదుగుదలను మెరుగు పరుస్తాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ లాభాలు మెట్ట వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, ఖర్చులను తగ్గించే కీలక పద్ధతిగా నిలుస్తోంది. వ్యవసాయంలో రైతులు ఆధునిక యంత్ర పరికరాలను ఉపయో గించి సమయం, ఖర్చులను ఆదా చేసుకోవచ్చు ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.జి. వీరప్రసాద్ విషయ నిపుణులు, (అగ్రికల్చర్ ఇంజినీంగ్) వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల