ఒక గణాంక విశ్లేషణ మన రాష్ట్ర వ్యవసాయంలో పంటల స్వరూపం క్రమంగా మారుతోంది. కొన్ని పంటలు దాదాపు స్థిరమైన విస్తీర్ణంతోనే ఉత్పాదకతను పెంచుకుంటుండగా, మరి కొన్ని పంటలు సాగు విస్తీర్ణాన్ని కోల్పోతున్నాయి. మరికొన్ని పంటలు విస్తీర్ణంతోపాటు ఉత్పత్తిలోనూ గణనీయమైన హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. ఈ మార్పులు కేవలం గణాంకాలు మాత్రమే కావు. రైతుల సాగు నిర్ణయాలు, పంటల ఆర్ధిక ప్రాధాన్యత, ఉత్పాదకత మార్పులు, సాగులోని అనిశ్చిత పరిస్థితులకు ఇవి అద్దం పడతాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే సరిపోదు. వృద్ధి ఎంత, ఆ వృద్ధి ఎంత స్థిరంగా ఉంది.. అనేది కూడా చూడాలి. 2014-15 నుంచి 2025-26 వరకు పంటల సాగు ధోరణులను పరిశీలిస్తూ ఆహార భద్రతకు ప్రతీకైన వరి, నూనెగింజలలో ముఖ్యమైన వేరుశనగ, పప్పుధాన్యాలలో శనగ, రైతులకు నగదు ఆదాయాన్ని అందించే వాణిజ్య పంట పత్తి పంటల సాగు విస్తీర్ణంలోని వృద్ధిరేటు, అస్థిరతలను విశ్లేషించడం జరిగింది. ఈ నాలుగు పంటలు వ్యవసాయంలో భిన్నమైన పాత్రలను కలిగి ఉండటంతో, సాగులో చోటు చేసుకుంటున్న మార్పులను సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి వీటి ధోరణులు ఉపయోగకరమైన సూచికలుగా నిలుస్తాయి. ఈ కాలంలో నాలుగు వంటల పరిస్థితి ఒకేలా లేదు. వరి స్థిరత్వంతో ఉత్పాదకత వృద్ధిని చూపిస్తే, శనగ విస్తీర్ణం తగ్గినా ఉత్పాదకత పెరుగుదలతో ఉత్పత్తిని నిలబెట్టుకుంది. వేరుశనగలో విస్తీర్ణం, ఉత్పత్తి రెండూ తగ్గడంతోపాటు అధిక అస్థిరత కనిపించింది. వత్తిలో విస్తీర్ణం తగ్గుదలతోపాటు ఉత్పత్తి, ఉత్పాదకతలోనూ ప్రతికూల వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రతి పంట సాగు విస్తీర్ణం ఏ దిశలో పయనించింది, దాని వృద్ధి ఎంతవరకు స్థిరంగా ఉంది అనేది పరిశీలిద్దాం. వరి విస్తీర్ణంలో స్థిరత్వం ఉత్పాదకతలో పురోగతి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో వరికి ప్రత్యేక స్థానం ఉంది. 2014-15 నుంచి 2025-26 మధ్య వరి సాగు విస్తీర్ణం దాదాపు స్థిరంగా కొనసాగింది. ఈ కాలంలో వరి విస్తీర్ణం 0.18 శాతం వార్షిక వృద్ధిరేటు (CGR)ను నమోదు చేసింది. అయితే కేవలం విస్తీర్ణం స్థిరంగా ఉండటం మాత్రమే కాకుండా, ఉత్పత్తిలో 0.94 శాతం, ఉత్పాద కతలో 1.04 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. అంటే వరి ఉత్పత్తిలో వచ్చిన పెరుగుదలకు సాగు విస్తీర్ణం పెరగడం కంటే ఉత్పాదకతలో వచ్చిన మెరుగుదల కొంత వరకు తోడ్పడినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. వరి పంటలో మరో ముఖ్యమైన అంశం దాని స్థిరత్వం, విస్తీర్ణానికి సంబంధించిన అస్థిరత (CV) 8.34 శాతం, ఉత్పత్తికి 7.24 శాతం, ఉత్పాదకత 6.65% గా నమోదయ్యాయి. నాలుగు పంటలతో పోల్చినప్పుడు ఇవి తక్కువ స్థాయి అస్థిరతను సూచిస్తున్నాయి. అంటే పన్నెండేళ్ల కాలంలో వరి సాగు విస్తీర్ణం పెద్దగా మారకపోయినా, ఉత్పత్తి, ఉత్పాదకతలో స్వల్పంగా, సానుకూలమైన పురోగతి నమోదైంది. "విస్తీర్ణం పెంచడం కంటే ఉన్న భూమిలోనే ఉత్పాదకత పెంచడం" అనే ధోరణికి వరి ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. శనగ-తగ్గిన విస్తీర్ణానికి ఉత్పాదకత అండ రబీ కాలంలో ముఖ్యమైన పంట శనగ సాగులో మరో రకమైన మార్పుకనిపించింది. 2014-15 నుంచి 2025-26 వరకు శనగ సాగు విస్తీర్ణం వార్షిక రేటు 2.23 శాతం తగ్గింది. అయితే విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి పూర్తిగా తగ్గలేదు. ఉత్పత్తి 0.42 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. దీనికి ప్రధానంగా తోడ్పడింది ఉత్పాధకత. శనగ ఉత్పాదకత 2.80 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అంటే శనగలో సాగు విస్తీర్ణం తగ్గినా, యూనిట్ విస్తీర్ణానికి లభించే ఉత్పాదకత పెరిగి ఉత్పత్తి కొంత వరకు నిలబడింది. అయితే ఈ పంటలో స్థిరత్వం విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. శనగ విస్తీర్ణ అస్థిరత 18.82 శాతం కాగా, ఉత్పత్తి అస్థిరత 30.06 శాతం, ఉత్పాదకత అస్థిరత 25.60 శాతంగా నమోదయ్యాయి. దీనికి కారణం ఒక ఏడాదిలో అధిక దిగుబడి నమోదై తరువాతి సంవత్సరాల్లో తగ్గుదల, మళ్లీ మరొక ఏడాదిలో పెరుగుదల వంటి హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. కాబట్టి శనగ సాగులో రెండు అంశాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. విస్తీర్ణం తగ్గుదల, ఉత్పాదకత పెరుగుదల. రైతు సాగు నిర్ణయాల్లో పంటకు లభించే ఉత్పాదకత, ధర, వాతావరణ పరిస్థితులు, సాగు ఖర్చులు వంటి అంశాలు కీలకంగా ఉండవచ్చు. అయితే ఈ కారణాలను నిర్ధారించడానికి ప్రత్యేక సమాచారాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. వేరుశనగ-తగ్గుతున్నసాగు విస్తీర్ణం పెరుగుతున్న అస్థిరత రాష్ట్రంలో ముఖ్యమైన నూనెగింజ పంట వేరుశనగలో గణాంకాలు మరో చిత్రాన్ని చూపుతున్నాయి. 2014-15 నుంచి 2025-26 వరకు వేరుశనగ సాగు విస్తీర్ణం 4.16 శాతం వార్షిక రేటుతో తగ్గింది. అదే సమయంలో ఉత్పత్తి కూడా 3.99 శాతం వార్షిక రేటుతో తగ్గింది. అయితే ఉత్పాదకత దాదాపు స్థిరంగానే ఉండి 0.18 శాతం మాత్రమే వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ మరో ముఖ్య అంశం విస్తీర్ణం తగ్గుతున్న సమయంలో ఉత్పాదకతలో గణనీయమైన పెరుగుదల కనిపించలేదు. ఫలితంగా ఉత్పత్తిలోనూ తగ్గుదల నమోదైంది. వేరుశనగలో అస్థిరత కూడా నాలుగు పంటలలో ఎక్కువగా ఉంది. విస్తీర్ణ అస్థిరత 36.13 శాతం, ఉత్పత్తి అస్థిరత 35.59 శాతం, ఉత్పాదకత అస్థిరత 33.28 శాతంగా నమోదయ్యాయి. ప్రత్యేకంగా విస్తీర్ణ అస్థిరత ఈ పరిశీలించిన కాలంలో 36.13 శాతంగా ఉండటం, రైతులు వేరుశనగ సాగు చేసే విస్తీర్ణంలో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నట్లు సూచిస్తోంది. అందువల్ల వేరుశనగ విషయంలో కేవలం సాగు తగ్గింది అని చెప్పడం కంటే, సాగు విస్తీర్ణం తగ్గుదలతోపాటు ఉత్పత్తి తగ్గడం, ఉత్పాదకతలో వృద్ధి లేకుండా దాదాపు స్థిరంగా ఉండిపోవడం, అలాగే అధిక అస్థిరత ఉండటం అనే మూడు అంశాలను కలిపి చూడాలి. ప్రత్తి-విస్తీర్ణం నుంచి ఉత్పత్తి వరకు ప్రతికూలధోరణి ప్రత్తి విషయంలోనూ గణాంకాలు ఆందోళనకర మార్పును సూచిస్తున్నాయి. 2014-15 నుంచి 2025-26 వరకు ప్రత్తి సాగు విస్తీర్ణం 3.38 శాతం వార్షిక రేటుతో తగ్గింది. విస్తీర్ణం తగ్గడమే కాకుండా ఉత్పత్తి 6.04 శాతం వార్షిక రేటుతో మరింత వేగంగా తగ్గింది. ఉత్పాదకతలో కూడా 2.83 శాతం వార్షిక తగ్గుదల నమోదైంది. ఇక్కడ విస్తీర్ణం తగ్గుదలతోపాటు ఉత్పాదకతలో కూడా ప్రతికూల వృద్ధితో ఉత్పత్తిపై ద్వంద్వ ప్రభావం పడింది. అందువల్ల ప్రత్తిలో నమోదైన ఉత్పత్తి తగ్గుదల కేవలం సాగు విస్తీర్ణం తగ్గడానికే పరిమితం కాలేదు. ప్రత్తి ఉత్పత్తి అస్థిరత 33.41 శాతంగా ఉండగా, విస్తీర్ణ అస్థిరత 20.41 శాతం, ఉత్పాదకత అస్థిరత 20.80 శాతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్పత్తిలో కనబడుతున్న అధిక అస్థిరత ఈ పరిశీలించిన కాలంలో గణనీయమైన హెచ్చు తగ్గులను తెలియజేస్తోంది. అయితే ఈ గణాంకాల ఆధారంగా ప్రత్తి సాగు తగ్గడానికి ఒక నిర్దిష్ట కారణాన్ని చెప్పడం సరికాదు. ధరలు, వాతావరణం, నీటి లభ్యత, సాగు ఖర్చులు, పురుగులు, తెగుళ్లు, ప్రత్యామ్నాయ పంటల పరిస్థితి వంటి అనేక అంశాలను విడిగా పరిశీలించాల్సి ఉంటుంది. నాలుగు పంటలలో ధోరణి వరి, శనగ, వేరుశనగ,పత్తి ఈ నాలుగు వంటలను ఒకే దృష్టితో చూస్తే సాగులోని మార్పుల వైవిధ్యం మరింత స్పష్టమవుతుంది. వారిలో విస్తీర్ణం దాదాపు స్థిరంగా ఉండి, ఉత్పత్తి, ఉత్పాదకత సానుకూల వృద్ధిని చూపించాయి. అదే సమయంలో అస్థిరత కూడా తక్కువగా ఉంది. శనగలో విస్తీర్ణం తగ్గినా, ఉత్పాదకత పెరుగుదల కారణంగా ఉత్పత్తిలో స్వల్ప సానుకూల వృద్ధి నమోదైంది. అయితే ఉత్పత్తి, ఉత్పాదకతలో అస్థిరత ఎక్కువగా ఉంది. వేరుశనగలో విస్తీర్ణం, ఉత్పత్తి రెండూ తగ్గాయి. ఉత్పాదకత దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, నాలుగు వంటలలో అత్యధిక విస్తీర్ణ అస్థిరత ఇక్కడ నమోదైంది. పత్తిలో విస్తీర్ణంతోపాటు ఉత్పాదకత కూడా తగ్గడంతో ఉత్పత్తి మరింత వేగంగా తగ్గింది. ఉత్పత్తిలో కూడా గణనీయమైన అస్థిరత కనిపించింది. ఆధారం: పాడి పంటలు , ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు.