మినుములో కాయ తొలుచు పురుగుల నివారణతోనే మేలైన దిగుబడి మన రాష్ట్రం లో మినుము పంట ప్రధానంగా దాళ్వా మెట్ట పంట గానూ, వరి మాగాణులలోను సాగవుతోంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం మరియు కర్నూలు జిల్లాలలో సాగు చేస్తారు. వరి మాగాణులలో మినుము పెసరను సాగు చేయడం మన రాష్ట్ర విశిష్టత. మినుము పంటను అనేక పురుగులు ఆశించి తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. వీటిలో ముఖ్యంగా కాయ తొలుచు పురుగులైన మారుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు మినుము పంటను ఆశించి దిగుబడులపైన ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతులు వీటి నివారణకు అధిక మోతాదులో సిఫారసుకు మించి రసాయన మందులను వినియోగించడం ద్వారా పురుగులో పురుగు మందును తట్టుకునే శక్తి పెంపొందుతుంది. కాబట్టి రైతులు నష్ట లక్షణాలను గమనించి సమయానుకూల సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారముంది. మినుమును ఆశించు కాయ తొలుచు పురుగులు – యాజమాన్యం మారుకా మచ్చల పురుగు దీనినే గూడు పురుగు లేక పూత పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు మొగ్గ, పిందె దశలలో ఆశించి పంటకు ఎక్కువగా నష్టం కలుగచేస్తుంది. ఈ పురుగు పూమొగ్గలపై, లేత ఆకులపై, పిందెలపై గుడ్లను పెడుతుంది. ఒక తల్లి పురుగు సుమారు 200-500 గుడ్లను పెడుతుంది. గుడ్లు చిన్నవిగా, తెలుపు - పసుపు రంగులో, గుంపులుగా లేదా ఒక్కొక్కటిగా ఉంటాయి. 3-5 రోజుల్లో గుడ్ల నుండి లార్వాలు బయటపడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు (మొదటి ఒకటి రెండు దశలు) పూమొగ్గల లోపలకి చొచ్చుకునిపోయి లోపలి లేత భాగాలను తింటాయి. తర్వాత దశ పురుగులు కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వలన పంటకు 10–80 శాతం వరకు నష్టం కలుగుతుంది. 10– 14 రోజులు లార్వా దశ కొనసాగుతుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలలోని గింజలను తిని వేసి వాటిని డొల్ల చేస్తుంది. గూళ్ల లోనూ, డొల్ల చేసిన కాయలలోనూ పురుగు విసర్జక పదార్థంతో నిండి ఉంటుంది. మారుకా మచ్చల పురుగు గూళ్ల లోనే ఉండి తింటూ ఉండడం వల్ల పురుగులను ఆశించే బదనిక పురుగులు మరియు పరాన్న జీవుల బారి నుంచి రక్షింపబడటమే కాక పురుగు మందుల ప్రభావం నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశముంది. లార్వా పూర్తిగా పెరిగిన తర్వాత పొడవాటి ఆకు మడతలలో లేదా నేలపై కోశస్థ రూపంలోకి మారుతుంది. ఈ దశ 6-8 రోజులు కొనసాగుతుంది. తర్వాత తల్లి పురుగులు వెలువడి మళ్ళీ జీవిత చక్రాన్ని కొనసాగిస్తాయి. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి 20-30 రోజుల్లో ఒక పూర్తి చక్రం పూర్తవుతుంది. యాజమాన్యం పంట పూమొగ్గ దశలో 5 మి.లీ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారిం చవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వల్ల తల్లి పురుగు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేగాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. పంటలో గూళ్ళు గమనించినట్లయితే నొవల్యూరాన్ 1.0 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీచొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 5-10 రోజుల వ్యవధిలో 2– 3 మందులను మార్చి పిచికారీ చేయాలి. పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు ఈ పురుగు అనేక రకాల పంటలను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన గుడ్లను గుంపుగా పెట్టి వాటిని వెంట్రుకలతో కప్పుతుంది. గుడ్ల నుంచి పొదిగిన మొదటి దశ గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్ర హరితాన్ని గోకి తినడం వలన జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన పురుగులు ఆకులను పూర్తిగా తినేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. జీవిత చక్రం పొగాకు లద్దె పురుగు గుడ్డు, లార్వా, కోశస్థ తల్లి పురుగు దశల ద్వారా పురోగమిస్తుంది. ఆడ పురుగులు ఆకుల దిగువ భాగంలో ఒకేసారి వందల కొద్దీ గుడ్లు పెడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి 3-12 రోజుల తర్వాత గుడ్లు పొదుగుతాయి. కొత్తగా పొదిగిన పిల్ల పురుగులు కోశస్థ దశను ఏర్పరచడానికి ముందు ఆరు అభివృద్ధి దశల ద్వారా పురోగమిస్తాయి. కోశస్థ దశ 7-10 రోజులు ఉంటుంది. మట్టిలో జరుగుతుంది. జీవిత చక్రం వ్యవధి ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. యాజమాన్యం గుడ్ల సమూహం మొదటి దశ పిల్ల పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. పురుగు తొలి దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేక క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు నొవల్యూరాన్ 1.0 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విషపు ఎర ద్వారా బాగా ఎదిగిన గొంగళి పురుగులను అరికట్టవచ్చు.ఒక ఎకరానికి సరిపడా ఎర తయారీకి కిలో బెల్లం, లీటరు క్లోరిపైరిఫాస్, 10 కిలోల తవుడు సరిపడా నీటిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలం అంతా సమానంగా చల్లుకోవాలి. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా.డి.సుధారాణి సీనియర్ శాస్త్రవేత్త (సేద్య విభాగం), కె.వి.కె, ఘంటసాల, కృష్ణా