పెరిగిన ఎరువుల ధరలు.. పొదుపుగా వాడటంలో మెళకువలు ఈ ఖరీఫ్ నుండి ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులకు మోయలేని భారంగా తయారయింది. కాని ఎరువులను పొదుపుగా వాడి ఈ సమస్యలను అధిగమించడానికి దిగువ చూపిన మెళకువలను పాటిస్తే కొంత వరకు లబ్ధి చేకూరుతుంది ప్రస్తుత పరిస్థితి రైతు వ్యవసాయానికి పెట్టే పెట్టుబడిలో గరిష్టంగా రసాయనిక ఎరువుల కొరకు వెచ్చిస్తారు. కాని రాష్ట్రంలో జూన్ 1 నుంచి కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెంచారు. బస్తాకు రూ.125 నుంచి రూ.600 వరకు పెరిగాయి. పంట పొలాల్లో అధికంగా వాడే 20:20:0:13 ఎరువు బస్తాపై అదనపు భారం రూ.350. అలాగే కాంప్లెక్స్ ఎరువులపై సగటున బస్తాకు రూ.450 నుంచి రూ.600 చొప్పున భారం పడింది. ఇక పొటాష్ బస్తా ధర రూ.1850 నుంచి రూ. 1975 కు పెంచారు. ఈ ఎరువుల పెంపకంలో ప్రైవేట్ కంపెనీలతో సహకార కంపెనీలు పోటీపడుతూ రైతులపై భారాన్ని మోపుతున్నాయి. కోరమండల్, ఇఫ్కో స్పిక్ కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాయి. ఇంత ఖరీదైన రసాయనిక ఎరువులను ఎలా వాడాలి? మనం ఎలా వాడుతున్నాం? అని అవలోకనం చేసుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడాలని శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు. రైతులు మాత్రం పొటాష్ ను అవసరమైన దానికన్నా తక్కువగాను, నత్రజనిని సిఫారసు చేసిన దానికన్నా రెండు, రెండున్నర రెట్లు ఎక్కువగాను, భాస్వరాన్ని సిఫారసు చేసిన దానికన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగాను వేస్తున్నారు. ఇలా భూసార పరీక్షలు చేయించకుండానే ఎరువులను ఎక్కువగా వేయడం వల్ల భాస్వరం, నత్రజని భూమిలోపలి పొరలకు ఇంకి నీరు కలుషితమవుతుంది. నేలలో పోషకాల సమతుల్యత లోపించి నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. పైర్లపై చీడపీడలు సోకి పంటనష్టం జరుగుతుంది ఎరువులను పొదుపు చేసే పద్ధతులు సిఫారసు చేసిన మోతాదు ఎరువులను మొక్క సమర్థంగా గ్రహించడానికి ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎరువుల మోతాదు, ఎరువులను వేసే పద్ధతి, ఎరువుల ఎంపిక. ఎరువులు పలు దఫాలుగా వేయడం. ఎరువుల మోతాదు: పంట వేసే ముందు భూసార పరీక్షలు చేసి ఎరువుల మోతాదును స్థిరీకరించాలి లేదా వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా వ్యవసాయ శాఖకు జిల్లాల వారీగా చేసిన ఎరువుల సిఫారసు మేర వేసే పైరును దృష్టిలో ఉంచుకొని ఎరువులను ఎంత మోతాదులో వేయాలన్నది నిర్ధారించుకోవాలి. ఎరువులు వేసే పద్ధతి: ఎరువు వేయటానికి పొలాల్లో ముఖ్యంగా నాలుగు పద్ధతులను అవలంబిస్తారు. సరైన పద్ధతిలో ఎరువులు వేస్తే మొక్కలు పోషకాలను బాగా వినియోగించుకుంటాయి. వెదజల్లే పద్ధతి: నేలను మెత్తగా దుక్కి చేసిన తర్వాత గాని, విత్తడానికి ముందుగాని, నాటే సమయంలో గాని, పైపాటుగా గాని, ఎరువులను నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పొలమంతా సమానంగా వెదజల్లాలి. ముఖ్యంగా ఈ పద్ధతి మాగాణి వరికి అనువైనది. మొక్కలు పొలంనిండా దగ్గర దగ్గరగా ఉండి, వరుసలులేని పైరుకు, వేర్లు భూమిలో బాగా అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా అనుకూలం. కాని పొలంలో ఎగుడు దిగుడులు లేకుండా, నీరు నిల్వకుండా, పొడినేల లేకుండా చూసుకోవాలి. మొక్క మొదళ్ల దగ్గర ఎరువు వేయడం: దూర దూరంగా మొక్క లుండి, వాటి వేర్లు తక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నప్పుడు, భూమిలో సత్తువ తక్కువగల నేలల్లో పెరిగే పంటల్లో మొక్కల వేర్లదగ్గర ఎరువులు వేయడంవల్ల పోషకాలను నేరుగా మొక్కలు తీసుకుంటాయి. గొర్రుతో వేయడం: సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ సహాయంతో విత్తనం, ఎరువును ఒకేసారి కావాల్సినంత దూరంలో, కావాల్సినంత లోతులో పడేలా వేయవచ్చు. విత్తనం మొలకెత్తగానే వేర్లకు పోషకాలు అందుబాటులోకి రావాలంటే విత్తనానికి 5 సెం.మీ లోతులో, 5 సెం.మీ దూరంలో పడేవిధంగా ఎరువు వేయాలి. ఈ పద్ధతి మెట్ట, ఆరుతడి పైర్లకు బాగా అనుకూలం. ఎరువు వేసేటప్పుడు విత్తనానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుంటల్లో వేయడం : మొక్కమెదళ్ల దగ్గర తేమ ఉన్నప్పుడు 6 లేదా 7 సెం.మీ. లోతు చిన్నగుంత తీసి ఎరువును వేసి మట్టితో కప్పాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వేర్లకు దగ్గరగా అందుబాటులో ఉండి సమర్థంగా ఉపయోగపడతాయి. వ్యర్థమయ్యే శాతం కూడా తక్కువగా ఉంటుంది. పత్తి, చెరకు, అరటి వంటి నీటివసతి కింద సాగుచేసే పంటలకు ఈ పద్ధతిలో ఎరువు వేయవచ్చు. వరుసల్లో వేయడం: సాళ్లలో మొక్కల మధ్యదూరం తక్కువగా ఉన్న పంటల్లో సాలుకు ఒకపక్క గాని లేదా రెండువైపుల 4 నుంచి 5 సెం. మీ. లోతుతో నాగలితోగాని, గొర్రుతోగాని సాలు తీసి దానిలో ఎరువు వేయాలి. ఈ పద్ధతి మెట్టపైర్లలో, ఆరుతడి పంటల్లో తగినంత తేమ ఉన్నప్పుడు పాటించవచ్చు. పండ్ల తోటలకు రింగు ప్లేస్మెంట్ పద్ధతిలో ఎరువులు వేయటం సాధారణంగా చెట్టు వయస్సును బట్టి దాని వేర్లు తలకట్టు వరకు వ్యాపించి ఉంటాయి. కనుక అంతవరకు పాదుచేయాలి. మొక్క వయస్సును బట్టి దాని మొదలు నుంచి ఒకటి లేదా ఒకటిన్నర అడుగుల దూరం వదిలి పాదును చేయాలి. పాదులో సిఫారసు మేరకు ఎరువులు చల్లి పారతో కలియబెట్టి బాగా మట్టిలో కలిసేలా చేయాలి. దీనివల్ల ఆవిరి ద్వారా పోషకాలు నష్టమయ్యే అవకాశముండదు. పెద్ద పెద్ద చెట్లకు చేసిన పాదుల్లో 4 మూలల నాలుగు చిన్న గుంతలను (30 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. లోతు) లేదా అదే లోతులో వలయాకారంగా గాడి తీసి అందులో ఎరువు వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. ఎరువులను ఇసుక నేలల్లో మూడు దఫాలుగా, బరువు నేలల్లో రెండు దఫాలుగా విభజించి వేయాలి. పైరుపై పోషకాల పిచికారీ: సహజంగా భూమిలో తగినంత తేమ లేనప్పుడు, సమస్యాత్మక భూముల్లో పోషకాలు అందించడానికి, ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సూక్ష్మ పోషకాల లోపం కనిపించినప్పుడు ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. మొక్కలు సూక్ష్మపోషకాలను నేలలో వేసిన దానికన్నా పిచికారీ పద్ధతిలో త్వరగా ఉపయోగించుకుంటాయి. అన్ని పైర్లపై, ఫల వృక్షాలపై 20-30 గ్రా. /లీ. నీటికి యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. అలాగే పప్పుధాన్య పైర్లపై, పత్తిలో పూత సమయంలో 20 గ్రా. /లీ. నీటికి డి.ఎ.పి. ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఎరువుల ఎంపిక విధానం ప్రధాన పోషకమైన నత్రజని యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ వంటి ఎరువుల రూపాల్లో లభిస్తుంది. నత్రజని రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. అలాగే పై ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇసుక పాళ్లు ఎక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలలకు, పంటలకు దుక్కిలో లేదా దమ్ములో పైపాటుగా యూరియా వేసుకోవాలి. ఆమ్ల భూములకు సల్ఫైడ్ ప్రమాదం గల భూములకు అమ్మోనియం సల్ఫేట్ వాడరాదు. కాని క్షారగుణం గల నేలలకు, సున్నపు పాళ్లు ఎక్కువగా ఉన్న నేలల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ను వరికి చిరుపొట్ట దశలో మాత్రమే వేయాలి. దమ్ములో, మొదటిసారి పైపాటు సమయాల్లో వేస్తే ఈ ఎరువులోని నైట్రేట్ నత్రజని వృథా అవుతుంది. ఎరువుల ధరలు (వ్యాపార ధర రూ.ల్లో)ఎరువు 2025 2026 పెరిగిన ధర (రూ.) 24-24-0 2000 2450 +450 20-20-0-13 1800 2150 +350 14-35-14 1900 2350 +450 12-32-12 1900 2450 +550 10-26-26 1950 2450 +500 16-16-16 1675 2050 +375 15-15-15-09 1650 1950 +300 16-20-0-13 1400 2000 +600 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 615 1000 +385 ఎం.ఓ.పి 1850 1975 +125 డి.ఏ.పి. 1350 1350 - యూరియా 266 266 - ఫాస్ఫేట్ ఎరువుల్లో సూపర్ ఫాస్పేట్ ప్రధానమైనది. ఇది సాధారణంగా అన్ని పైర్లకు సామాన్య స్థితి గల నేలలకు, క్షార నేలలకు వేయవచ్చు డైకాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటివి ఆమ్లగుణం గల నేలలకు వేసుకోవాలి. అయితే క్షార గుణం గల నేలలకు, సాధారణ పైర్లకు ఇవి ఉపయోగపడవు. కాఫీ, టీ, రబ్బరు తోటలకు, తోట వృక్షాలు, ఫల వృక్షాలు వంటి బహువార్షిక పంటలకు వేసుకోవచ్చు. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేయవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ లు అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడవచ్చు. నైట్రోఫాస్ఫేట్ లు మెట్ట. ఆరుతడి తోట పైర్లకు, ఎర్రనేలలకు, సాధారణ రసాయన స్థితిగల నేలలకు, కొద్దిపాటి ఆమ్లగుణం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను పాల చౌడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలల్లో వేయవచ్చు. అయితే పొగాకు పైరుకు దీన్ని వేస్తే ఆకు నాణ్యత తగ్గి పోతుంది. అలాగే నైట్రోఫాస్పేట్ లను వరి పైరుకు వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృథా అవుతుంది. ఎరువులను పలు దఫాలుగా వేయడం: వేసిన ఎరువుల్లోని పోషకాలను మొక్కలు సమర్థంగా ఉపయోగించుకోవాలంటే సరైన సమయంలో అవసరమైనన్ని సార్లు విభజించి వేయాలి. పంటల ముఖ్యదశలు, నేల స్వభావం, పైరు కాలపరిమితి, పైరుకు పోషకం అవసరమయ్యే దశలను దృష్టిలో ఉంచుకోవాలి. సాధారణంగా నత్రజనిని 2 నుంచి 4 సార్లు భాస్వరం ఒకేసారిగా, పొటాష్ ను రెండు సార్లుగా విభజించి వేయాలి. ఎరువుల ధరలను అంచనా వేసుకొనే విధానం ప్రస్తుతం 45 కిలోల బస్తాకు యూరియా రూ.266, సూపర్ ఫాస్పేట్ రూ.1000, పొటాష్ రూ. 1975 లుగా మార్కెట్లో ధర ఉంది. ఎరువుల బస్తాలపై పోషకాల శాతం అంటే 100 కిలోలకు సూచిస్తారు. సాధారణంగా ఎరువుల బస్తాలు 50 కిలోల ప్యాకింగ్ లో లభిస్తాయి. 45 కిలోల బస్తాల్లో యూరియాలో 21 కిలోల నత్రజని, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 8 కిలోల భాస్వరం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 30 కిలోల పొటాష్ పోషకాలుంటాయి. ఉదాహరణకు 18-46-0 కాంప్లెక్స్ బస్తాల్లో 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం ఉంటాయి. కనుక ఎరువుల్లో ఉండే పోషకాల శాతాన్ని బట్టి ధర లెక్కగట్టి చౌకగా లభించే ఎరువులను వాడాలి. రైతుల ధోరణి మారాలి పైన పేర్కొన్న పద్ధతులతో పాటు కింద సూచించిన విషయాలను కూడా పాటిస్తే అధిక దిగుబడులను సాధించడమే కాకుండా వ్యయాన్ని తగ్గించుకొని, నేల ఆరోగ్యాన్ని తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు. రైతులు పంటలకు వేయాల్సిన మోతాదు, ఎరువుల లక్షణాలు, వాడే విధానం, ధరలను దృష్టిలో ఉంచుకొని ఎరువులను కొనుగోలు చేయాలి. సూటి ఎరువులైన యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను విడివిడిగా కాని మూడింటిని పొలం వద్దే కలిపి కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువులను వాడటం, కంపోస్టు, వర్మీకంపోస్టు, చెరువుమట్టి, పచ్చిఆకు, పచ్చిరొట్ట పైర్ల ప్రాధాన్యతను రైతులు గుర్తించి వాటి వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. అంతర పంటలు సాగుచేసి నేలలోని పోషకాలు సరైన పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు , రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట, వ్యవసాయ పరిశోధన స్థానం, తోర్నాల