లిల్లీ పూల సాగు - పోషక యాజమాన్యం ఆంగ్లంలో ట్యూబ్ రోజ్, తెలుగులో నేల సంపంగి అంటారు. వీటి పూలు మంచి సువాసనతో ఉండి, విడి పూల గాను, కట్లవర్స్ గాను, శుభకార్యాలలో, దండలుగాను, బోకేల తయారీలకు, ఫ్లవర్ వెజ్ లలో అలంకరణకు, పరిమళ ద్రవ్యాల తయారీలకు ఉపయోగి స్తారు. పూల నుండి తీసే నూనెకు మంచి విలువ ఉంది. రకాలు సింగిల్ రకాలు : వీటిలో పూల రేకులు ఒక వరసలో అమరి ఉంటాయి. ఉదా: హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, మెక్సికన్ సింగిల్, ఫులే రజిని, ప్రజ్వల్, రజత్ రేఖ, శ్రింగార్, అర్కా నిరంతర. వీటిని విడి పూలగా, పూల దండల కొరకు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి కొరకు ఉపయోగిస్తారు. సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరసలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్. డబుల్ రకాలు : వీటిలో పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరసలో అమరి ఉంటాయి. ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలు బోకేల తయారీకి అనుకూలం. సాగు విధానం వాతావరణం : సమశీతోష్ణ స్థితిలో వేయదగినటువంటి పంట. 20° నుండి 35° సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం. బాగా సూర్యరశ్మి సోకే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. నీడ ఎక్కువగా ఉంటే మొక్కలు బలహీనంగా, పొడవుగా పెరుగుతాయి. నేలలు : వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సారవంతమైన ఒండ్రు నేలలు బాగా అనుకూలం. మురుగు నీరు నిలువకూడదు. నీరు నిలిచే భూముల్లో వేరు వ్యవస్థ దెబ్బతిని పెరుగుదల, పూత తగ్గిపోతుంది. నాటే పద్ధతి : మురుగు నీరు పోయే సమతల మడులు లేక ఎత్తైన మడులలో నాటుకోవాలి. ఎత్తైన మడులలో కలుపు నివారణకు మల్చ్ షీట్ వేసుకోవచ్చు, నీటిని బిందు సేద్యం ద్వారా అందించవచ్చు. ప్రవర్ధనం వాణిజ్యపరంగా లిల్లీలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దుంపలను పొలం నుండి తెచ్చిన తరవాత 30-45 రోజులు నీడలో ఆరబెట్టాలి. 2–3 సెం.మీ. వ్యాసం కలిగిన దుంపలను ఎంచుకున్నట్టైతే కాడ బలంగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి.1.5 సెం.మీ. కన్నా తక్కువ వ్యాసం కలిగిన దుంపలను ఎంచు కున్నట్టైతే పూల కాడలు. ఆలస్యంగా, చిన్నగా పూస్తాయి. దుంపలను నాటే ముందు బైటాక్స్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణంలో (లీటర్ కు 3గ్రా.) 30 నిముషాలు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవాలి. నాటే దూరం : దీనిని వరుసల మధ్య 30 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20 సెం.మీ. ఉండేటట్లు దుంపలను నాటుకోవాలి. పోషక యాజమాన్యం : సేంద్రియ ఎరువులతో (పశువుల ఎరువు ఎకరాకు 8-10 టన్నులు ) పాటు రసాయనిక ఎరువులు- నత్రజని, భాస్వరం, పొటాష్లను ఎకరాకు 80:80:80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును మూడు దఫాలుగా దుంపలు నాటిన తర్వాత 30,60,90 రోజులకు వేసుకోవాలి. పూత దశలో ఎరువులు : రకాలని బట్టి దుంపలు నాటిన 90-100 రోజులకు పూత మొదలవుతుంది. పూలు పెద్దవిగా, నాణ్యంగా ఉండి అధిక దిగుబడులు రావడానికి, ఈ దశలో మొక్కలకు అదనంగా ఎరువులు వాడాలి. పూత దశలో మూడవ దఫా నత్రజని తో పాటు 50 కిలోల వేప పిండి, 50 కిలోల పొటాష్ ఎరువులను వేసి మట్టిని మొక్కల వైపు ఎగదోయాలి. ఈ దశలో వేసిన నత్రజని మొక్కల్లో అధికంగా పిలకలు, పూల కాడలు రావడానికి ఉపయోగపడుతుంది. పొటాష్ ఎరువు పూల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇక వేప పిండి మొక్కలను కాండం, దుంప కుళ్ళు, నులిపురుగుల బెడద నుంచి కాపాడుతుంది. సన్యరక్షణ ట్యూబ్ రోజ్ పూలను తామర పురుగులు,పేనుబంక, మొగ్గ తొలుచు పురుగు, నిమటోడులు ఆశించే అవకాశం వుంది. కోత అనంతరం దుంపలను నిల్వచేసే పక్రియ లో దుంప తొలుచు పురుగులు ఆశించే అవకాశం వుంది. వీటి నివారణకు దుంపలను 1 మి.లీ. క్లోరిపైరిఫాస్ కలిపిన లీటరు నీటిలో 20 నిమిషాలు పాటు ఉంచాలి.రసం పీల్చే పురుగుల నివారణకు లీటర్ నీటికి 5 మి.లీ. వేపనూనెను కలిపి పిచికారి చేయాలి లేదా అసిటామిప్రిడ్ 0.4 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు : నివారణకు ఇమామేక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నిమటోడ్స్: నివారణకు కార్బో ఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 8-10 కిలోలు భూమిలో తడి వున్నపుడు వేసి నివారించవచ్చు. కాండం కుళ్ళు : నివారణకు గాను కార్బండిజమ్ లీటరుకు నీటికి 1 గ్రా. లేదా రిడోమిల్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు: ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ లీటరు నీటికి 1 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్ళు తెగులు : కోత అనంతరం దుంపలను నిల్వచేసే ప్రక్రియలో దుంప కుళ్ళు తెగులు ఆశించే అవకా శమున్నది. వీటి నివారణకు దుంపలను 1 గ్రా.కార్బండిజమ్ లేదా 3 గ్రా. కాపర్ఆక్సీక్లోరైడ్ కలిపిన లీటరు నీటిలో 30 నిమిషాలు పాటు దుంపలను ఉంచి నీడలో ఆరబెట్టాలి. తెగులు సోకిన మొక్కలలో ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమరంగుకు మారి ఎండిపోతాయి. తరువాత లేత ఆకులకు వ్యాపించి దుంపలు కుళ్ళి మెత్తబడిపోతాయి. నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి లేదా రిడోమిల్ ఎం.జడ్. గోల్డ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి ఆ ద్రావణంతో నేలను తడపాలి. దిగుబడి: ఎకరాకు 60,000- 70,000 పుష్ప గుచ్చాలు, 5-6 టన్నుల విడిపూలు, 6-8 టన్నుల విత్తన దుంపల దిగుబడిని పొందవచ్చు. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.సి.హెచ్. సాయి రత్న శర్వాణి అసిస్టెంట్ ప్రొఫెసర్, (పూల విభాగం), డా. వై.ఎస్సార్. ఉద్యాన విశ్వ విద్యాలయం, వి.ఆర్. గూడెం, పశ్చిమ గోదావరి.