పర్యావరణహిత వ్యవసాయానికి జీవన ఎరువులు జవన ఎరువు అంటే జీవం ఉండి, పంటలకు పోషకాలను సమకూర్చే సూక్ష్మ జీవుల మిశ్రమం. ఈ మిశ్రమం మొక్క వేర్లలో, నేలలో వాటి సంఖ్య వృద్ధి చేసుకొని మొక్కలకు పోషకాలను అందిస్తూ, నేల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి పర్యావరణహిత వ్యవసాయానికి దోహదపడుతుంది. జీవన ఎరువుల వాడకం అన్ని పంటల్లో వాడేందుకు వీలుగా వివిధ రకాలైన జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వివిధ పైర్లలో వాడుకుంటే రసాయనిక ఎరువుల వాడకం బాగా తగ్గించుకుని దాదాపు 25-30 శాతం ఖర్చు తగ్గించు కోవచ్చు. ఇవి ద్రవ, పొడి రూపాలలో అందుబాటులో ఉన్నాయి.ద్రవ జీవన ఎరువులు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే వీటిలోని సూక్ష్మజీవులు దాదాపు 6 నెలల నుంచి సంవత్సరము వరకు జీవించి ఉంటాయి. వీటిని డ్రిప్ లేదా సాగునీటి ద్వారా కూడా అందించవచ్చు. నత్రజని జీవన ఎరువులు గాలిలో ఉండే నత్రజని ని తీసుకొని, నేలలో స్థిరీకరించి మొక్కకు అందుబాటులో ఉంచుతాయి. పప్పుజాతి పంటలలో వేర్ల మీద ఉండే బుడిపెల్లో, రైజోబియం బయోఫెర్టిలైజర్ పప్పుదినుసుల పంటల నేల, వేరు బుడిపెల్లో వాతావరణ నత్రజని ని స్థిరీకరించి మొక్కకు అందుబాటులో ఉంచుతాయి. అవి ట్రైకాల్షియం, ఐరన్, అల్యూమినియం ఫాస్ఫేట్ల వంటి కరగని ఫాస్ఫేట్‌లను కరిగించి మొక్కకు అందుబాటులో ఉంచుతాయి. నేల పొరల నుంచి ఫాస్ఫేట్‌లను కరిగించి మొక్క వేర్లకు అందిస్తాయి. ఈ సూక్ష్మజీవులు, మొక్క ఎదుగుదలకు కావల్సిన జీవ రసాయనాలను, మొక్క వేర్ల ప్రాంతంలో స్రవించి, మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, యాంటీ మెటాబోలైట్లను ఉత్పత్తి చేసి, మొక్క రోగ నిరోదక శక్తిని పెంచుతాయి. జీవన ఎరువులలో ఉండే సూక్ష్మజీవులు, సేంద్రియ పదార్ధాన్ని కుళ్ళబెట్టి, మట్టిలో ఖనిజకరణకు సహాయపడతాయి. విత్తనం లేదా మట్టికి ఇవి పట్టించినప్పుడు, పోషకాల లభ్యతను పెంచుతాయి. నేల, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపకుండా దిగుబడిని 10-25% వరకు మెరుగుపరుస్తాయి. జీవన ఎరువుల ఆవశ్యకత రసాయన ఎరువుల ను విచక్షణా రహితంగా ఉపయోగించడం వల్ల నేల, నీరు కలుషితం అవుతాయి. మిత్ర పురుగులు నాశనం అయి, పంట రోగాల బారిన పడే అవకాశం ఉంది. భూసారం తగ్గుతుంది. రసాయనఎరువుల లభ్యత డిమాండ్ కంటే చాలా ఎక్కువ. స్థిరమైన వ్యవసాయానికి ముప్పు పెరుగుతోంది. జీవన ఎరువుల దీర్ఘకాలిక వినియోగం ఆర్థికంగా, పర్యావరణ అనుకూలంగా సమర్థవంతమైన, ఉత్పాదకతను పెంచడంలోను తోడ్పడుతుంది. ప్రయోజనాలు ఇది తక్కువ ధర, వాడకం సులభం. జీవన ఎరువులు పండ్లు, కూరగాయల పంటలలో 15-35% నాణ్యమైన దిగుబడిని పెంచుతాయి. వాతావరణ నత్రజనిని స్థిరపరచడంతో పాటు, అవి అనేక గ్రోత్ హార్మోన్లను (ఆక్సిన్, సైటోకైనిన్), విటమిన్లను సంశ్లేషణ చేసి మొక్కకు అందజేస్తాయి. ఇవి వాతావరణ కాలుష్యాన్ని కలిగించవు, భూసారాన్ని పెంచుతాయి. మొక్క రోగ నిరోధక శక్తి పెంచుతాయి. నేల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలను మెరుగుపరుస్తూనే, నీటిని పట్టి వుంచే సామర్థ్యాన్ని పెంచుతాయి. నీటి ఆధారము లేని నేలలో కూడా కొన్ని జీవన ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి. జీవన ఎరువులు పర్యావరణ అనుకూలమైనవి, పర్యావర ణానికి ఎటువంటి ప్రమాదం కలిగించవు. జీవన ఎరువులు వాడుతునప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు జీవన ఎరువులు ఉన్న ప్యాకెట్లను నేరుగా సూర్యకాంతిమరియు వేడికి దూరంగా ఉంచాలి. చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.ఏ పంటలకు ఎలాంటి జీవన ఎరువులు ఉపయోగించాలో తెలుసుకొని (ఉదాహరణకు పప్పు జాతి పంటలలో నత్రజని స్థిరీకరణ కొరకు రైజోబియం మరియు ధాన్య జాతి పంటలకు అజోస్పైరిల్లం మరియు ఇతర పంటలలో అజటోబాక్టర్ ) ఉపయోగించాలి. జీవన ఎరువులను ఇతర రసాయన ఎరువులతో కలిపి వాడకూడదు.ప్యాకెట్ గడువు ముగిసే లోపు వివిధ పంటలకు సిఫారసు చేసిన జీవన ఎరువులను సిఫారసు చేసిన పద్ధతిలో ఉపయోగిం చాలి.ఉత్తమ ఫలితాలను పొందడానికి నత్రజని, భాస్వరం జీవన ఎరువులు, రెండింటినీ ఉపయోగించాలి.సిఫారసు చేసిన రసాయనిక ఎరువుల వాడకంలో 75 శాతం, సేంద్రియ ఎరువులతో పాటు జీవ ఎరువులను ఉపయోగించడం ముఖ్యం. జీవన ఎరువుల వాడకంతో 25 శాతం రసాయనఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. వాడే విధానం విత్తన శుద్ది : ఒక కిలో విత్తనానికి 10మి.లీ చొప్పున జీవన ఎరువును గోనె సంచి లేదా ప్లాస్టిక్ సంచిలో విత్తనంతో పాటు వేసి మెల్లగా కలియదిప్పి, నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. విత్తనాలకు తేమ లేకుండా చూసుకోవాలి.నారు, పిలకలు (అలంకరణ మొక్కలు, దుంపలు, చెరకు ముచ్చెలు) : ఒక లీటరు నీటికి 10 మి.లీ కల్చర్‌ను లేదా 10 లీటర్లకు 100 మి.లీ జీవన ఎరువు కల్చర్ కలిపి ద్రావణంలో 15-20 నిమిషాలు ఉంచి (నారు వేర్లు, పిలక వేర్లు, దుంపలు మునిగేటట్లు చూసుకోవాలి) తరువాత పొలంలో నాటుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.ఇ. శిరీష, శాస్త్రవేత్త (కీటక విభాగం), కె.వి.కె, కళ్యాణదుర్గం, అనంతపురం