అందమైన గులాబీల కోసం పూల 'లలో రారాణి అయిన గులాబీ ప్రపంచ పూల మార్కెట్లో మొదటి స్థానంలో ఉండి, కట్ ఫ్లవర్ సాగులో ప్రధమ స్థానంలో ఉంది. వాణిజ్యపరంగా బయట ప్రదేశంలో విడిపూల కోసం, పాలిహౌస్ ల్లో కట్ ఫ్లవర్ సాగుకు అనువైన బహువార్షిక పూల పంట. మొక్కలు నాటిన ఆరు నెలల నుంచి వూల దిగుబడిని ఇస్తూ, 7-8 సంవత్సరాల వరకు సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి. ఎండుతెగులు కత్తిరింపులు చేసినపుడు మొక్కలలో ఎండుతెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కపైభాగం నుంచి కిందకు వాడిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుంచి మొదలవుతుంది.తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుకు మారతాయి. కాండం, వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణ : కొమ్మకత్తిరింపులకు ముందుగా ట్రైకోడెర్మా హర్జియానం పశువుల ఎరువులో కలిపి మొక్కల మొదళ్ళలో వేసి కలపాలి. కత్తిరింపుల తరువాత కాపర్ ఆక్సీక్లోరైడ్3 గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళలో మొక్కకు 100-110 మి.లీ. చొప్పున వేయాలి. బూడిద తెగులు ఆకులపై బూడిద వంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచు కొనిపోతాయి. లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి. పూల రేకులు రంగు మారి వడలి, ఎండిపోతాయి. నివారణ : నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా కార్బండిజం 1 గ్రా. లేదా మైక్లోబ్యుటానిల్ 1 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా రైనోకాప్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లమచ్చ తెగులు గుండ్రటి నల్ల మచ్చలు ఆకులకు రెండు పక్కలా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి. వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నివారణ : బెనోమిల్ 1 గ్రా. లేదా కార్బంం 1గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తుప్పు తెగులు తెగులు ఆశించిన ఆకులపై ఉబ్బెత్తు, గరుకు మచ్చలు ఏర్పడతాయి. నివారణ : వెట్టబుల్ సల్ఫర్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా అక్సీకార్బాక్సీన్ అనే మందును 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ, పువ్వు కుళ్ళు తెగులు ఈ తెగుళ్ళు ఆశించిన గులాబి మొక్కల మొగ్గలు వడలి కుళ్ళిపోతాయి. ఈ తెగులు ఆశించినపువ్వులు వికసించవు. వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నివారణ : బెనోమిల్ 1 గ్రా. లేదా కార్బండిజం 1 గ్రా. లేదా థయోఫినైట్ మిథైల్ 1 మి.లీ. లేదా ఇస్రోడియాన్ 1 మి.లీ. మందులు ఏదో ఒకదాన్ని లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు డా.జి. అమృత వీణ, శాస్త్రవేత్త (సస్య విభాగం), కె. వి.కె., రస్తా కుంటుబాయి, పార్వతీపురం మన్యం.