కూరగాయల పంటల్లో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యత ప్రస్తుత పరిస్థితుల్లో రసాయ ఎరువుల ధరలు అధికంగా ఉండడం, పశువుల ఎరువు కొరత వలన వివిధ పంటలలో జీవన ఎరువుల ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ, భూమిలో పోషకాల సమతుల్యతను కాపాడి, తక్కువ ఖర్చుతో సుస్థిర, అధిక దిగుబడులు సాధించాలంటే పంటల్లో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కూరగాయ పంటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యంలో జీవన ఎరువులు వాడకం ముఖ్యమైన అంశంగా నేల ఆరోగ్యం, ఫలదత, పంట దిగుబడి, నాణ్యత పెంచడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. జీవన ఎరువులు అంటే సజీవ లేదా క్రియారహిత రూపంలో ఉన్న సూక్ష్మజీవుల సముదాయం. జీవన ఎరువులనేవి వాటంతట అవి ఎరువులు కావు. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువుల మాదిరి వీటిలో పోషకాలు ఉండవు. సహజసిద్ధంగా నేలలో ఉన్న సూక్ష్మజీవులు, నాచు, స్వతంత్రంగా కానీ, మొక్కలతో కలిసి (వేరు మండలంలో విత్తనంపై మొక్కల ఉపరితల లేదా లోపలి భాగాలలో) నివసిస్తూ జరుపు ప్రక్రియలలో పంటలకు కావాల్సిన పోషకాలను వాతావరణం లేదా నేల నుండి గ్రహించి మొక్కలకు అందిస్తాయి. జీవన ఎరువు వాడకం – ఉపయోగాలు కూరగాయల సాగులో జీవన ఎరువులు వాడకం పెంచడం ద్వారా 20-25 శాతం దాకా రసాయన ఎరువులు వాడకం తగ్గించవచ్చు. ఇవి వాతావరణంలోని నత్రజని స్వీకరిస్తాయి. నేలలోని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది. నేల నుండి సంక్రమించే తెగుళ్ళు కొంత వరకు నిరోధించబడతాయి. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి. జీవన ఎరువుల్లో రకాలు రైజోబియం వాతావరణంలో నత్రజని 78 శాతం వరకు ఉంటుంది. రైజోబియం బాక్టీరియా మొక్క వేర్లకు గులాబి రంగు కలిగి బుడిపెలు కలుగజేసి వాటితో సహజీవనం చేస్తూ వాతావరణంలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని అమ్మోనియం ఆయాన్ లాగా మార్పిడి చేసి మొక్కలకు అందజేస్తుంది. ఈ బాక్టీరియాను లెగ్యూమ్ జాతి మొక్కలలో ముఖ్యంగా బఠాణి, చిక్కుడు, ఫ్రెంచి చిక్కుడు వంటి కూరగాయల పైర్లలో వాడతారు. ఈ బాక్టీరియా ఎకరానికి 20-80 కిలోల వరకు నత్రజనిని స్థిరీకరించగలవు. రైజోబియం బాక్టీరియా ఎంత నత్రజనిని స్థిరీకరించగలవు అనేది భూమి పరిస్థితి ముఖ్యంగా భూమిలో గాలి, డ్రైనేజి వ్యవస్థ, భూమి పదును, ఉదజని సూచిక, భూమిలో ఉండే యాక్టివ్ కాల్షియం ప్రభావితం చేస్తాయి. రైజోబియం కల్చర్ వాడడం వల్ల ఎకరానికి 25-30 శాతం దిగుబడి పెరిగే అవకాశం ఉంది. 15-30 కిలోల వరకు నత్రజని భూమిలో నిల్వ ఉంచి తర్వాత వేసే పంటకు ఉపయోగపడుతుంది. వాడే విధానం ఒక లీటరు నీటిలో 50గ్రా. బెల్లం లేదా చక్కెర కరిగించి 15 నిమిషాల పాటు మరగబెట్టి చల్లార్చాలి. బెల్లం లేదా చక్కెర నీళ్లలో 200 గ్రా. రైజోబియం కల్చర్ కలిపి జావగా తయారు చేయాలి. ఒక ఎకరానికి వాడదలచుకున్న విత్తనానికి రైజోబియం జావ కలపాలి. ఇలా కల్చర్ కలిపిన విత్తనాలను సుమారు 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అజటోబాక్టర్ ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు. ఇవి మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజనిని స్థిరీకరించి నైట్రేట్ రూపంలోకి మార్చి మొక్కలకు అందజేస్తాయి. కొద్దిపాటి క్షారగుణం గల నేలలకు అజటోబ్యాక్టర్ జాతి అనువైనది. ఇది కొన్ని కూరగాయ పంటల్లో పెరుగుదలకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు ఉత్పత్తి చేస్తుంది. అజటోబాక్టర్ ఎకరానికి 8-16 కిలోల నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఇవి మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని, బెట్టను తట్టుకునే శక్తిని కూడా పెంచుతాయి. ఇది ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువ ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ జీవన ఎరువును బెండ, వంగ, కాలీఫ్లవర్, ఇతర కూరగాయల పంట పొలాల్లో వాడవచ్చు. వాడే విధానం నారు ద్వారా అయితే ఒక కిలో జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేయాలి. ఒక ఎకరాకు సరిపడే నారును చిన్న చిన్న కట్టలుగా కట్టి ఈ మిశ్రమంలో 15-20 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత మొక్కలు నాటాలి. నేల ద్వారా అయితే 2-3 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల మట్టితో గాని లేక సేంద్రియ ఎరువులో గాని కలిపి పంట విత్తే ముందు నేలలో తేమను చూసి చల్లుకోవాలి. ఈ అజటోబాక్టర్ జీవన ఎరువు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. అజోస్పైరిల్లం వీటిని సహవాసి సూక్ష్మజీవులు అని పిలుస్తారు. ఇవి వివిధ పంటల వేర్ల మీద లేదా వేర్ల దగ్గర జీవిస్తాయి. ఇవి గాలిలో నత్రజనిని తీసుకుని వేర్ల మీద స్థిరీకరించగలవు. వేర్ల దగ్గర అవసరమైన హార్మోన్లు విసర్జించడం వలన మొక్క చురుకుగా పెరుగుతుంది. ఇవి ఎకరానికి 8-16 కిలోల నత్రజనిని స్థిరీకరించగలవు. వీటిలో అజోస్పైరిల్లం, లిఫోఫెరమ్ రకాలు అనువైనవి. ఈరెండు రకాలను టమాట, వంగ, బెండ, ఇతర కూరగాయల పంటలలో వాడవచ్చు. ఈ జీవన ఎరువులను వాడి ఎకరానికి 25-30 శాతం వరకు మనం వేసే నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. ఈ కల్చర్‌ను కూడా అజటోబాక్టర్ వాడే పద్ధతిలోనే, అదే మోతాదులో ఉపయోగించి మంచి దిగుబడులు. సాధించవచ్చు. అజటోబాక్టర్ కన్నా ఎక్కువ నత్రజనిని స్థిరీకరించి తక్కువ సేంద్రియ పదార్థం గల నేలలో కూడా అజోస్పైరిల్లం బాగా అభివృద్ధి చెందుతుంది. భాస్వరం లభ్యతను పెంచే జీవన ఎరువులు కొన్ని రకాల సూక్ష్మజీవులు లభ్యంకాని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకొని వస్తాయి. వీటిలో రెండు రకాలు - ఒకటి భూమిలో నిల్వ ఉండే భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫోబాక్టీరియా, ఇంకొకటి దూరంగా ఉండే భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకువచ్చే మైకోరైజా. భాస్వరం కరిగించే జీవన ఎరువులు ఫాస్ఫోబాక్టీరియా వీటిని ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా ఫాస్ఫో బాక్టీరియా అంటారు. వీటిలో బాసిల్లస్, సూడోమోనాస్ సూక్ష్మజీవులు, ఆస్పర్జిల్లస్, పెన్సిలియం శిలీంధ్రాలు ముఖ్యమైనవి. ఇవి నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. ఈ జీవన ఎరువుతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి. ఫాస్ఫోబాక్టీరియా సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకుని కొన్ని రకాల సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తుంది. వీటి నుండి తయారయ్యే సేంద్రియ ఆమ్లాల వల్ల భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని ట్రైకాల్షియం ఫాస్ఫేట్ రూపంలోకి మొక్కలకు లభ్యమయ్యే విధంగా తీసుకువచ్చి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. మొక్క వేర్ల దగ్గర వీటి చర్య చురుకుగా ఉండి జీవక్రియకు తోడ్పడతాయి. వీటి వాడకం వలన సిఫార్సు చేసిన మోతాదు నుండి ఎకరానికి 10–12 కిలోల భాస్వరం ఎరువును తగ్గించుకోవచ్చు. ఈ ఫాస్ఫోబాక్టీరియాను అన్ని కూరగాయ పంటల్లో వాడవచ్చు. వాడే విధానం 200-400 గ్రా. ఫాస్ఫోబాక్టీరియా జీవన ఎరువును ఎకరానికి సరిపడే విత్తనానికి పట్టించవచ్చు. 1–2 కిలోల కల్చర్‌ను సుమారు 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో దుక్కిలో వేయవచ్చు. వెసిక్యులర్ బస్కులార్ మైకోరైజా (వి.ఎ.ఎం.) వీటిని ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా అని కూడా అంటారు. ఇది శిలీంధ్రపు జాతికి చెందిన జీవన ఎరువు. వీటిలో గ్లోమస్, గైగాస్ఫోరా అనే శిలీంధ్ర రకాలు ముఖ్యమైనవి. ఇవి వేరువ్యవస్థపై కవచంలాగా ఉండి, వేరు విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఇవి వేరు మండలం మీద మొక్కలతో కలిసి మైత్రితో అతిధిగా జీవిస్తాయి. మైకోరైజా శిలీంధ్రపు మూలాలు వేర్లతో వాటిపై పొరలలోకి లోపలి పొరలలోకి కూడా చొచ్చుకొని పోగలవు. ఇవి ఆహారానికి మొక్కలపై ఆధారపడతాయి. దీనికి బదులుగా ఇది మొక్క చేరలేని భూమి అడుగు పొరల్లోకి చొచ్చుకొని పోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, రాగి, మాంగనీసు, ఇనుము మొదలగు వాటిని నీటితో సహా అందిస్తాయి. మైకోరైజా వాడిన మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ శిలీంధ్రాలు ఒక రక్షణ కవచం వలె ఏర్పడడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడం గమనించవచ్చు. ఈ కల్చరును కూడా ఫాస్ఫోబాక్టీరియా వాడే పద్ధతిలోనే అదే మోతాదులో అన్ని కూరగాయ పంటల్లో వాడవచ్చు. పొటాషియం అందించే జీవన ఎరువులు ఈ జీవన ఎరువును ముఖ్యంగా ప్రటూరియా ఆరషియా అనే బాక్టీరియాతో ఇటీవల కాలంలో తయారు చేస్తున్నారు. దీనితో పాటు బాసిల్లస్ జాతులు కలిపి మిశ్రమంగా తయారు చేస్తున్నారు. పొటాష్ మొబిలైజింగ్ సూక్ష్మజీవులు విడుదల చేసే రసాయనాలు, ఎంజైమ్‌లు వలన నేలలో కరగనటువంటి పొటాషియం పదార్థాలను కరిగించి మొక్కలకు అందజేస్తుంది. ఈ జీవన ఎరువులు అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడవచ్చు. జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జీవన ఎరువు ప్యాకెట్లను ఎండ వేడి తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండాలి. ప్యాకెట్‌పై ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులను వాడరాదు. రసాయనాలతో విత్తనశుద్ధి చేసేటప్పుడు విడిగా 24-48 గంటల వ్యవధి ఉండాలి. జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయడానికి నాణ్యత గల కల్చరు వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడాలి. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.జి.చంద్రమౌళి, డా.ఆర్, ప్రీతమ్ గౌడ్, డా.బి.ఎస్. కె. నిఖిల్, డా.వి. సురేష్, కూరగాయల పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం