కూరగాయ పంటలలో కలుపు మందుల వాడకం ఈ మధ్యకాలంలో కూరగాయ పంటల సాగులో ఎదురవుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కూలీల కొరత వలన కలుపు నివారణ ప్రధాన సమస్యగా మారింది. కలుపు మొక్కలు పోషకాలు, నీరు, వెలుతురు కోసం ప్రధాన పంటతో పోటీపడటమే కాకుండా తెగుళ్లు, పురుగులకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. దీనివలన పంట నాణ్యత, దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఎక్కువశాతం కూరగాయలలో పంట నాటిన మొదటి 20-40 రోజులు కలుపు నియంత్రించడానికి అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో కలుపును సమర్థవంతంగా నియంత్రించలేకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. ఇటువంటి పరిస్థితులలో రసాయనిక మందులు వాడి కలుపు నివారణ చేయడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు.మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు తెలుకొన్నాకే వాడాలి. సాధారణంగా కలుపు మందులను తేలికపాటి (ఇసుక, గరప) నేలల్లో తక్కువ మోతాదు, సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదుల్లోనూ, ఎర్ర నేలల్లో మధ్యస్తంగా వాడాలి. ప్రధానంగా ఇవి రెండు రకాలు. ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు: ఈ కలుపు మందులు పంట, కలుపు మొక్కలు మొలవకముందే అంటే విత్తిన 24-48 గంటల్లోపే తగిన తేమ గల నేలపై పిచికారీ చేయాలి. ఈ కలుపు మందుని వాడినపుడు అన్ని రకాల పంటల్లో అవసరమయినపుడు 25-40 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి లేదా చేతితో కలుపు తీయాలి. పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు: ఈ రకమైన కలుపు మందులు పంట, కలుపు మొలిచాక, కలుపు 3-4 ఆకుల దశకు చేరాక కలుపుపై పిచికారీ చేయాలి. రైతులు, కలుపుమందు డబ్బాపైన ఉత్పత్తి ఎక్స్‌పయిరీ తేదీ తదితర విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని, రశీదు అడిగి తీసుకోవడం మరువద్దు. కూరగాయలు- కలుపు మందులు సాగు చేసే కూరగాయ పంటను బట్టి తగిన కలుపు మందును పిచికారీ చేయాలి. టమాట ప్రీ ఎమర్జెన్స్: పెండిమిథాలిన్ కలుపు మందుని ఎకరానికి ఒక లీటరు అంటే లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలిపి విత్తిన లేదా నాటిన 24-48 గంటల్లోపు తేమగల నేలపై పిచికారీ చేసుకోవాలి. 20-25 రోజుల మధ్యన ఒకసారి అంతర కృషి చేసుకోవాలి.పోస్ట్ ఎమర్జెన్స్: టమాట నాటిన 15-20 రోజుల్లోపు మెట్రిబుజిన్ అనే మందుని ఎకరానికి 300 గ్రాములు అంటే లీటరు నీటికి 1.5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మిరప, వంగ పెండిమిథాలిన్ కలుపు మందుని ఎకరానికి 1-1.5 లీ. అంటే లీటరునీటికి 5-7మి.లీ. కలిపి విత్తిన లేదా నాటిన 24-48 గంటల్లోపే పిచికారీ చేయాలి. ఉల్లి / వెల్లుల్లి ఆక్సీఫ్లోర్ఫెన్ అనే మందును 250-300 మి.లీ. అనగా లీటరు నీటికి 1.25 - 1.5 మి.లీ. లేదా అక్సిడయార్జిల్ 400మి.లీ. అంటే లీటరు నీటికి 2 మి.లీ. లేదా పెండిమిథాలిన్ 1-1.25 లీ. అంటే లీటరు నీటికి 5.0-6.0 మి.లీ. చొప్పున కలిపి నాటిన 24-48 గంటల్లోపే తేమగల నేలపై పిచికారీ చేసుకోవాలి. బెండ పెండిమిథాలిన్ కలుపు మందుని విత్తిన 24-48 గంటలలోపు ఎకరానికి 1.25 లీటర్లు అనగా లీటరు నీటికి 6 మి.లీ. చొప్పున కలిపి తేమగల నేలపై పిచికారీ చేసుకోవ కాలిఫ్లవర్ ఆక్సీఫ్లోర్ ఫెన్ కలుపు మందుని నాటే 1–2 రోజుల ముందు ఎకరానికి 200మి.లీ. అనగా లీటరు నీటికి 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి లేదా పెండిమిథాలిన్ మందుని ఎకరానికి 1.25 లీటర్లు అనగా లీటరు నీటికి 6 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. క్యాబేజీ పెండిమిథాలిన్ కలుపు మందుని ఎకరానికి 1.0 – 1.25 మి.లీ. అంటే లీటరు నీటికి 5 - 6 మి.లీ. లేదా ఆక్సీఫ్లోర్ఫెన్ కలుపు మందుని ఎకరానికి 200 మి.లీ. అనగా లీటరు నీటికి 1.0 మి.లీ. చొప్పు న కలిపి నాటే రెండు రోజుల ముందు పిచికారీ చేయాలి. క్యారెట్ ప్రీ ఎమర్జెన్స్: పెండిమిథాలిన్ కలుపు మందుని ఎకరానికి ఒక లీటరు అంటే లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలిపి విత్తిన 24-48 గంటల్లోపు తేమగల నేలపై పిచికారీ చేసుకోవాలి. 20-25 రోజుల మధ్యన ఒకసారి అంతర కృషి చేసుకోవాలి.పోస్ట్ ఎమర్జెన్స్: మెట్రిబుజిన్ అనే మందుని ఎకరానికి 300 గ్రాములు అంటే లీటరు నీటికి 1.5 గ్రాములు చొప్పున కలిపి విత్తిన 15-20 రోజుల్లోపు పిచికారీ చేయాలి. బంగాళదుంప (ఆలుగడ్డ) మెట్రిబుజిన్ 400 గ్రాములు అనగా లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి విత్తిన 1-2 రోజులలో తేమగల నేలపై పిచికారీ చేసుకోవాలి. పందిరి కూరగాయలు (ఉదా: బీర, కాకర, సోర వంటివి) పెండిమిథాలిన్ మందుని 1.0 నుండి 1.25 లీటర్లు అనగా లీటరు నీటికి 5,0 నుండి 6 మి.లీ. చొప్పున కలిపి విత్తిన 24–48 గంటల్లోపే. తేమ నేలపై పిచికారీ చేసుకోవాలి. ఆకు కూరలు పెండిమిథాలిన్ 800 మి.లీ. ఎకరానికి అంటే లీటరు నీటికి 4 మి.లీ. కలిపి విత్తిన వెంటనే అంటే 24 గంటల్లోపే పిచికారీ చేసుకోవాలి.పైన తెలిపిన కూరగాయ పంటలన్నింటి లోనూ గడ్డిజాతి కలుపు అధికంగా ఉంటే క్విజాలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందుని ఎకరానికి 400 మి.లీ. అనగా లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి 15-20 రోజుల మధ్య పిచికారీ చేయాలి. కలుపు మందుల పిచికారీ సమయంలో జాగ్రత్తలు సరైన నాజిల్ ఎంపిక: కలుపు మందుల పిచికారీకి ఉపయోగించే నాజిల్స్ పంట రకం, మందు రకం, ఉపయోగించే పద్దతి ఆధారంగా మారతాయి. కూరగాయ పంటలలో కలుపు పై సమర్థవంతంగా మందు పడేందుకు సరైన నాజిల్వాడటం చాలా ముఖ్యమైనది. సురక్షిత దుస్తులు ధరించాలి: చేతి తొడుగులు, ముక్కు, నోటి కవచాలు (మాస్కు), గాగుల్స్, బూట్లు వంటి రక్షణ వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. గాలి దిశను గమనించాలి: గాలి ప్రవాహం ఉన్న దిశకు ఎదురుగా కాకుండా, అదే దిశలో పిచికారీ చేయాలి. లేదంటే కలుపు మందు పిచికారీ చేసే వ్యక్తిపై పడే ప్రమాదం ఉంటుంది. మద్యం లేదా పొగతాగిన తరువాత పిచికారీ చేయవద్దు: పిచికారీ సమయంలో పూర్తిగా సుద్దంగా ఉండాలి. మద్యం తాగినవారు పిచికారీ చేయరాదు. పిచికారీ తర్వాత చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కోవాలి : సబ్బుతో బాగా కడుక్కోవడం వలన జబ్బులు రాకుండా నివారించవచ్చు. పిచికారీ చేసే పరికరాలను శుభ్రంగా ఉంచాలి: ప్రతి వాడకం తర్వాత పరికరాలను శుభ్రంగా కడిగి భద్రంగా ఉంచాలి. పంటలో పని చేసే ఇతర వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి: ఎప్పుడు, ఎలాంటి కలుపు మందు పిచికారీ చేస్తున్నారో తెలిపి, వారు దాని ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బాలురు, గర్భిణీలు లేదా పశువులను దూరంగా ఉంచాలి: పిచికారీ చేసే సమయంలో, దాని తర్వాత కొన్ని గంటల పాటు వారిని దూరంగా ఉంచడం మంచిది. మోతాదును పాటించాలి: లేబుల్‌పై సూచించిన విధంగా మాత్రమే మోతాదును వాడాలి. ఎక్కువ మోతాదు వాడడం వల్ల పంటకు నష్టమవచ్చు. ముఖ్య గమనిక: పంటల రక్షణ కోసం కలుపు మందుల వాడకం అవసరం కానీ, అవి మానవ ఆరోగ్యం, పర్యావరణానికి హానికరం కావచ్చు. కనుక పై జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ఆధారం: పాడిపంటలు డా. ఎం. సునీల్ కుమార్, డా. కస్బీ సుదాన్సు సుధాకర్, డా. శ్రీధర్ చౌహాన్, డా. జి. మంజులత, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్