ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వానాకాలం పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ప్రస్తుత ఖరిఫ్ -2026 సీజన్లో ఎల్-నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రవేశం, విస్తరణ కొంతమేర ఆలస్యమైంది. ఫలితంగా జూన్ నెలలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సాధారణం కంటే 20–40% వరకు తక్కువ వర్షపాతం నమోదవగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 38-42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అదే సమయంలో గాలిలోని తేమ శాతం 45-60% మధ్య ఉండటంతో నీటి ఆవిరీకరణ రేటు రోజుకు సుమారు 5-7 మి.మీ. వరకు పెరిగి, ముఖ్యంగా 0-30 సెం.మీ. భూమి పొరలలోని తేమ గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితుల కారణంగా వర్షాధార ప్రాంతాల్లో విత్తనాల మొలక ఆలస్యం కావడం, మొలక శాతం తగ్గడం, బలహీన వేర్లవ్యవస్థ ఏర్పడటం, శాఖీయ పెరుగుదల మందగించడం, నత్రజని, భాస్వరం వంటి పోషకాల గ్రహణం తగ్గడం వల్ల పంటలు ప్రారంభ దశలోనే తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఉత్తర తెలంగాణ (ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల) జిల్లాల్లో నల్లరేగడి నేలలు అధికంగా ఉండటం వల్ల తేమను నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ఎల్-నినో ప్రభావం రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే కొంత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ జూన్ నెలలో వర్షాల ఆలస్యం కారణంగా పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది పంటల విత్తనాలు ఆలస్యమయ్యాయి. వర్షాల మధ్య విరామం ఎక్కువ ఏర్పడినప్పుడు పంట పెరుగుదల మందగించడం, వేర్ల విస్తరణ తగ్గడం, పోషకాల సంగ్రహణ సామర్థ్యం తగ్గడం, వరిలో పిలకల సంఖ్య తగ్గడం, ఇతర పంటల్లో పూత, కాత రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. మధ్య తెలంగాణ (సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు) జిల్లాల్లో ఎల్-నినో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో వర్షపాతం అసమానంగా కురవడం వల్ల భూమిలోని తేమ తరచూ తగ్గి మళ్లీ పెరగడం వల్ల మొక్కలు నత్రజనిని నమర్థవంతంగా ఉపయోగించుకోలేక పోయాయి. తద్వారా ఆకులు పసుపురంగులోకి మారడం, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల పంట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమిలోని సూక్ష్మజీవుల జీవక్రియలు తగ్గి, నేలలోని సేంద్రియ పదార్ధాల విచ్ఛిన్నం నెమ్మదిగా జరిగడం వల్లన పోషకాల లభ్యత తగ్గి పంటల వేర్ల వ్యవస్థ బలహీనపడి దిగుబడి తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది. దక్షిణ తెలంగాణ (మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్) జిల్లాల్లో ఎల్-నినో ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉండటంతో జూన్, జులై నెలల్లోని వర్షాబావం వల్లన విత్తనాలు విత్తడం ఆలస్యమవడం లేదా తిరిగి విత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమిలో తేమ శాతం తీవ్రంగా తగ్గిపోవడం వల్ల మొలక శాతం తగ్గడం, కీరణ జన్య సంయోగ క్రియ రేటు తగ్గడం, మొక్కలు చనిపోవడం వల్లన దిగుబడిలో గణనీయమైన తగ్గుదల ఏర్పడుతుంది. ఈ తరుణంలో రైతులు సాధారణ వ్యవసాయ పద్ధతులకు బదులుగా వాతావరణ – అనుకూల, వనరులను నమర్థవంతంగా వినియోగించుకునే యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలి. వరి ప్రస్తుత ఎల్-నినో పరిస్థితుల్లో వరి సాగులో నీటి, పోషక వినియోగ సామర్థ్యం పెంచడం అత్యంత కీలకం. నీటి లభ్యతను అంచనా వేసుకొని మాత్రమే రైతులు వరి నాట్లకు సన్నద్ధం అవ్వాలి. కాలువల ద్వారా నీటి సరఫరా సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో దీర్ఘకాలిక (150-160 రోజులు) రకాల స్థానంలో మధ్యస్థ (125–140 రోజులు) లేదా స్వల్పకాలిక (110–125 రోజులు) వరి రకాలను సాగు చేయడం ద్వారా పంట చివరి దశ వరకు నీటి ఎద్దడిని అధిగమించవచ్చు. వరి పొలాల్లో నిరంతరం 5-7 సెం.మీ. నీటిని నిల్వ ఉంచే పద్ధతికి బదులుగా, ఆల్బర్నేట్ వెట్టింగ్, డ్రైయింగ్ విధానాన్ని అనుసరించాలి. ఈ విధానంలో నీటి మట్టం నేల ఉపరితలం నుండి 10-15 సెం.మీ. దిగువకు పడిన తర్వాత మాత్రమే తిరిగి 5 సెం. మీ. వరకు పంటకు నీరు పెట్టాలి. దీంతో దిగుబడి తగ్గకుండా, 20-30% వరకు సాగునీరు ఆదా కావడంలో పాటు, మీథేన్ ఉద్గారాలు 30-50% వరకు తగ్గుతాయి. ఎల్-నినో పరిస్థితులు పుష్పించే, గింజ నిండుకునే దశలో ఉన్నట్లయితే 196 పొటాషియం నైట్రేట్ 10 గ్రా. /లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల పంట ఒత్తిడికి గురవకుండా, ఎంజైమ్‌ల క్రియాశీలత మెరుగుపడి దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చును. ఈ పరిస్థితుల్లో నత్రజని ఎరువులను ఒకేసారి వేయకుండా, సిఫారస్ చేసిన మొత్తం 50 కిలోల నత్రజని (108 కిలోల యూరియా)ని ఒక ఎకరానికి మూడు నుండి నాలుగు విడతలుగా వేసుకోవాలి. ఈ విధంగా విడతల వారిగా నత్రజనిని వినియోగించడం వల్ల పంటకు వేసిన నత్రజనిని కోల్పోకుండా, వినియోగ సామర్థ్యం పెరిగి, పిలకల సంఖ్య, గింజల బరువు పెరిగి దిగుబడి మెరుగుపడుతుంది. అలాగే లీఫ్ కలర్ చార్జ్ ఆధారంగా నత్రజని ఎరువుల మోతాదును నిర్ణయించడం ద్వారా ఎల్- నినో పరిస్థితుల్లో వరి దిగుబడిని స్థిరంగా ఉంచుకోవచచ్చును. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా ఆకు ముడత పురుగు, కాండం తొలిచే పురుగు, గోధుమ తల దోమ ఉధృతి, అలాగే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లెట్, షీత్ బ్లెట్ వంటి వ్యాధుల ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి సిఫార్సు చేసిన పురుగు మందులు / శిలింధ్రనాశకాలను వినియోగిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. పత్తి ఈ ఎల్-నినో పరిస్థితుల్లో పంటలో తేమ ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కిరణజన్య సంయోగక్రియ తగ్గి పూత, కాత రాలడం 20-40% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు అంతర కృషి చేయాలి, అలాగే వరుసల మధ్య పంట అవశేషాలు లేదా సేంద్రీయ మల్చింగ్ (5-6 టన్నులు/హెక్టారు) వేయడం ద్వారా పంట పొలంలో నీటి భాష్పీభవన నష్టాలను 20-30% వరకు తగ్గించవచ్చు. ఈ పంటకు సిఫార్సు చేసిన 50 కిలోల నత్రజని (108 కిలోల యూరియా), 24 కిలోల (40 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ / ఎకరానికి) పొటాషియం ఎరువులను నత్రజని ఎరువులతో సమన్వయంగా ఎకరానికి ఒకేసారి వేయకుండా మూడు నుండి నాలుగు విడతలుగా నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే పైపాటుగా ఎరువులను వేసుకోవాలి. తేమ ఒత్తిడిని తగ్గించి పుష్పాలు, పత్తి కాయలు రాలడంను నివారించడానికి పుష్పించే దశ, కాయలు ఏర్పడే దశలో 10–15 రోజుల వ్యవధిలో రెండుసార్లు 1% పొటాషియం నైట్రేట్ లేదా 1% 19:19:19 (10 గ్రా./లీటరు నీటికిను పిచికారీ చేసుకోవాలి. మెగ్నీషియం లోపం ఉన్న నేలల్లో 196 మెగ్నీషియం సల్ఫేట్, 1% యూరియాను లీటరు నేటికీ కలిపి పిచికారీ చేయడం వల్ల ఆకుల పచ్చదనం, కిరణజన్య సంయోగక్రియ, కాయల సైజ్ మెరుగుపడుతుంది. వర్షాల తర్వాత అధిక తేమ, వేడి వాతావరణంలో తెల్లదోమ, జాసిడ్లు, త్రిప్స్, మిరిడ్ బగ్ వంటి రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల పసుపు స్టికీ ట్రాప్‌లు ఎకరానికి 6-7 ఏర్పాటు చేసి కీటకాల ఉధృతిని ఆర్థిక నష్టం స్థాయి రాకముందే తగిన పురుగుమందులను మార్పిడి పద్ధతిలో పిచికారీ చేస్తూ సమగ్ర పురుగు యాజమాన్య విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలి. మొక్కజొన్న తెలంగాణలో ప్రస్తుతం మొక్కజొన్న పంట శాఖీయ పెరుగుదల శుండి మోకాలి ఎత్తు దశలో ఉంది. ఈ దశలో నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుంది కావున వర్షం తగ్గిన తరువాత మిగిలిన నత్రజని ఎరువులను దాదాపుగా 50 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఎల్-నినో పరిస్థితుల్లో టాసెలింగ్, సిల్కింగ్ దశల్లో తేమ కొరత ఏర్పడితే పరాగసంపర్కం దెబ్బతిని గింజల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది కావున ఈ దశల్లో ఒక రక్షణ నీటి తడి తప్పకుండా ఇవ్వాలి. అలాగే 1% పొటాషియం నైట్రేట్ లేదా 1% 19:19:19ను లీటరు నీటికీ కలిపి పిచికారీ చేయడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ మెరుగుపడి గింజల బరువు పెరుగుతుంది. వర్షాలు తగ్గి, మరల ఉష్ణోగ్రతలు పెరిగిన పరిస్థితుల్లో ఫాల్ ఆర్మి వార్మ్ ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో ఫెరోమోన్ ట్రాప్‌లు ఎకరానికి 5-6 ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని పర్యవేక్షిస్తూ, ఆర్థిక నష్టం చేసే స్థాయి వచ్చినప్పుడు సిఫార్సు చేసిన పురుగుమందులను మార్పిడి పద్ధతిలో ఉపయోగిస్తూ సమగ్ర పురుగు యాజమాన్య విధానాలను అమలు చేయాలి. సోయాబిన్ తెలంగాణలో ప్రస్తుతం ఈ పంట శాఖీయ పెరుగుదల నుండి పుష్పించే ప్రారంభ దశ లో ఉంది. ఎల్-నినో పరిస్థితుల్లో 10-15 రోజుల తేమ కొరత ఏర్పడితే వేరు వ్యవస్థ క్రియాశీలత తగ్గి, నత్రజని స్థిరీకరణ 20–40% వరకు తగ్గే అవకాశం ఉంటుంది కనుక పుష్పించే ప్రారంభ దశలో 2% డి.ఎ.పి. (20 గ్రా./లీటరు నీటికి) లేదా 19% పొటాషియం నైట్రేట్ (10 గ్రా./లీటరు నీటిక్సిను 10-15 రోజుల వ్యవధిలో రెండు పిచికారీలు చేయడం ద్వారా పూత, కాయ రాలడం తగ్గుతుంది. ఎల్-నినో పరిస్థితుల్లో వర్షాలు ఒకేసారి అధికంగా కురిసే అవకాశం ఉన్నందున పొలంలో 24-48 గంటల కంటే ఎక్కువసేపు నీరు నిల్వ ఉండకుండా సరైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరు బుడిపేల క్రియాశీలత తగ్గి, రూట్ రాట్, కాలర్ రాట్ వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, ఆకు తినే గొంగళి పురుగులు, సెమీలూపర్, గర్లిల్ బీటిల్ ఉధృతిని సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతుల ద్వారా అరికట్టాలి. కంది, పెసర, మినుము ప్రస్తుతం కంది పంట శాఖీయ పెరుగుదల నుండి పుష్పించే ప్రారంభ దశలో ఉంది, ఇక పెసర, మినుము పంటలు పుష్పించే దశ నుండి కాయలు ఏర్పడే దశలో ఉన్నాయి. రాష్ట్రంలో వర్షపాతం అసమానంగా కురుస్తూ మధ్య మధ్యలో 7-12 రోజుల విరామం, అనంతరం భారీ వర్షాలు నమోదవుతున్నందున, ఈ పంటల్లో తేమ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. పుష్పించే ప్రారంభ దశలో 2% డి.ఎ.పి. (20గ్రా./లీటరు నీటికి) లేదా 1% పొటాషియం నైట్రేట్ (10 గ్రా./లీటరు నీటికి 10-15 రోజుల వ్యవధిలో రెండు పిచికారీలు చేయాలి. దీని వల్ల పూత కాత రాలదు. తేమ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. వర్షాల తర్వాత ఏర్పడే 7-10 రోజుల పొడి విరామాల్లో మారుకా పోడ్ బోరర్, స్పాటెడ్ పోడ్ బోరర్, ఆకు తినే గొంగళి పురుగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కావున, ఆర్ధిక నష్టం కలుగచేసే స్థాయికి రాగానే సిఫార్సు చేసిన సమగ్ర పురుగు యాజమాన్య చర్యలను అమలు చేయాలి. నువ్వులు ప్రస్తుతం శాఖీయ పెరుగుదల నుండి పుష్పించే ప్రారంభ దశలో ఉంది. ఎల్-నినో పరిస్థితుల్లో వర్షాల అస్థిరత వల్ల ఏర్పడే 7-10 రోజుల తేమ ఒత్తిడి ఈ దశలో శాఖల పెరుగుదల, పుష్పాల ఏర్పాటు, కాయల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల భూమిలో తగినంత తేమ ఉన్నపుడు 10 కిలోల నత్రజని (21 కిలోల యూరియా)ను పైపాటుగా వేసుకోవాలి. యూరియాను మొక్కల వరుసలకు 5-7 సెం.మీ. దూరంలో వేసి స్వల్పంగా మట్టిలో కప్పడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పుష్పించే ప్రారంభ దశలో 19% పొటాషియం నైట్రేట్ (10 గ్రా./లీటరు నీటికిను పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే 10-12 రోజుల తర్వాత రెండవ పిచికారీ చేయడం ద్వారా తేమ ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆకు తినే గొంగళి పురుగులు, లీఫ్ వెబ్బర్, క్యాప్సూల్ బోరర్ ఉధృతిని సకాలంలో గుర్తించి, ఆర్థిక నష్టం కలిగించే స్థాయి రాకముందే సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతులను అమలు చేయాలి. జొన్న, సజ్జ ప్రస్తుతం జొన్న, సజ్జ పంటలు శాఖీయ పెరుగుదల నుండి మోకాలి ఎత్తు దశలో ఉన్నాయి. ఈ దశలో నేలలో తగిన తేమ ఉన్నప్పుడు హెక్టారుకు 10 కిలోల నత్రజని (21 కిలోల యూరియా) పైపాటుగా వేసుకోవాలి. ఎల్- నినో పరిస్థితుల్లో తేమ ఒత్తిడిని తగ్గించి పంట పెరుగుదలను కొనసాగించేందుకు 2% డి.ఎ.పి. (20 గ్రా./లీటరు నీటికి) లేదా 1% 19:19:19 (10 గ్రా./లీటరు నీటికి పూత ఏర్పడే దశకు ముందు (35-40 డి.ఎ.ఎస్.) పిచికారీ చేసుకోవాలి. తేమ ఒత్తిడి తీవ్రంగా కొనసాగితే 10-12 రోజుల తర్వాత రెండవ పిచికారీ చేసుకోవాలి. పూత దశలో 7– 10 రోజుల కంటే ఎక్కువ తేమ కొరత ఏర్పడితే ఒక రక్షణ నీటి తడిని ఇవ్వడం ద్వారా దిగుబడి నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చును. ఒకవేళ వర్షం ఎడతెరిపి లేకుండా పడితే గనుక షూట్ ఫ్లై స్టెమ్ బోరర్, ఆర్మివార్మ్ ఉధృతి అధికమవుతుంది, వీటిని అరికట్టడానికి సమగ్ర యాజమాన్య సూత్రాల ప్రకారం నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుత ఎల్-నినో పరిస్థితుల్లో తెలంగాణలో పంటల ఉత్పాదకతను కాపాడేందుకు నీటి సంరక్షణ, వర్షపాతం ఆధారంగా ఎరువుల నిర్వహణ, సమతుల్య పోషక సరఫరా, సూక్ష్మపోషకాల వినియోగం, వాతావరణ ఆధారిత పంటల నిర్వహణ, సమగ్ర పురుగు వ్యాధి యాజమాన్యం అనే ఐదు సూత్రాలను అనుసరించడం అత్యంత అవసరం. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు సి-ఎన్.ఎ.ఆర్.ఇ.. నీటి యాజమాన్య కేంద్రం. పి.జె.టి.ఎ.యు.. రాజేంద్రనగర్, హైదరాబాద్.