ఎల్ నినో పరిస్థితుల్లో మొక్కజొన్న పంటను ఎలా కాపాడుకోవాలి ఎల్- నినో ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ విస్తీర్ణంలో అత్యధిక భాగం వర్తాధారంగా సాగు చేయబడుతున్నందున ఎల్ నినో పంట దిగుబడిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితులలో మొక్కజొన్న పంటలో విత్తనాల మొలకశాతం, మొక్కల ఎదుగుదల, పూత, గింజల నింపుదల వంటి కీలక దశలను ప్రతికూలంగా ప్రభావితం చేసి పంట దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాగు పద్ధతులు, నేల లో తేమను సంరక్షించే చర్యలు, సమతుల్య పోషక నిర్వహణ, సమయానుకూల పంట సంరక్షణ, ప్రత్యామ్నాయ నిర్వహణ పద్ధతులను అవలంబించడం ద్వారా పంట నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఎల్- నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఉపయోగపడే ముఖ్యమైన పంట సంరక్షణ సూచనలు మొక్కజొన్న పంటలో నష్టాన్ని తగ్గించేందుకు మార్కెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తక్కువ సమయంలో కోతకు వచ్చే బేబీకార్న్, స్వేట్ కార్న్ సాగును ప్రోత్సహించాలి. మొక్కజొన్న బోదె పద్ధతిలో విత్తనం ద్వారా వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోవచ్చు. సకాలంలో కలుపు నివారణ చేయాలి. ఎందుకంటే కలుపు మొక్కలు నేలలోని తేమను అధికంగా వినియోగిస్తాయి. మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ నిలువ ఉంటుంది, నేల ఉష్ణోగ్రత కాలం తగ్గుతుంది. సమతుల్య ఎరువుల నిర్వహణ పాటించి ముఖ్యంగా పొటేషియం మోతాదును సిఫారస్ ప్రకారం ఇవ్వాలి ఇది మొక్కలకు కరువును తట్టుకునే శక్తిని పెంచుతుంది. వర్షం పడిన వెంటనే ఎకరాకు 25 కిలోల యూరియా పై పాటు ఎరువుగా వేయాలి. వర్షాలు లేకపోతే మొక్కల ఎదుగుదలను కొనసాగించేందుకు రెండు శాతం యూరియా ద్రావణం (20 గ్రాముల యూరియా లీటర్ నీటిలో కలిపి), లేదా డి ఏపి, 19:19:19, 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. సాధారణ మొక్కజొన్న సాగు చేసిన పొలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగి పంట కోలుకునే అవకాశం లేకపోతే, ఆ పంటను సైలేజ్ లేదా పశుగ్రాసంగా వినియోగించడం ద్వారా రైతుల ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు, దీర్ఘకాలిక పొడి వాతావరణం కొనసాగితే కత్తెర పురుగు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక, కత్తెర పురుగు నివారణకు ఇమామెక్షిన్ బెంబజోయేట్ 0.4 (గ్రా. లేదా క్లోరంత్రినిలిప్రోల్ 0.4 మీ. లీటరు లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సాధ్యమైనంత వరకు మందు ద్రావణం. మొక్కసుడిలో పడునట్లుగా పిచికారీ చేయాలి. పంట మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, తొమ్మిది కిలోల ఇసుకను కలిపి మొక్కల సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. గింజలు నిండే దశలో సాధ్యమైనంత వరకు తేమ కొరత రాకుండా చూడాలి. సాధ్యమైతే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇవ్వాలి. వర్షాభావ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే మొక్కజొన్నలో ఎండు తెగులు వ్యాధి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఎండు తెగులు వ్యాధి నివారణకు నేలలో తేమను సాధ్యమైనంత వరకు నిల్వ ఉంచడం, సమతుల్య ఎరువుల నిర్వహణ చేపట్టడం, వ్యాధి నోకిన మొక్కలను వెంటనే తొలగించి పాలం నుండి బయటకు తీసివేయడం చేయాలి. అవసరమైతే అమిస్టర్ టాప్ అనే మందుని 1 మీ. లీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొదళ్లకు దగ్గరగా తడుపుకోవాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు మొక్కజొన్న పరిశోధనా విభాగం, వ్యవసాయ పరిశోధన సంస్థ. రాజేంద్రనగర్, హైదరాబాద్