అరెకా పామ్ ఒక అందమైన అలంకార మొక్క ఇంటి లోపల, కార్యాలయాలు, ఉద్యానవనాలు, ల్యాండ్ స్కేపింగ్ లో విస్తృతంగా పెంచుతారు. దీని పొడవైన ఆకుపచ్చ ఆకులు మొక్కకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి. తక్కువ సంరక్షణతో బాగా పెరిగే మొక్క కావడంతో ఇది చాలా ప్రజాదరణ పొందింది. అరెకా పామ్ నర్సరీ నిర్వహణ నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేయడానికి సరైన నర్సరీ నిర్వహణ చాలా ముఖ్యం. అరెకా పాము ప్రధానంగా విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొన్ని సందర్భాల్లో గుబురును విడదీసి కూడా కొత్త మొక్కలను తయారు చేస్తారు. వాణిజ్య నర్సరీలలో ఎక్కువగా విత్తనాల ద్వారానే మొక్కలను ఉత్పత్తి చేస్తారు. విత్తనాల ద్వారా ప్రవర్ధనం : 8-10 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతమైన తల్లి మొక్కల నుండి విత్తనాలను సేకరించాలి. పూర్తిగా పండిన పసుపు, నారింజ లేదా ఎరుపు రంగు పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. తాజా విత్తనాల్లో మొలక శాతం అధికంగా ఉంటుంది. పాత విత్తనాలను ఉపయోగిస్తే మొలక శాతం తగ్గుతుంది. విత్తనాల శుద్ధి : పండ్లపై తొక్క పూర్తిగా తొలగించి శుభ్రమైన నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. అవసరమైతే 12– 24 గంటలు నీటిలో నానబెట్టడం వల్ల మొలక త్వరగా వస్తుంది. విత్తే సమయం : వర్షాకాలం ప్రారంభం లేదా తేమ ఎక్కువగా ఉండే కాలం అనుకూలం. నర్సరీలో తేమ మరియు నీడ కల్పిస్తే ఏడాది పొడవునా విత్తవచ్చు. విత్తే మాధ్యమం : ఇసుక 1 భాగం, ఎర్ర మట్టి 1 భాగం, కోకోపీట్ లేదా బాగా కుళ్లిన కంపోస్ట్ 1 భాగం, ఈ మిశ్రమంలో విత్తనాలను నాటితే మంచి ఫలితాలు వస్తాయి. మిశ్రమం తేలికగా, మంచి డ్రైనేజీ కలిగి ఉండాలి. విత్తే విధానం: విత్తనాలను 2-3 సెం.మీ లోతులో నాటాలి. విత్తనాల మధ్య 5-8 సెం.మీ దూరం ఉంచాలి. విత్తిన తరువాత తేలికగా నీరు పోయాలి. బెడ్లను 50% షేడ్ నెట్ కింద ఉంచినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. మొలకెత్తడం : సాధారణంగా 30-90 రోజుల్లో మొలకలు వస్తాయి, కొన్నిసార్లు 3-4 నెలలు కూడా పట్టవచ్చు, మొలక శాతం సాధారణంగా 60-80% ఉంటుంది. మొలకల సంరక్షణ : మట్టి ఎల్లప్పుడూ తేమగా ఉండాలి, నీరు నిల్వ ఉండకూ డదు, కలుపు మొక్కలను తొలగించాలి, నెలకు ఒకసారి వర్మీకంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువు ఇవ్వవచ్చు. పాలీబ్యాగ్లలో మార్పిడి : మొలకలకు 2-3 ఆకులు వచ్చినప్పుడు పాలీబ్యాగ్లలోకి మార్చాలి, పాలీబ్యాగ్ పరిమాణం సుమారు 20X25 సెం.మీ ఉండాలి. మట్టి: ఇసుక : పశువుల ఎరువు = 2:1:1 నిష్పత్తిలో నింపాలి. మార్పిడి తరువాత కొన్ని రోజులు నీడలో ఉంచాలి. గుబురును విడదీసి ప్రవర్ధనం అరెకా అడుగుభాగంలో అనేక కాండాలు ఏర్పడతాయి. 3-4 సం, ఆరోగ్యవంతమైన గుబురును ఎంచుకోవాలి. ప్రతి భాగంలో కనీసం 2-3 కాండాలు మరియు మంచి వేర్లు ఉండేలా విడదీయాలి. విడదీసిన భాగాలను వెంటనే పాలీబ్యాగ్ లేదా కుండీలో నాటాలి. కొన్ని వారాలు నీడలో ఉంచి తగినంత నీరు ఇవ్వాలి. ప్రయోజనాలు : తల్లి మొక్క లక్షణాలు అలాగే ఉంటాయి. త్వరగా పెరిగి మార్కెట్‌కు సిద్ధమవుతుంది. ఒక మొక్క నుండి తక్కువ సంఖ్యలో మాత్రమే కొత్త మొక్కలు పొందవచ్చు. వేర్లు దెబ్బతింటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రవర్ధన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తాజా విత్తనాలనే ఉపయోగించాలి. విత్తనాలను ఎక్కువ లోతులో నాటకూడదు. నర్సరీలో 50% నీడ కల్పించాలి. ఎరువుల నిర్వహణ : నెలకు ఒకసారి సేంద్రియ ఎరువు లేదా వర్మీకంపోస్ట్ ఇవ్వాలి. అవసరమైతే తక్కువ మోతాదులో సమతుల్య NPK ఎరువును ఇవ్వవచ్చు. అధిక ఎరువులు వేయకూడదు. పురుగులు వ్యాధుల నిర్వహణ : ఆకులపై పురుగులు లేదా శిలీంధ్ర వ్యాధులు కనిపిస్తే వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలి. మంచి గాలి ప్రసరణ ఉండేలా మొక్కల మధ్య తగినంత దూరం ఉంచాలి. నీరు నిల్వ కాకుండా చూడాలి. షేడ్ , హార్డెనింగ్ : చిన్న మొక్కలకు 50% షేడ్ ఇవ్వాలి. విక్రయం లేదా పొలంలో నాటే ముందు 10-15 రోజుల పాటు క్రమంగా పూర్తి సూర్యరశ్మికి అలవాటు చేయాలి. మార్కెటింగ్‌కు సిద్ధమైన మొక్కలు :సాధారణంగా 8-12 నెలల వయస్సు గల, ఆరోగ్యంగా పెరిగిన మొక్కలు విక్రయానికి అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్ మార్గాలు : అరెకా పామ్ మొక్కలను స్థానిక నర్సరీలు, గార్డెన్ సెంటర్లు, ప్లాంట్ షాపులు, ల్యాండ్ స్కేపింగ్ కంపెనీలు, హోటళ్లు, రిసార్టులు, అపార్ట్మెంట్లు, కార్యాలయాలకు నేరుగా విక్రయించవచ్చు. అలాగే ప్రదర్శనలు, అన్లైన్ ప్లాట్ ఫారమ్‌లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మార్కెట్‌ను విస్తరించవచ్చు. ఈ విధంగా అరెకా పామ్ విక్రయం మరియు ప్లాంట్ రెంటల్ సేవలు నర్సరీ యజమానులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యాపార అవకాశాలను కల్పిస్తాయి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా. పి. ప్రణుతిఅసిస్టెంట్ ప్రొఫెసర్ (ఉద్యాన విభాగం) ఉద్యాన కళాశాల, వెంకట రామన్న గూడెం పశ్చిమ గోదావరి