గ్రాఫ్టింగ్, బడ్డింగ్, ఎయిర్ లేయరింగ్ పద్దతులు అంటుకట్టు అనేది పండ్ల మొక్కలలో విస్తృతంగా వాడే ఒక ముఖ్యమైన ప్రవర్ధన పద్ధతి. ఇందులో మంచి రకానికి చెందిన కొమ్మ (సయాన్)ను, బలమైన వేరువ్యవస్థ కలిగిన వేరుమొక్క (రూటైక్) తో జోడించి ఒకే మొక్కగా పెంచుతారు. దీని వల్ల మొక్క ఎదుగుదలపై నియంత్రణ, అధిక దిగుబడి, మేలైన ఫల నాణ్యత, చీడపీడలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి వంటివి సమకురతాయి. మామిడి, సపోటా, పనస, జీడిమామిడి వంటి పంటలలో ఈ పద్ధతిని రైతులు, నర్సరీలు విస్తృతంగా వాడుతున్నారు. అంటుకట్టు ప్రయోజనాలు సరైన పద్ధతిలో అంటుకట్టుచేసినప్పుడు తల్లి మొక్క గుణాలు కొత్త మొక్కకు యథాతథంగా అందుతాయి. మొక్కలు త్వరగా కాపుకు వచ్చి అధిక దిగుబడినిస్తాయి. అనుకూలమైన వేరు మూలాలను ఎంపిక చేసుకుంటే ప్రతికూల నేలలు, వర్షాభావం వంటి పరిస్థితులను కూడా తట్టుకోగలుగుతాయి. అలాగే మేలైన రకాలను వేగంగా విస్తరించడానికి, పాతతోటలను కొత్త రకాలుగా మార్చుకోవడానికి (టాప్ వర్కింగ్ ) ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. స్టోన్ గ్రాఫ్టింగ్ (ఎపికోటైల్ గ్రాఫ్టింగ్) - మామిడి మామిడిలో ఇది సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన, 75-80% విజయవంతమయ్యే పద్ధతి. జూన్-జులై మాసాలలో టెంకలను ఎత్తైన నారు మడులలో నాటాలి. మొలకెత్తిన తరువాత రాగిరంగు లేత ఆకులున్న దశలో మొలకలను వేరు చేసి, మట్టిని శుభ్రం చేసి 0.1% కార్బండిజం ద్రావణంలో 5 నిమిషాలు ముంచి శుద్ధి చేయాలి. మొలకకాండాన్ని 6-8 సెం.మీ. ఉంచి మధ్యలో 4-6 సెం.మీ. చీలిక చేయాలి. 4-5 నెలల వయసున్న ఆరోగ్యవంతమైన సయాన్ కర్రను వెడ్జ్ ఆకారంలో (V-ఆకారం) కోసి చీలికలో అమర్చి పాలిథీన్ షీట్తో కట్టాలి. 15-20 రోజుల్లో చిగురిస్తుంది. రూటెక్ నుండి వచ్చే అనవసర చిగుళ్లను ఎప్పటికప్పుడు తీసివేయాలి. సాప్ట్వుడ్ గ్రాఫ్టింగ్ - మామిడి, సపోటా, జీడిమామిడి అధిక తేమ, అనుకూల ఉష్ణోగ్రతలు ఉండే జులై-ఆగస్టు నెలలు ఈ పద్ధతికి బాగా సరిపోతాయి. తోటల్లో నేరుగా (ఇన్ సిటు) అంటుకట్టడానికి ఇది అనుకూలం. 40-60 రోజుల వేరుమొక్కపై 1-2 జతల ఆకులు మాత్రమే ఉంచి, పైభాగంలో 3-4 సెం.మీ. నిలువు చీలిక చేయాలి. సయాన్ కొమ్మ దిగువ భాగాన్ని అదే పొడవుతో V ఆకారంలో చెక్కి, కాంబియం పొరలు సరిగా తగిలేలా చీలికలో అమర్చాలి. పాలిథీన్ పట్టీతో కట్టి, 100 గేజ్ పాలిథిన్ కవర్ తో కప్పాలి. 3-4 వారాల్లో చిగుళ్లు వచ్చాక కవర్ తీసివేయాలి. ఇది రైతులలో బాగా ప్రాచుర్యం పొందిన పద్ధతి. వీనియర్ గ్రాఫ్టింగ్ (కొమ్మ అంటు పద్ధతి) ఈ పద్ధతిలో తల్లి చెట్టుపై 3-4 నెలల వయసు ఉన్న గచ్చకాయ రంగు కొమ్మను ముందుగానే ప్రిక్యూరింగ్ చేసి, మొగ్గలు ఉబికిన తరువాత వేరు చేసి వేరు మూలంపై అంటు కడతారు. దూరప్రాంతాల నుండి తెచ్చిన కొమ్మలతో కూడా ఈ పద్దతిలో అంటు కట్టవచ్చు. వేరు మూలం కాండంపై ఏటవాలుగా కోసి, దానికి దిగువన 45° కోణంలో మరో కోతచేసి గాటు ఏర్పరచాలి. సయాన్ కొమ్మను అదే విధంగా కోసి గాటుకు సరిపోయేలా అమర్చి కట్టాలి. చిగురించిన తరువాత వేరుమూలం పైభాగాన్ని తొలగించాలి. జులై-సెప్టెంబర్ నెలలు ఈ పద్ధతికి అత్యంత అనుకూలం. అప్రోచ్ గ్రాఫ్టింగ్ (ఇనార్చింగ్) - మామిడి, సపోటా సుమారు సంవత్సరం వయసు ఉన్న, 30-45 సెం.మీ. ఎత్తు గల రూస్టాక్ మొక్కలను కుండీలలో లేదా తల్లి మొక్క సమీపంలో పెంచాలి. రూట్క్, సయాన్ కాండాలపై సమాన పరిమాణంలో (5 సెం.మీ. పొడవు) బెరడు తొలగించి, రెండు ఉపరితలాలను ఎదురెదురుగా అమర్చి మొక్కల కాండం లేదా వేర్లలో బెరడుకు, లోపలి కలపకు మధ్య ఉండే పలుచని జీవకణాల పొరనే కాంబియం (Cambium) అంటారు. ఇది నిరంతరం విభజన చెందుతూ మొక్క పెరుగుదలకు, కొత్త కణజాలం (జైలం, ఫ్లోయం వంటివి) ఏర్పడటానికి సహాయపడుతుంది. కాంబియం పొరలు తగిలేలా పాలిథీన్ షీట్ తో కట్టాలి. నెల రోజుల తరువాత వారానికి ఒకసారి తేలిక పాటి కోతలు చేస్తూ, నాలుగో కోత సమయానికి సయాన్ను తల్లి చెట్టు నుండి పూర్తిగా వేరు చేయాలి. అంటు కలయికలో వైఫల్యం గుర్తించాల్సిన లక్షణాలు : వేరు మొక్క, సయాన్ రకాల మధ్య సామరస్యం లోపించినప్పుడు అంటు కలయిక విఫల మవుతుంది. మొదట్లో సరిగా అతికినట్లు కనిపించినా, కాలక్రమేణా చెట్టు చనిపోవచ్చు. అంటు కట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోత ఎల్లప్పుడూ పదునైన కత్తితో ఒకేసారి నునుపుగా చేయాలి. పదే పదే కోస్తే కణజాలం దెబ్బతింటుంది. వేరుమూలం, సయాన్లను గాలి చొరబడకుండా 150 మైక్రాన్ల పాలిథీన్ షీట్ తో గట్టిగా కట్టాలి. అంటుకట్టిన వెంటనే నీరు పారించాలి. అయితే తుంపర సేద్యంలో గ్రాఫ్ట్ పాయింట్ వద్ద నీరు నిలవకుండా చూసుకోవాలి. సయాన్ నుండి 2–3 కొత్త రెమ్మలు వచ్చిన తరువాతే వేరు మూలం తలభాగాన్ని కత్తిరించాలి. పాలిథీన్ సంచుల్లోని వేరు మూలాలను మధ్య మధ్యలో స్థలం మార్చాలి, తద్వారా వేరు నేలలోకి చొచ్చుకుపోదు. మొక్కలను షేడ్నెట్లో గట్టిపరిచిన తరువాతే ప్రధాన పొలంలో నాటాలి. సకాలంలో సూక్ష్మపోషకాలు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 8-12 నెలల వయసు ఉన్న, చీడపీడలు లేని ఆరోగ్యకరమైన అంట్లనే నాటుకోవాలి. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా. ఎం.విశ్వనాథ్ శాస్త్రవేత్త (ఉద్యానశాస్త్రం) ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి.