ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువులను విచక్షణా రహితంగా వాడడం పరిపాటి అయింది. దీనివల్ల భూగర్భఉపరితల జలాలు కలుషితమై, పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని, ఉత్పాదకశక్తి లోపిస్తోంది. పంటల ఉత్పాదకతలను పెంచేందుకని సమగ్ర సమతుల ఎరువులు వాడాల్సిన అవసరం ఉంది. వివిధ పోషకాలు లభించే రసాయన సేంద్రియ, జీవన ఎరువులను సమతుల్యంగా వాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీవన ఎరువు లను గురించి కొంతైనా తెలుసుకోవాలి. జీవన ఎరువుల వాడకంవల్ల రసాయన ఎరువులను 25 శాతం దాక తగ్గించుకోవచ్చు 20-30 శాతం దాదాపు దిగుబడులు పెరుగుతాయి. "జీవన ఎరువుల సద్వినియోగం సఫలీకృత సేద్యనికి మార్గం" అని ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం కింద రాయితీపై ఈ ఎరువులను రైతులకు అందజేస్తోంది.జీవన ఎరువులంటే సూక్ష్మజీవుల సముదాయం. నేలలోని సూక్ష్మజీవులు స్వతంత్రంగా లేదా మొక్కలతో కలిసి జీవిస్తూ వాతావరణం, నేల నుంచి మొక్కలకు కావాల్సిన నత్రజని, భాస్వరం మూలకాలను నత్రజని స్థాపన, భూమిలో లభ్యంకాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు అందజేస్తాయి" జీవన ఎరువుల వల్ల ప్రయోజనాలు నేల ఉత్పాదకశక్తి పెరుగుతుంది. భూభౌతిక స్థితి మెరుగుపడి వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి. వాతావరణంలో నత్రజనిని భూమిలో స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి. నేలల భౌతిక, రసాయనిక లక్షణాలను సమతుల్యం చేయడం ద్వారా సూక్ష్మధాతు లోపాలు రాకుండా నివారించవచ్చు నేలలోని భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి. మొక్కల పెరుగుదలకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమవుతాయి తక్కువ ధరలో లభ్యమవుతాయి కనుక ఖర్చు తక్కువ పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. సిఫార్సు చేసిన రసాయనిక ఎరువులను 25 శాతం వరకు ఆదా చేయవచ్చు నేల నుంచి సంక్రమించే తెగుళ్ళను నియంత్రిస్తాయి. రకాలు నతజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరపు జీవన ఎరువులు నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఈ ఎరువులు గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని వేరు గ్రహించుకునే రూపమైన నైట్రేట్లుగా మారుస్తాయి. వీటిలో ముఖ్యమైనవి రైజోబియం కల్చరు, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా మొదలైనవి. రైజోబియం కల్చర్: పప్పు దినుసుల పైర్లు వేరుసెనగ పంట లకు రైజోబియం కల్చరు వాడాలి. 200 గ్రా. ప్యాకెట్ 8 కిలోల విత్తనికి సరిపోతుంది. విత్తన మోతాదును బట్టి ఎన్ని ప్యాకెట్లు వాడాలనేది నిర్ణయించుకోవాలి. రైజోబియం కల్చరు విత్తనానికి పట్టించే విధానం: ఒక లీటరు వీటిలో 50గ్రా. బెల్లం కలిపి నిమిషాలపాటు మరగకాచి చల్లార్చిన పాకానికి 200 గ్రా రైజోబియం కల్చరును నెమ్మదిగా పట్టించి, ఆ కల్చరును విత్తనానికి పట్టించి విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అజటోబాక్టరు: వరి, జొన్న మొక్కజొన్న మొదలైన గడ్డిజాతి పంటలకు పత్తి, చెరకు, మిరప, పొద్దు తిరుగుడు, కూరగాయల పంటలకు అజటోబాక్టర్ ఎరువును 2 నుంచి 3 కిలోలు 10 కిలోల పశువుల ఎరువుతో కలిపి హెక్టారు పొలంలో వెదజల్లాలి. ఈ ఎరువుల వల్ల ఎకరానికి 10-15 కిలోల నత్రజని అందించడమే కాకుండా, పెరుగుదలకు సంబంధించిన ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ జిబ్బరిల్లిక్ యాసిడ్ వంటి హార్మోన్లు, విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి. అజోస్పైరిల్లం: అజోస్పైరీల్లంను వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి పంటలకు 2 - 3 కిలోలు 10-15 కిలోల పశువుల ఎరువుతో కలిపి పొలంలో పడేలా వెదజల్లాలి. హెక్టారుకు 20-25 కిలోల నత్రజనినిస్తుంది. ఇది మొక్కల వేర్లలో నివపిస్తూ గాలిలోని నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా పెరుగుదలకు పనికి వచ్చే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. నీలి ఆకుపచ్చ నాచు: వరి పైరుకు మాత్రమే పనికి వస్తుంది. వరి ఉడ్చిన తరువాత వారం రోజులకు పలుచగా నీరు నిలువగట్టి ఎకరానికి 4 కిలోల నీటి ఆకుపచ్చ నాచు పొడిగా చేసి పొలమంతా సమానంగా వెదజల్లాలి. దీనివల్ల ఎకరాకు 8-12 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజొల్లా: గాలిలోని నత్రజనిని, అమ్మోనియంగాను, నైట్రేట్ గా మార్చి మొక్కకు అందజేస్తుంది. అజొల్లా పిన్నేటా అనే రకం అధిక ఉష్ణోగ్రతలో కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఎకరాకు 200 కిలోల అజొల్లా ను బాగా దమ్ము చేసిన తరువాత లేదా నాటిన 5 లేదా 6 రోజుల తదుపరి 5 సెం.మీ. పీటిని నిలువగట్టి 20 కిలోల సూపర్ ఫాస్పేట్ కలిపి పొలమంతా వెదజల్లాలి. ఈ విధంగా చేస్తే 4-5 టన్నుల పచ్చిరొట్టనిచ్చి 30 కిలోల నత్రజనిని వంటకు అందిస్తుంది. భాస్వరపు జీవన ఎరువులు వీటిలో ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, మైకోరైజా అందుబాటులో ఉన్నాయి. ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా: దీన్నే ఫాస్ఫోబ్యాక్టీరియా అని కూడా అంటారు. భాస్వరం ఎరువు సుమారు మూడోవంతు భూమిలో మొక్కలకు లభ్యంకాని స్థితిలో నిల్వ ఉంటుంది. బాసిల్లస్, సూడోమోనాన్ జాతికి చెందిన ఫాస్ఫో బాక్టీరియా కొన్ని రకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి భూమిలో నిల్వ ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందేలా చేసి, మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ జీవన ఎరువును ఎకరానికి 2 కిలోల పశువుల ఎరువుతోగాని, ఇసుకతోగాని చల్లాలి. మైకోరైజా: ఈ ఎరువులు స్థిరంగా ఉండి భాస్వరాన్ని వేరుకు అందించే మొబిలైజింగ్ గుణం గల ఎరువు. భాస్వరాన్ని మాత్రమే. కాకుండా జింకు, రాగి, పొటాష్, కాల్షియం మొదలగు పోషకాలను కూడా మొక్కకు అందుబాటులోకి తెస్తుంది. నత్రజని, భాస్వరం జీవన ఎరువులు రెండూ కలిపి వాడితే అధిక ప్రయోజనముంటుంది. అవి ఎలా వాడాలో చూద్దాం. జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, పత్తి, మిరప వంటి పంటలకు అజో స్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియాను ఒక్కొక్కటి 1 కిలో చొప్పున 25 కిలోల వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరుపుతో కలిపి పంటసాళ్ళలో అంతరకృషి అయిన తర్వాత వేయాలి. వరిలో అయితే నాట్లేసిన నెలలోపు పంటకు పైవిధంగా వేయాలి. వరినారు ముంచడం -ఒకటిన్నర కిలోల అజోస్పైరిల్లం, ఒకటిన్నర కిలోల పాస్ఫోబ్యాక్టీరియా తగినంత నీరుకలిపి ఈ ద్రావణంలో నారును 10 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి. కూరగాయలు, పండ్లతోటలకు అజటోబ్యాక్టర్ ఒకటిన్నర కిలోలు + ఒకటిన్నర కిలోల ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా పశువుల ఎరువుతో కలిపి అంతరకృషి తర్వాత వేయాలి. జీవన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు జీవన ఎరువులను ఎల్లప్పుడు సూర్యరశ్మి, వేడికి దూరంగా ఉంచాలి. కల్చరు సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. కాబట్టి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. జీవన ఎరువులను సస్యరక్షణ మందులు, రసాయన ఎరువులతో కలిపి వాడరాదు. ఏ పంటకు సంబంధించిన కల్చరును ఆ పంటకు మాత్రమే వాడాలి. నిర్ణీత గడువులోనే వాడాలి. ఫాస్ఫోబాక్టీరియాను అన్ని వంటలకు ఉపయోగించవచ్చు. ఆధారం: పాడి పంటలు మాసపత్రిక ఎన్.స్వప్న, సి.ఎచ్. ప్రగతి కుమారి, ఎన్. నవత, స్వర్ణలత, శ్రీరమ్మ, డా.బి. పుష్పవతి, వ్యవసాయ కళాశాల, పాలెం.