పంటల యాజమాన్యానికి డిజిటల్ సాంకేతికత తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంటల స్థూల విస్తీర్ణం 2025–26 నాటికి సుమారు 220.74 లక్షల ఎకరాలు కాగా, ఆగస్టు 31, 2026 వానాకాలం నాటికి పంటల వారీగా గమనించినట్టైతే, వరి విస్తీర్ణం గత ఏడాది 54.80 లక్షల ఎకరాల నుంచి 48.75 లక్షల ఎకరాలకు తగ్గి సుమారు 11.0% క్షీణించగా, మొక్కజొన్న 6.13 నుంచి 5.78 లక్షల ఎకరాలకు తగ్గి సుమారు 5.7% తగ్గింది. ఇందుకు విరుద్ధంగా పప్పుధాన్యాల విస్తీర్ణం 5.56 నుంచి 7.60 లక్షల ఎకరాలకు పెరిగి సుమారు 36.7% సాగు వృద్ధి సాధించింది, ఇందులో కంది 4.73 నుంచి 5.44 లక్షల ఎకరాలకు, పెసర 0.60 నుంచి 1.52 లక్షల ఎకరాలకు, మినుము 0.22 నుంచి 0.61 లక్షల ఎకరాలకు పెరిగాయి. నూనెగింజల విస్తీర్ణం కూడా 3.67 నుంచి 3.88 లక్షల ఎకరాలకు పెరగగా, సోయాబీన్ 3.60 నుంచి 3.72 లక్షల ఎకరాలకు, వేరుశనగ 0.06 నుంచి 0.12 లక్షల ఎకరాలకు పెరిగింది. ముఖ్యంగా పత్తి సాగు విస్తీర్ణం 44.92 నుంచి 48.19 లక్షల ఎకరాలకు, సుమారు 7.3% పెరిగింది. ఈ పంటల మార్పు అధిక నీరు అవసరమయ్యే పంటల నుంచి కొంత తక్కువ నీరు అవసరమయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజలు, వర్షాధార పంటల వైపు సాగు వైవిధ్యీకరణను సూచిస్తుంది. ఇక మన రాష్ట్రంలో స్థూల నీటిపారుదల విస్తీర్ణం 160 లక్షల ఎకరాలు, నికర నీటిపారుదల విస్తీర్ణం 95.57 లక్షల ఎకరాలు కాగా సగటు భూకమతం సుమారు 0.89 హెక్టార్లు, ఇందువల్ల చిన్న, సన్నకారు రైతులు తమ పొలానికి తక్కువ వ్యయంతో సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుకుని నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అవసరం. రాష్ట్రంలో సాధారణ 574 మి.మీ. వర్షపాతానికి గాను 474 మి.మీ. నమోదై 17 శాతం లోటు ఏర్పడగా, సగటు భూగర్భజల మట్టం జూలై చివర్లో 9.48 మీటర్ల నుంచి ఆగస్టు చివరికి 7.87 మీటర్లకు మెరుగుపడినప్పటికిని ఆగస్టు 2025తో పోలిస్తే సుమారు 2.09 మీటర్లు తక్కువగా ఉంది. ఇక ప్రస్తుత యాసంగీలో ఎల్‌నినో మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు తాజా అంతర్జాతీయ సంస్థలైన అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన కేంద్రం (ఎన్.ఒ.ఎ.ఎ.), అంతర్జాతీయ వాతావరణ, సమాజ పరిశోధనా సంస్థ (ఐ.ఆర్.ఐ.) సూచిస్తున్నాయి. కాబట్టి రబీ 2026-27 పంటల ప్రణాళికలో ప్రస్తుత భూగర్భజల స్థాయితో పాటు ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా యాసంగీ పంటలకు కావాల్సిన నీటి లభ్యతను ముందుగానే పరిగణనలోకి తీసుకుని, వరి వంటి అధిక నీటి అవసరమున్న పంట సాగును తగ్గించుకుని, శనగ, కుసుమ, వేరుశనగ వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను, స్వల్పకాలిక రకాలను, నీటి పొదుపు పద్ధతులను పాటించడం చాలా అవసరం. ఇందుకోసం వాతావరణం, భూగర్భజలాలు, నేలలోని తేమ, పంట అవసరాలపై ఎప్పటికి అప్పుడు తాజా సమాచారాన్ని సమన్వయం చేసుకోవడానికి రైతులు ఉచిత ప్రభుత్వ డిజిటల్ వేదికలను వినియోగించాలి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఆధారిత మొబైల్ అప్లికేషన్లు ప్రపంచ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ, భౌగోళిక సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్,, డ్రోన్లు వంటి ఆధునిక భౌగోళిక సాంకేతికత సమాచారం ఆధారంగా నిర్వహించే విధంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఫలితంగా నేల సార స్థితి, పోషకాల లభ్యత, పంట ఎదుగుదల, నీటి అవసరం, వాతావరణ పరిస్థితులు, పంట ఒత్తిళ్లలోని వ్యత్యాసాలను గుర్తించి, వాటి ఆధారంగా నిర్దిష్ట స్థలంలోని, నిర్దిష్ట పంటకు అవసరమైన పోషక, నీటి, పంట యాజమాన్య చర్యలను పాటించడం ద్వారా అనిశ్చిత వాతావరణంలో కూడా రైతులు సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చును. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ రైతు చేతిలో ఒక సమగ్ర డిజిటల్ సాధనంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన వివిధ మొబైల్ అప్లికేషన్లు, డిజిటల్ వ్యవసాయ సేవలను రైతులు తెలుసుకొని, తమ పంటల సాగు పరిస్థితులకు అనుగుణంగా వాటిని వినియోగించడం ద్వారా పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సైతం సమయానుకూల నిర్ణయాలను తీసుకోవచ్చును, ఆ వివరాలు కింద విధంగా చూద్దాం. మేఘదూత్ ఈ మొబైల్ యాప్‌న 2019 లో భారత వాతావరణ శాఖ, భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యాప్ స్థానిక స్థాయి వాతావరణ అంచనాలను నిర్దిష్టమైన వ్యవసాయ సలహాలతో అనుసంధానం చేసి, రైతులకు వాతావరణ ఆధారిత శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తుంది. కె.ఎ.ఎల్.పి భారత వాతావరణ విభాగం, భూవిజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖ, 15 జనవరి 2026న ఐ.ఎమ్.డి. 151వ స్థాపనా దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. ఇది స్థానిక గ్రామపంచాయతీ స్థాయిలో వాతావరణ అంచనాలను పంట, పంట దశతో అనుసంధానించి, రైతులకు విత్తనం, సాగునీటి నిర్వహణ, ఎరువుల వినియోగం, పురుగు-తెగుళ్ల యాజమాన్యం, కోత వంటి వ్యవసాయ కార్యకలాపాలపై నిర్దిష్ట స్థలంలోని నిర్దిష్ట పంట నిర్దిష్ట దశను పరిగణనలోకి తీసుకుని సలహాలను అందిస్తుంది. అంతేకాకుండా రాబోయే వాతావరణ పరిస్థితులు పంటపై చూపే ప్రభావాన్ని అంచనా వేసి, దానికి అనుగుణంగా రైతు తీసుకోవాల్సిన యాజమాన్యాన్ని సైతం సూచిస్తుంది. టీ - సీడ్ తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2016-17 రబీ సీజన్ లో ప్రారంభించబడిన ఈ ఆన్లైన్ సబ్సిడీ విత్తన పంపిణీ వ్యవస్థను, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి), సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసి అమలు చేస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం నాణ్యమైన విత్తన రకాన్ని ఎంపిక చేయడం, సబ్సిడీ లభ్యతను తెలుసుకోవడం, సకాలంలో విత్తనాన్ని పొందడం వంటివి. సాయిల్ హెల్త్ కార్డు ఈ మొబైల్ యాప్/పోర్టల్‌ను భారత ప్రభుత్వం, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 5 డిసెంబర్ 2017న ప్రారంభించి ఎ.ఐ. ఆధారిత మట్టి నమూనా, నమూనా యాజమాన్య వివరాలు, నేల పరీక్ష ఫలితాల నమోదు, మట్టి ఆరోగ్య కార్డు జారీ ప్రక్రియలను డిజిటల్‌గా నిర్వహించడానికి రూపొందించారు. తదనంతరం 2023లో భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా పంటకు అనుగుణమైన సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని నవీకరణ చేశారు. ఫెర్టిలైజర్ కాలిక్యులేటర్ ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి, ఎ.టి.ఎ.ఆర్.ఐ., జోన్-ఎక్స్, హైదరాబాద్ సహకారంతో 2019 లో అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ సాధనం, నేల పరీక్షా ఫలితాలు, పంట, సిఫారసు చేసిన పోషక అవసరాలను ఆధారంగా చేసుకుని అవసరమైన ఎరువుల మోతాదును లెక్కిస్తుంది, తద్వారా రైతులు సమతుల్య ఎరువులను వినియోగించడంలో సహాయపడుతుంది. కిసాన్ సువిధ భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 2016 లో రూపొందించిన ఈ యాప్ వాతావరణం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహాలు, వ్యవసాయ యంత్రాల విక్రేతల వంటి సమాచారాన్ని ఒకే వేదికపై రైతులకు అందిస్తుంది. ఈ వ్యవస్థను ప్రభుత్వ వ్యవసాయ సమాచార సాంకేతిక మౌలిక వసతులతో అనుసంధానించి అమలు చేస్తున్నారు. కిసాన్ సారథి భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సహకారంతో 2021లో ప్రారంభించిన ఈ యాప్ రైతులను కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ నిపుణులతో అనుసంధానించే డిజిటల్ వేదిక. దీని ప్రధాన ఉద్దేశ్యం రైతులకు స్థానిక భాషల్లో నిర్దిష్టమైన సలహాలను నిపుణుల సూచనల మేరకు సకాలంలో అందిస్తుంది. భారత్-విస్తార్ భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు 2026లో ఈ యాప్ ఫేజ్-1 ప్రారంభించింది. ఇందులో 155261 టెలిఫోన్ నంబర్ ద్వారా ఎ.ఐ. ఆధారిత బహుభాషా వాయిస్ ప్రాధాన్యమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా రూపొందించారు. ఇది అగ్రి స్టాక్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి పంటల నిర్వహణ సిఫారసులు, భారత వాతావరణ శాఖ, ఆగ్ మార్క్ నెట్, జాతీయ పురుగు నిఘా సంస్థ, సాయిల్ హెల్త్ కార్డ్ వంటి సమాచార వనరులను సమన్వయం చేసుకుని వాతావరణం, నేల ఆరోగ్యం, చీడ పీడల యాజమాన్యం, పంటల నిర్వహణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలపై స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ సలహాలను అందిస్తుంది. ఆగ్ మార్క్ నెట్ భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా 2000 లో మార్కెటింగ్ పరిశోధన, సమాచార నెట్వర్క్ పథకం కింద అభివృద్ధి చేశారు. దీనిని వ్యవసాయ మార్కెటింగ్, తనిఖీ డైరెక్టరేట్ నిర్వహిస్తుండగా, జాతీయ సమాచార శాస్త్ర కేంద్రం సాంకేతిక సహకారం అందిస్తుంది, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డులు/ డైరెక్టరేట్లు భాగస్వాములుగా ఉన్నాయి. వివిధ మార్కెట్లలోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలను కోతకు ముందే పరిశీలించి మెరుగైన ధర లభించే ఇతర మార్కెట్ అవకాశాలను సూచిస్తుంది. ఈ-నామ్ భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు 2016 లో ప్రారంభించి, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లను ఇ-నామ్‌తో అనుసంధానించడం ద్వారా జాతీయ డిజిటల్ మార్కెట్ వ్యవస్థలో భాగస్వాములవుతున్నాయి. తద్వారా ఒకే డిజిటల్ వేదికపై వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్లైన్ వేలం, పారదర్శక ధర నిర్ణయం, మార్కెట్లోకి పంట ఉత్పత్తుల గిరాకీ, నాణ్యత పరీక్ష, ఎలక్ట్రానిక్ చెల్లింపులు వంటి సేవలను అందిస్తుంది.నిరంతర వాతావరణ మార్పులు, భూగర్భజల వనరులపై ఒత్తిడి, పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో తెలంగాణలో రబీ పంటల నిర్వహణ మరింత శాస్త్రీయంగా, సమాచార ఆధారంగా, వనరుల సమర్థ వినియోగంతో కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు విత్తన ఎంపిక నుంచి పంట విక్రయం వరకు వివిధ దశల్లో డిజిటల్ సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వలన వనరుల వినియోగ సామర్థ్యాన్ని పెంచి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, పంట ఉత్పాదకత, రైతు ఆదాయాన్ని మెరుగు పరుచుకోవచ్చును. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు