పరిచయం భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు వేగంగా, పారదర్శకంగా, లక్ష్యితం గా అందించేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఒక ముఖ్యమైన డిజిటల్ వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. రైతుకు సంబంధించిన భూమి, పంటలు, సాగు వివరాలు, ఇతర ప్రాథమిక సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏమిటి? ఫార్మర్ రిజిస్ట్రీ అనేది రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, ప్రతి రైతుకు ప్రత్యేకమైన రైతు గుర్తింపును కల్పించే వ్యవస్థ. ఇందులో రైతు పేరు, గుర్తింపు వివరాలు, భూమి వివరాలు, సాగు విస్తీర్ణం, పంటల సమాచారం వంటి అంశాలను సంబంధిత ప్రభుత్వ రికార్డులతో అనుసంధానం చేస్తారు. దీని ద్వారా రైతు ఒక పథకం కోసం ప్రతిసారీ తన వివరాలను విడివిడిగా సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది. ఒకసారి నమోదు చేసిన సమాచారాన్ని ప్రభుత్వ సేవల కోసం అవసరమైన మేరకు ఉపయోగించుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాలు రైతుల సమగ్ర డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించడం. రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా అందించడం. అర్హత కలిగిన రైతులను గుర్తించడంలో ప్రభుత్వానికి సహాయపడటం. రైతుల భూమి, పంటల వివరాలను డిజిటల్‌గా నిర్వహించడం. వ్యవసాయ సేవల పంపిణీలో పారదర్శకతను పెంచడం. రైతులకు సంబంధించిన సమాచారం ఆధారంగా మెరుగైన వ్యవసాయ విధానాలను రూపొందించేందుకు సహకరించడం. రైతు గుర్తింపు కార్డు ప్రాధాన్యత రైతులకు ప్రభుత్వ వ్యవసాయ సేవలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం సులభంగా అందించేందుకు రైతు గుర్తింపు కార్డు కీలకమైన గుర్తింపుగా ఉపయోగపడుతుంది. రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న అనంతరం రైతుకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ అందించబడుతుంది. ఈ నంబర్ ద్వారా రైతు వివరాలను విభిన్న వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయవచ్చు.పంట రుణాలు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పి.ఎం.-కిసాన్), పంటల కొనుగోళ్ళు, ఎరువుల సబ్సిడీ వంటి రైతు సంక్షేమ, వ్యవసాయ సేవలను పొందేందుకు సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతు గుర్తింపు అవసరం కావచ్చు. అందువల్ల రైతులు తమ వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో సరిగ్గా నమోదు చేసుకొని, 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్‌ను పొందడం ప్రయోజనకరం.రైతు గుర్తింపు వ్యవస్థ ద్వారా రైతు వివరాలు, భూమి, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. దీని వల్ల అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా అందించడంలో, వ్యవసాయ సేవలను వేగంగా అందించడంలో సహాయపడుతుంది. రైతులకు కలిగే ప్రయోజనాలు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు అనేక రకాలుగా ప్రయోజనం కలగవచ్చు. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంట సంబంధిత సేవలు, విపత్తుల సమయాల్లో అందించే సహాయం వంటి కార్యక్రమాలను అర్హత ఆధారంగా రైతులకు చేరవేయడం సులభమవుతుంది. అలాగే రైతు భూమి, పంటల సమాచారం డిజిటల్‌గా అందుబాటులో ఉండటం వల్ల వ్యవసాయ శాఖలు రైతులకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించగలవు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఫార్మర్ రిజిస్ట్రీ కేవలం రైతుల పేర్ల నమోదు కార్యక్రమం మాత్రమే కాదు. ఇది డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు ఒక పునాదిగా పనిచేయగలదు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతులు, భూములు, పంటలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వ్యవసాయ శాఖలు పంట ప్రణాళిక, విత్తనాల అవసరం, ఎరువుల నిర్వహణ, పంట నష్టాల అంచనా వంటి అంశాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. రైతుల బాధ్యత ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకునే సమయంలో రైతులు తమ పేరు, ఆధార్ లేదా సంబంధిత గుర్తింపు వివరాలు, భూమి వివరాలు, మొబైల్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని సరిగ్గా అందించాలి. భూమి యాజమాన్యంలో మార్పులు, మొబైల్ నంబర్ మార్పు లేదా ఇతర ముఖ్యమైన వివరాల్లో మార్పులు వచ్చినప్పుడు వాటిని సంబంధిత అధికారుల ద్వారా నవీకరించుకోవడం అవసరం. నమోదు గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీసేవ / సిఎస్సి సెంటర్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి. నమోదు పూర్తయిన తర్వాత రైతుకు 11 అంకెలతో కూడిన ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ అందుతుంది. ఈ నంబర్‌ను భద్రంగా ఉంచుకొని, ప్రభుత్వ వ్యవసాయ సేవలను పొందే సమయంలో అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ముగింపు ఫార్మర్ రిజిస్ట్రీ వ్యవసాయ రంగంలో డిజిటల్ మార్పుకు ఒక ముఖ్యమైన అడుగు. రైతుల వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత లక్ష్మితంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు సహాయపడుతుంది. రైతులు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకొని, 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్‌ను పొందడం ద్వారా ఈ వ్యవస్థను మరింత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. “సమగ్ర రైతు సమాచారం - సమర్థవంతమైన వ్యవసాయ సేవలు - బలమైన రైతు భవిష్యత్తు” అనే లక్ష్యంతో ఫార్మర్ రిజిస్ట్రీ వ్యవసాయ డిజిటలీకరణలో కీలక పాత్ర పోషించగలదు. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు