సాంకేతికతతో సాగు - స్థిరమైన ఆదాయం ఇప్పటి వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల నుంచి సాంకేతిక పద్ధతుల వైపు వేగంగా మారుతోంది. ముఖ్యంగా రైతులు నీటి కొరత, వాతావరణ మార్పులు, సాగు ఖర్చుల పెరుగుదల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునేలా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణ, మొబైల్ యాప్ వినియోగం రైతులకు ఒక ఆధునిక పరిష్కారంగా మారాయి. రైతులకు సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయపడు తున్నాయి. సెన్సార్లు పొలంలో అమర్చి, నేల తేమ, ఉష్ణోగ్రత, తేమ శాతం, పోషకాలు, కాంతి వంటి అంశాలను కొలుస్తాయి. ఆకుల రంగు, క్లోరోఫిల్ స్థాయి ద్వారా పంట ఆరోగ్యం తెలుసుకో వచ్చు. వ్యాధులు ముందే గుర్తించవచ్చు ఈ డేటా మొబైల్ యాప్/కంప్యూటర్ ద్వారా రైతుకు అందుతుంది. దీనిని ఆధారంగా తీసుకుని రైతు సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. భూమి భౌతిక స్థితి నుండి పంట ఆరోగ్యం వరకు ప్రతి అంశాన్ని కొలిచి, రైతుకు మొబైల్లో సమాచారం అందించే ఈ విధానం, మనదేశంలో వేగంగా విస్తరిస్తోంది. నత్రజని (N), ఫాస్ఫరస్ (P), పొటాష్ (K) స్థాయిలు తెలుసుకోవచ్చు. ఎరువులను సరైన మోతాదులో వాడటా నికి సహాయం చేస్తుంది. సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణ అంటే ఏమిటి? సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణలో, పొలంలో ఏర్పాటు చేసిన (ప్రత్యేక పరికరాలు (సెన్సార్) మట్టిలోని తేమను నిరంతరం తేమ శాతం సమాచారం ఇస్తాయి. ఈ సమాచారం ఆధారంగా పంటకు ఎంత నీరు అవసరమో నిర్ణయించబడుతుంది. సాధారణంగా రైతులు అంచనా వేసి నీరు ఇస్తారు. కానీ ఈ విధానంలో మట్టిలో తేమ తక్కువగా ఉంటే మాత్రమే నీరు ఇస్తారు. సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణ లో అవసరానికి మించిన నీటి వినియోగం ఉండదు. పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో నీరు అందుతుంది. ఈ విధానం వల్ల నీటి వృథా తగ్గి పంట ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొబైల్ యాప్ ల ప్రాముఖ్యత ఇప్పుడు ప్రతి రైతు చేతిలో స్మార్ట్‌ఫోన్ వ్యవసాయానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. మొబైల్ యాప్ ద్వారా రైతులు, వాతావరణ సమాచారం, పంటకు అవసరమైన నీటి సూచనలు పొందవచ్చు. ఎరువులు, పురుగు మందుల పై సలహాలు పొందవచ్చు. మార్కెట్ ధరలను తెలుసుకుని సరైన సమయంలో అమ్మకాలు చేయవచ్చు. ముఖ్యంగా సెన్సార్ నుండి వచ్చే డేటా నేరుగా మొబైల్లో కనిపించడం వల్ల రైతు ఎక్కడ ఉన్నా తన పొలాన్ని పర్యవేక్షించ గలడు. సెన్సార్ + మొబైల్ యాప్ కలయిక ఈ రెండు సాంకేతికతలు కలిసి పనిచేసినప్పుడు వ్యవసాయం మరింత సులభమవుతుంది. ఉదాహరణకు పొలంలో మట్టిలో తేమ తగ్గితే. సెన్సార్ గుర్తించి, మొబైల్ యాప్‌కు సమాచారం పంపుతుంది. రైతుకు అలర్ట్ వస్తుంది. రైతు వెంటనే నీరు అందించవచ్చు లేదా ఆటోమేటిక్ గా పంపు పనిచేస్తుంది. ఈ విధంగా రైతు పొలానికి వెళ్లకుండానే సాగును నియంత్రించగలడు. రైతులకు లభించే ప్రయోజనాలు నీటి ఆదా: ఈ విధానంతో 30-50% వరకు నీటి వినియోగం తగ్గుతుంది. ఖర్చు తగ్గింపు: వ్యవసాయ కూలీల ఖర్చు, విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అధిక దిగుబడి : సరైన సమయంలో సరైన నీరు అందడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. సమయం ఆదా : రైతు తరచుగా పొలానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. స్మార్ట్ వ్యవసాయం : మొబైల్ ద్వారా అన్ని పనులను నియంత్రించడం వల్ల వ్యవసాయం సులభమవుతుంది. కిసాన్ సువిధా యాప్ ఇది వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, తెగుళ్ల హెచ్చరి కలు, పంట రక్షణ చిట్కాలను అందిస్తుంది. ఈ యాప్ ఉచితం. రైతులు నీటిపారుదల లేదా పిచికారీకి ప్రణాళిక వేసే ముందు వాతావరణాన్ని తనిఖీ చేయడానికి ఈ యాప్‌ను ప్రతిరోజూ ఉపయోగిస్తారు. ఇది మనదేశంలో అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ వ్యవసాయ యాప్‌లలో ఒకటి. ఎదురయ్యే సవాళ్లు అయితే ఈ సాంకేతికతకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రారంభంలో పరికరాల ఖర్చు ఎక్కువగా ఉండటం. సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవడం, ఇంటర్నెట్ అవసరం ఉండటం. అయితే ప్రభుత్వం సబ్సిడీలు, శిక్షణల ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణ, మొబైల్ యాప్‌ల వినియోగం వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తోంది. ఇది రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అందించే మార్గం. ఈ సాంకేతికతలను వినియోగించడం ద్వారా మన రాష్ట్ర రైతులు మరింత అభివృద్ధి దిశగా సాగుతారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ నేతృత్వంలో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి లోని పొగాకు పరిశోధన కేంద్రంలో సెన్సార్ ఆధారిత వ్యవసాయ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పొగాకును ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ విధానంలో మొక్కల వేర్ల దగ్గర మట్టిలో సెన్సార్లను ఏర్పాటు చేసారు. ఇవి నేలలోని నీటి పరిమాణాన్ని నిరంతరం కొలుస్తూ సమాచారాన్ని గేట్ వే టవర్ ద్వారా క్లౌడ్ సిస్టం తో పంచుకుంటాయి. దీనిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దాని సాంకేతి కతను ఉపయోగించి విశ్లేషిస్తుంది. నేలలో తేమ శాతం మొక్కకు సరిపడినంతగా లేకుండా తగ్గితే ఆటోమాటిక్ గా నీటి పంపు మోటార్ ఆన్ అయ్యి నీరు పారుతుంది. ఇంకా కొంచం అడ్వాన్స్ గా సెల్ఫోన్లో యాప్ తో అనుసంధానం చేసుకోవటం వలన రైతు ఈ ప్రక్రియను ఎక్కడినుంచైనా గమనిం చవచ్చు. సాంప్రదాయ పద్దతిలో హెక్టారుకు సుమారు 4500 ఘనపు మీటర్ల నీరు అవసరం కాగా సెన్సార్ ఆధారిత నీటి పరిమాణాన్ని తెలిపే యంత్రం వలన 2800 ఘనపు మీటర్ల నీరే సరిపోయింది. ఎప్పుడు రైతు సాధారణ సాగులో దిగుబడిలో గణనీయమైన మార్పును వెంటనే తీసురాలేరు దీనికి అనేక కారణాలు వున్నాయి. కానీ ఆధునిక వ్యవసాయ పరికరాలను ఉపయోగించి ఖర్చును వెంటనే తగ్గించుకోగలుగుతారు. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించుకుని మేలైన దిగుబడులు సాధించటం ద్వారా రైతు ఆర్ధికం గా ఉన్నతంగా ఉండగలుగుతారు. ఆధారం: పాడిపంటలు పత్రికా విభాగం