ఎల్ నినో కాలంలో పోషకాహార భద్రతకు మేలైన మార్గం వాతావరణ మార్పులు నేడు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీటిలో ఎల్నినో వంటి పరిణామాలు ముఖ్యమైనవి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగినప్పుడు ఏర్పడే ఈ వాతావరణ చక్రం, మన దేశం వంటి రుతుపవన ఆధారిత దేశాలపై గరిష్ట ప్రభావం చూపుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, అసమాన వర్షపాతం, నీటి కొరత వంటి పరిస్థితుల మధ్య రైతులు తమ పంటల ఉత్పత్తిని, కుటుంబాల పోషకాహార భద్రతను కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఇలాంటి తరుణంలో ఒకే పంటపై ఆధారపడటం ఆర్థికంగా, ఆహారపరంగా కూడా ప్రమాదకరం. అందుకే పంటల వైవిధ్యం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాక, పోషకాహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకతకు కీలకమైన ఆచరణ మార్గంగా నిలుస్తుంది. పంటల వైవిధ్యం అంటే ఏమిటి ? పంటల వైవిధ్యం అంటే ఒకే పొలంలో లేదా ఒక వ్యవసాయ వ్యవస్థలో వేర్వేరు రకాల పంటలను, విభిన్న కాలాల్లో లేదా కలిపి సాగు చేయడం. ఇది నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వాతావరణ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించి, రైతుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు, కుటుంబానికి బహుముఖ పోషకాహార వనరులను అందిస్తుంది. స్థానిక నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఆకు కూరలు, దుంప జాతి పంటలు, పండ్ల మొక్కలు వంటి వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా ఈ వైవిధ్యాన్ని సాధించవచ్చు. గరిష్ఠ పోషక విలువలు ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా తక్కువ నీటితో, పరిమిత వనరులతో సాగు చేయగల, అధిక పోషక విలువల పంటలను ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకం. ఇలాంటి పంటలు కుటుంబానికి అవసరమైన శక్తి, మాంస కృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలను సమకూరుస్తాయి. చిరు ధాన్యాలు (జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామలు) : నీటి ఎద్దడిని తట్టుకునే గుణంతోపాటు అధిక పీచు, ఐరన్, కాల్షియం, బి-విటమిన్లు కలిగి ఉంటాయి. పప్పుధాన్యాలు (కంది, పెసర, మినుము, శనగలు): నేలలో నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచడం తోపాటు అధిక మాంసకృత్తులను అందిస్తాయి. నూనెగింజలు (వేరుశనగ, నువ్వులు, ఆవాలు): ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ల వంటి పోషకాలకు మంచి వనరు. ఆకుకూరలు, కూరగాయలు : విటమిన్ ఎ, సి, ఫోలేట్, ఐరన్ వంటి సూక్ష్మపోషకాలకు నిత్యావసర వనరులు. దుంప జాతి పంటలు (చిలగడదుంప, కంద): బెట్ట పరిస్థితుల్లోనూ నిలదొక్కుకుని, శక్తినిచ్చే పిండి పదార్థాలను అందిస్తాయి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా. ఎం.దీప విషయ నిపుణులు, (హోమ్ సైన్స్) కె.వి.కె., లాం గుంటూరు