మెట్ట ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఆధారమైన చెరువుల్లో, కుంటల్లో, బావుల్లో నీరు పూర్తిగా కనుమరు గవుతున్నాయి. బోరు బావుల్లో నీరు కొన్ని వందల అడుగుల కిందకి వెళ్లిపోయి ఎన్ని బోర్లు వేసినా నీరు పైకిరాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు బీళ్లుగా మారుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడానికి కారణాలు విశ్లేషిస్తే వర్షపు నీటిని నిల్వచేసుకునే చెరువులు, వాగులు, వంకలు ఆక్రమణలకు గురై పడిన వర్షం నీరు చెరువుల్లోకి చేరడానికి దారిలేక, నిల్వ ఉండేందుకు స్థలంలేక వృథాగా పోతున్నాయి. పొలాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన చిన్న చిన్న కుంటలను కూడా రైతులు పూడ్చేసి పొలాలుగా మార్చడం వల్ల నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోతోంది. పారిశ్రామికీకరణ, పట్టణాలు, నగరాల అభివృద్ధి నేపథ్యంలో రోడ్లు, భవనాలతో భూభాగం చాలావరకు కాంక్రీట్మయమైంది. ఇవి భూమిలోకి వర్షం నీరు ఇంకే విస్తీర్ణాన్ని క్రమేపీ తగ్గించేస్తున్నాయి. దీనికి తోడు రసాయనిక ఎరువుల మోజులో రైతులు పొలాలకు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించేయడంతో భూములకు నీటిని పీల్చుకునే స్వభావం కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల భూమిపై కురుస్తున్న వర్షం నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండాపోయి రోజురోజుకి భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. దాని కోసం ఏం చేయాలో చూద్దాం చెరువులకు నీరందించే వాగులు, వంకల్లో పూడికలు తీసి వర్షం నీరు సులభంగా చెరువును చేరేలా చేయాలి. మెట్ట పొలాల రైతులు తమకున్న పొలంలో వాలును బట్టి.. పొలంలో పడిన వర్షం నీరంతా చేరే పల్లపు ప్రాంతంలో చిన్నపాటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ నీటిని అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చు. మెట్టపొలాల్లో రైతులు తమ పొలం గట్టు కింది భాగాన రెండు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతు కందకాలను తవ్వుకుని వచ్చిన మట్టిని గట్ల పైభాగాన వేసుకోవాలి. దీని వల్ల పడిన వర్షం నీరు అక్కడికక్కడే భూమిలోకి ఇంకిపో తుంది. పడిన వర్షం వృథాగా బయటకు వెళ్లదు. వేసవికాలంలో మే నెలలో మెట్ట భూమి లోతుగా, వాలుకు అడ్డంగా దున్ని ఉంచడం వల్ల ఈ భూముల్లో పడిన వర్షం భూమిలోకి సులభంగా ఇంకుతుంది.పొల్లాల్లో వేసే ప్రధాన పంటలు, అంతరపంటలను వాలుకు అడ్డంగా వరుసల్లో వేసుకుంటే పల్లపు ప్రాంతాలకు వెళ్లే వర్షపునీటి వేగం తగ్గి ఆ నీరు భూమిలోకి ఇంకుతుంది. ఫలితంగా భూగర్భజలాల పరిమాణం క్రమంగా పెరుగు తుంది. మెట్టపొలాల్లో సేంద్రియ ఎరువులను విరివిగా వాడడం వల్ల వర్షం నీరు భూమిలో సులభంగా ఇంకుతుంది.ఇలా ప్రతిఒక్కరూ తమ పొలాల్లో పడిన వర్షాన్ని పొలంలోనే ఇంకేలా ప్రయత్నం చేస్తే గ్రామాల్లో భూగర్భజలాల స్థాయి పెరిగి. సాగుకు అనుకూలంగా ఉంటుంది ఈ ప్రక్రియను ఆచరణలోకి పెట్టేందుకు రైతులందరూ సిద్ధమవ్వాలి. ఆధారం: పాడిపంటలు