పార్థీనియం సమస్యాత్మక కలుపు మొక్క యాజమాన్యం పార్థీనియం అత్యంత ప్రమాదకరమైన, అత్యంత సులభంగా వ్యాపించే మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి, పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. పార్థీనియంను క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, కాంగ్రెస్ గడ్డి, ముక్కపుల్లాకు గడ్డి, ఛతక్ చాందిని మొక్క వయ్యారిభామ అని కూడా పిలుస్తారు. ఈ సమస్యాత్మక కలుపు మొక్క అమెరికా దేశం నుండి దిగుమతి అయిన గోధుమల ద్వారా 1950వ దశకంలో మన దేశంలో ప్రవేశించి కొద్ది సంవత్సరాలలోనే పంట పొలాల్లో, బంజరు భూముల్లో, రోడ్డు పక్కన జనవాసాల్లో, కాలువ గట్ల మీద, పొలం గట్ల మీద, పాడుబడిన ప్రతి ప్రదేశంలో పెరుగుతూ సమస్యాత్మకంగా మారింది. పార్థీనియం ఒక ఏక వార్షిక మొక్క వాతావరణ అనుకూల పరిస్థితుల్లో నాలుగు వారాల్లో పుష్పించి ఒక్క మొక్క దాదాపు పదివేల నుండి 50 వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. భూమి నుండి నత్రజనిని వేర్లు ద్వారా గ్రహించే శక్తి ఇతర మొక్కలతో పోలిస్తే వయ్యారిభామకు పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని పూలు తెల్లగా ఉండి, నల్లరేగడి భూముల్లో అధికంగా పెరుగుతుంది. అధిక విత్తన ఉత్పత్తి, విత్తన వ్యాప్తి, దీని వలన ఇతర మొక్కలపై రసాయనాల ప్రభావం, పశువులు తినలేకపోవడం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని జూన్ -జూలై మాసాల్లో వర్షాలను ఉపయోగించుకొని వృద్ధి చెంది, పంట పొలాల్లో ప్రధాన పంటలతో పోటీ పడుతుంది. ఇది మొలిచిన చోట్ల పంట పైరుల ఎదుగుదలను కుంటుపరుస్తుంది. అందువల్ల దిగుబడి తగ్గుతుంది. పక్వానికి వచ్చిన వయ్యారిభామ విత్తనాలు అతి చిన్నవిగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. కావున దీని నిర్మూలన సమర్థవంతంగా, వ్యాప్తి చెందకుండా చేయాలి. పత్తి, మొక్కజొన్న, గోధుమ, మల్బరి తోటలు, పూల తోటలు, మామిడి, కూరగాయల తోటల్లో ఎక్కువగాపెరుగుతాయి. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చి వేస్తుంది. వయ్యారిభామ వలన కలిగే నష్టాలు ఈ కలుపు మొక్క పంటలకే కాకుండా మనుషులకు, జంతువులకు హాని కలుగజేస్తుంది. పంట పొలాల్లో 40 శాతం దిగుబడి, పశుగ్రాసాల్లో 90 శాతం దిగుబడి తగ్గిస్తుంది. ఈ మొక్క ఉత్పత్తి చేసే పుప్పొడి టమాట, మిరప, వంగ, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటిలో ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. ఈ మొక్క వేర్లు నుండి శ్రవింపబడే కొన్ని రకాల రసాయనాలు పంట మొక్కలను పెరగనియ్యక దిగుబడి తగ్గిస్తాయి. పైరు మొక్కలతో పోటీపడి పంట దిగుబడిని తగ్గిస్తుంది. దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా మొక్కల్లో వివిధ రకాల వైరస్ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంది. మనుషులకు డెర్మటైటిస్, ఎగ్జిమా, ఉబ్బసం, తీవ్ర జ్వరం, శ్వాసనాళాల్లోకి వెళ్లి బ్రాంకైటీస్ లాంటివ్యాధులను కలుగజేస్తుంది. ఈ మొక్క ఆకులు చర్మానికి రాసుకున్నప్పుడు తామర వంటి చర్మవ్యాధి సంభవిస్తుంది. పొలాల్లో తిరుగుతూ దీని పుప్పొడిని పీలిస్తే కళ్ళు ఎర్రబడడం, కళ్ళు వాయడం, ఎండిపోయిన మొక్కలు తగలబెట్టినప్పుడు ఆ పొగను పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. యాజమాన్యం వయ్యారిభామ కలుపు నివారణకు అనేక పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ దీనిని నిర్మూలించుకోవాలి. ముఖ్యంగా రసాయనిక, జీవ నియంత్రణ, యాజమాన్య పద్దతులను సమన్వయపరిచి ఉపయోగించుకోవాలి. యాజమాన్య పద్ధతులు చేతితో పీకి వేయడం చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు చేతితో పీకి వేసి తగలబెట్టాలి లేదా కంపోస్ట్ చేయడానికి ఉపయోగించుకోవాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే పీకిన మొక్కలను, వెంటనే తగులు పెట్టి, విత్తన వ్యాప్తిని నిరోధించుకోవాలి. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడదు. మొక్కలను పీకేటప్పుడు తప్పకుండా చేతి తొడుగులను వేసుకోవాలి. పంట పొలాల్లో మొలిచిన వయ్యారిభామ పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కెయ్యాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగల బెట్టాలి. పంట మార్పిడి బంతితో పంట మార్పిడి చేస్తే, తర్వాత వేసే పైరులో ఈ కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. కంపోస్టింగ్ పార్థీనియం మొక్కలను పీకిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి నేలపైన పరిచి ట్రైకోడెర్మా అనే శిలీంధ్రాన్ని చల్లాలి. దానిపై 0.5% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ విధంగా ఒక మీటరు ఎత్తు వరకు పరుచుకొని చుట్టూ గాలి జొర పడకుండా బురదతో పూయాలి. 40 నుండి 45 రోజుల్లో కంపోస్ట్ ఎరువు తయారవుతుంది.జీవ నియంత్రణ పద్ధతులు జైగోగ్రామ బైకోలరేటా అని క్రైసోమిలీడ్ జాతికి చెందిన పెంకు పురుగులు పార్టీనియం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈనెలు మాత్రమే వదిలి పూర్తిగా ఆకులు తినే ఈ పురుగులు పార్టీనియం కలుపు నివారణలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక ఆడ పెంకు పురుగు 1500 నుండి 1800 గుడ్లు పెడుతుంది. ఆకుల అడుగు భాగంలో పెట్టిన గుడ్లు నాలుగైదు రోజులలో పొదగబడి పిల్ల పురుగులు బయటికి వస్తాయి. ఇవి కూడా ఆకులను విపరీతంగా తింటాయి. ఈ పెంకు పురుగులు వర్షాకాలంలో అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే కనబడతాయి. శీతాకాల, వేసవికాల ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక భూమి లోపల నిద్రావస్థ దశలో గడుపుతాయి. వర్షాలు పడగానే నిద్రావస్థ నుండి బయటికి వచ్చి మొక్కకు సుమారు 20 నుండి 30 పురుగులు ఉండి నష్టపరుస్తాయి. కలుపు మొక్కలపై వీటిని గమనిస్తే వాటిని అలాగే పెరగనిచ్చి ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయరాదు. కొన్ని రకాలైన ఆకుమచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగులు పార్థీనియంను ఆశిస్తాయి. వీటిని పీకి వేయకుండా ఉంచాలి. దీనివలన మిగతా. పార్థీనియం మొక్కలకు ఈ తెగులు ఆశించి నాశనం చేస్తాయి. కొన్ని కలుపుజాతి మొక్కలు పార్థీనియం మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. అవి కసివింద, వెంపలి, స్టైల్లో, హిస్టస్, తోటకూర, పసర కంప మొదలైనవి. రసాయనిక పద్ధతులు ఈ పద్ధతుల వలన మొక్కల పెరుగుదలను తాత్కాలికంగా నిరోధించుకోవచ్చు. ముఖ్యంగా కలుపు నివారణ మందులు పిచికారీ చేసేటప్పుడు పక్కన ఉన్న పంటల పైన పడకుండా జాగ్రత్త పడాలి. అట్రాజిన్ 4 గ్రాములు లీటర్ నీటికి పంట మొలకెత్తక ముందు, 2,4 డి సోడియం సాల్ట్ రెండు గ్రాములు లీటర్ నీటికి పంట మొలకెత్తిన 15 నుండి 20 రోజులకు, అదేవిధంగా బంజరు భూముల్లో అట్రాజిన్ ఐదు గ్రాములు లేదా పారాక్వాట్ మందును, పైన తెలిపిన పద్ధతులను ఉపయోగించి పార్థీనియం నివారించుకోవాలి. ఆధారం: పాడిపంటలు , వ్యవసాయ పరిశోధన స్థానం, తాండూర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వికారాబాద్.