తెలంగాణలో ఎల్ నినో పరిస్థితులకు అనుగుణంగా కూరగాయల సాగు, నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో వాతావరణ దృగ్విషయం భారతదేశ నైరుతి రుతుపవనాల పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. దీని వల్ల వర్షాలు ఆలస్యంగా ప్రారంభమవడం, వర్షపాతం అసమానంగా కురవడం, మధ్యలో ఎక్కువ రోజులపాటు వర్షాలు లేకపోవడం, పంటలు బెట్టకు గురికావడం, చివరకు కరువు పరిస్థితులు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చరిత్రను పరిశీలిస్తే, 1876-78 మధ్య సంభవించిన తీవ్రమైన ఎల్‌నినో ప్రభావంతో దక్కన్ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడి, నాటి హైదరాబాద్ నిజాం సంస్థానంతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ కరువు వ్యవసాయ ఉత్పత్తి, ఆహార భద్రత, ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం కూడా ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు తగ్గడం, నీటి లభ్యత క్షీణించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ వానాకాలంలో తెలంగాణలో వర్షపాతం జిల్లాలవారీగా మారుతూ నమోదవుతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, మధ్య తెలంగాణలో సాధారణానికి దగ్గరగా లేదా కొద్దిగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం 132.38 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, జూలై మధ్య నాటికి 55.31 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైంది. సాగునీటికొరత కారణంగా ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా 65.9 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే చోట ఈ ఏడాది జూలై మధ్య నాటికి కేవలం 6.3 లక్షల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. గోదావరి బేసిన్ జలాశయాల్లో 27.69 టీఎంసీలు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 14.81 టీఎంసీలు మాత్రమే నికర నీటి నిల్వలు ఉండటంతో సాగునీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగు విస్తీర్ణాన్ని వీలైనంత వరకు తగ్గించి, తక్కువ నీటితో లాభదాయకంగా పండే ఉద్యాన పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగు వైపు రైతులు మళ్లడం అవసరం. గత వానాకాలంతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 1,72,867 ఎకరాలు తగ్గింది. ముఖ్యంగా నీటి కొరత కారణంగా టమాట, బెండ, తీగజాతి కూరగాయల సాగు 34,146 ఎకరాలు తగ్గడంతో మార్కెట్లో కూరగాయల సరఫరా తగ్గి ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితి రైతులకు ఒకవైపు సవాలుగా ఉన్నప్పటికీ, మరోవైపు సరైన పంటల ఎంపిక, నీటి యాజమాన్యం, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటిస్తే కూరగాయల సాగులో మంచి ఆదాయం పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వివిధ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో వచ్చిన మార్పులను పట్టిక 1లో చూడవచ్చు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళిక వ్యవసాయ శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షపాత లోటును అధిగమించడానికి జిల్లాల వారీగా అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశాయి. ఆలస్యంగా కురిసే వర్షాలను బట్టి ఏయే సమయాల్లో ఎలాంటి కూరగాయ పంటలను ఎంచుకోవాలో పట్టిక 2 ద్వారా వివరించాం. నీటి ఎద్దడిని తట్టుకునే కూరగాయల రకాలు, వంగడాలు : ఉద్యాన పంటలలో ముఖ్యంగా కూరగాయల సాగులో ఎల్‌నినో ఒత్తిడిని తట్టుకోవడానికి తక్కువ నీటితో, ఎక్కువ వేడిని తట్టుకుని, సల్ప కాలంలో నాణ్యమైన దిగుబడిని నిచ్చే రకాలు, వంగడాలు వేసుకోవాలి.టమాట, వంకాయలో గ్రాఫ్టెడ్ నాట్లు ఉపయోగిస్తే నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటాయి. ఒకేసారి కాకుండా విడతల వారీగా నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు, నేల తేమ సంరక్షణ యాజమాన్యం : కేవలం కరువు తట్టుకునే వంగడాల ఎంపికే కాకుండా, నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం ద్వారానే పంటలను కాపాడుకోగలం. నల్లరేగడి నేలల్లో తేమను కాపాడటానికి "నిజ సమయ అత్యవసర ప్రణాళికా చర్యలు" కింద నేలలో పడే లోతైన పగుళ్లను పంట అవశేషాలతో కప్పి వేయడం, బోదెల సాల్ల పద్ధతిని అనుసరించడం వంటి పద్ధతుల ద్వారా భూమిలో తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నేల సారాన్ని, తేమను నిలుపుకునే గుణాన్ని పెంచడానికి ఎకరానికి 15 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల వర్మీకంపోస్ట్‌ను తప్పనిసరిగా వేసుకోవాలి. ఎకరానికి 40-60 కిలోల వేప పిండిని విత్తే వరుసలలో 4-6 అంగుళాల లోతులో వేసి, మట్టితో కలిపి వెంటనే నీరు పెట్టాలి. మంచి ఫలితాల కోసం ఈ ప్రక్రియను పంట నాటడానికి 10-14 రోజుల ముందే పూర్తి చేయాలి. దీనివల్ల మట్టి స్థిరపడి, మొక్కలకు పురుగుల నివారణ, ఎరువుల గుణాలు పూర్తిగా అందుతాయి. నారుమడి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విపరీతమైన ఎండ వేడిమి నుండి రక్షణ కోసం కొబ్బరి ఆకులు లేదా 50% నీడనిచ్చే గ్రీన్ షేడ్ నెట్లతో తాత్కాలిక పైకప్పులను ఏర్పాటు చేయాలి. నారును ప్రధాన పొలంలో నాటడానికి వారం రోజుల ముందు నీటి తడులను తగ్గించి మొక్కలను గట్టిపడేలా చేయాలి. నారు పీకే ముందు రోజు నారుమడికి సమృద్ధిగా నీరు పెట్టడం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతినకుండా సులభంగా వస్తుంది. నాటే సమయంలో నారు మొక్కల కొనలను కత్తిరించడం ద్వారా బాష్పోత్సేకం రేటు తగ్గి మొలక త్వరగా కోలుకుంటుంది. కూరగాయల వంటలు తక్కువ నీటిని తట్టుకోవడానికి ట్రయాకొంటనాల్ లేదా హోమోబ్రాసినోలైడ్ వంటి మందులను వాడాలి. ఇవి మొక్కల వేర్లను బలంగా చేసి, తీవ్రమైన ఎండల నుండి, నీటి ఎద్దడి నుండి పంటను కాపాడతాయి. వాతావరణం పొడిగా మారడానికి లేదా కరువు రావడానికి 2 నుండి 3 రోజుల ముందే వీటిని పిచికారీ చేయాలి. ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్నం కాకుండా, కేవలం ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే స్ప్రే చేయడం మంచిది. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. కూరగాయల పంటలపై సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి 2-3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల పూత, కాత రాలడం తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. బెడ్ల తయారీ, మల్చింగ్ అమరిక ఎత్తు మడులను సిద్ధం చేసిన తర్వాత, మొక్కకు ఇరువైపులా 5-10 సెంటీమీటర్ల లోతులో నాగలి చాలు తీయాలి. మల్చింగ్ షీట్ (25 మైక్రాన్ల) అంచులు ఈ నాగలి చాలులోకి వెళ్లేలా అమర్చి గట్టిగా మట్టితో కప్పాలి. మల్చిషీట్ వేసే పనులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే చేపట్టాలి. విత్తడానికి ముందే తగిన దూరాలలో రంధ్రాలు చేసుకోవాలి. ఈ మల్చింగ్ షీట్‌ను మొదటి పంట ముగిసిన తర్వాత రెండో పంటకు కూడా పునరుపయోగించుకోవచ్చు. నీటి ఆదా వరితో పోలిస్తే 60% పైగా నీటిని ఆదా చేసే బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతుల ద్వారా కనీసం 3 నుండి 4 ఎకరాలలో కూరగాయలను సాగు చేయవచ్చు. అంతర పంటల విధానం ఒకే బెడ్‌పై బెండతో పాటు ఆకుకూరలు వేయడం ద్వారా తక్కువ స్థలంలో, ఒకే నీటి సరఫరాతో ఎక్కువ దిగుబడి వస్తుంది. నీటి కొరత పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను సమర్థంగా వినియోగించుకోవడం అత్యంత అవసరం. రైతులు వర్షపు నీటిని వ్యవసాయ చెరువుల్లో నిల్వ చేసుకొని అవసరమైన సమయంలో వినియోగించాలి. తెలంగాణ ప్రభుత్వం ఫారం పాండ్స్, సూక్ష్మ నీటి పారుదల పథకాల ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలకు రాయితీలు అందిస్తోంది. అలాగే తీగజాతి కూరగాయల పందిరి నిర్మాణానికి కూడా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. రైతులు స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలి. వరి సాగుపై ప్రత్యేక సూచన: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం లోటు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, భూగర్భజలమట్టాలు పడిపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తగినంత సాగునీటి వనరులు లేని రైతులు వరి నాట్లను ప్రారంభించే ముందు నీటి లభ్యతను తప్పనిసరిగా అంచనా వేయాలి. వరి పంటకు మొత్తం పంట కాలంలో అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది. మధ్యలో నీటి కొరత ఏర్పడితే దిగుబడి తీవ్రంగా తగ్గడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరం. అలాగే అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు, తరువాత సాగునీటి అవసరాలకు వినియోగించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో ఎరువుల వినియోగంపై జాగ్రత్తలు దీర్ఘకాలం వర్షాలు లేక నేలలో తేమ తగ్గిన పరిస్థితుల్లో యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులను వేయడం వల్ల మొక్కలు వాటిని సమర్థవంతంగా గ్రహించలేవు. అంతేకాకుండా వేర్లు దెబ్బతినడం, మొక్కల పెరుగుదల మందగించడం, ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి బెట్ట పరిస్థితుల్లో నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులను ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయడం మంచిది. పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్, జీవ ఎరువులు, నేల పరీక్ష ఆధారంగా సమతుల్య పోషక నిర్వహణను పాటించడం ద్వారా మొక్కలు బెట్ట పరిస్థితులను మెరుగ్గా తట్టుకుంటాయి. వాతావరణ సూచనల ఆధారంగా పంట నిర్వహణ ఎల్‌నినో సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు భారత వాతావరణ శాఖ, తెలంగాణ వాతావరణ కేంద్రం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం విడుదల చేసే వాతావరణ సూచనలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ పంట నిర్వహణ చేపట్టాలి. వర్షాల అంచనాలను బట్టి విత్తడం, నాట్లు వేయడం, నీటిపారుదల, ఎరువుల వినియోగం, మందుల పిచికారీ వంటి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల యాజమాన్యం ఎల్‌నినో కాలంలో ఉండే పొడి వాతావరణం కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక, నల్లి, నల్ల తామర మరుగుల ఉదృతికి కారణమవుతుంది. ఇవి నేరుగా ఆకుల నుండి రసాన్ని పీల్చి మొక్కలను ఎండబెట్టడమే కాకుండా, ఆకుముడత వైరస్, జెమిని వైరస్, పల్లాకు తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ వంటి భయంకరమైన వైరస్ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఎకరానికి కనీసం 20 పసుపు రంగు, 20 నీలిరంగు జిగురు అట్టలను అమర్చి తామర పురుగులు, తెల్లదోమలను ఆకర్షించి చంపవచ్చు. పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టాలను అమార్చుకోవాలి. పొలంలో అక్కడక్కడా ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం వల్ల లద్దెపురుగులను పక్షులు తినివేస్తాయి. వేప గింజలకషాయం (5%) లేదా వేపనూనె (1500 ఆజాడిరక్టిన్ పి.పి.ఎం.) లీటరు నీటికి 5 మీ లీ చొప్పున కలిపి ముందస్తుగా పిచికారీ చేయడం వల్ల వైరస్ వాహకాల ఉధృతి తగ్గుతుంది. పురుగుల ఉధృతి ఆర్థిక నష్టపరిమితిని మించినప్పుడు మాత్రమే పట్టిక 5లో సూచించిన సిఫారసు చేసిన రసాయనాలను వాడాలి. ఎలినినో పరిస్థితులు రైతులకు ఒక సవాలే అయినప్పటికీ, సరైన పంటల ఎంపిక, గ్రాఫ్టెడ్ నాట్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ లేదా సేంద్రియ మల్చింగ్, సమగ్ర సస్యరక్షణ,, వాతావరణ ఆధారిత వ్యవసాయ నిర్ణయాలను పాటించడం ద్వారా దిగుబడి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సూచించిన అత్యవసర పంట నిర్వహణ చర్యలను రైతులు అనుసరించడం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడిని సాధించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పట్టిక 1. వివిధ దశల్లో పంటల విస్తీర్ణంలో 2025-26, 2026-27 ప్రగతిశాతం ఉద్యాన పంటలు సాగు విస్తీర్ణం2025-26 (హెక్టార్లు) సాగు విస్తీర్ణం2026-27 (హెక్టార్లు) విస్తీర్ణంలో పెరుగుదల(హెక్టార్లు) కూరగాయలు, ఆకుకూరలు 53,405 19,259 34,146 మసాలా దినుసులు (పసుపు, మిర్చి, అల్లం, ఉల్లి మొదలైనవి) 1,81,735 41,395 1,40,340 పండ్ల తోటలు (మామిడి, నిమ్మ, జామ మొదలైనవి) 4,52,921 4,52,104 817 ఆయిల్ పామ్, ఇతర వాణిజ్య పంటలు 3,10,776 3,20,111 +9,335 (పెరుగుదల) పట్టిక 2. ఎల్‌నినో సంక్షోభంలో అంతర పంటలుగా వేయదగిన కూరగాయలు వానాకాల సమయం నేల రకం, జోన్ సిఫార్సు చేసిన కూరగాయ పంటలు, అంతర పంటల విధానాలు జూలై 16 నుండి జూలై 31 వరకు తేలికపాటి, చల్నా నేలలు(ఉత్తర, దక్షిణ తెలంగాణ) తక్కువ కాల పరిధిలో గల గోరుచిక్కుడు, నవరత్నం, మొలక (ఎ కి మే -1), బీరకాయ (ఆక్ర గిరువు). ఎర్ర నేలల్లో కంది, జొన్నతో పాటు అంతర పంటలుగా కూరగాయలు. ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు మధ్యస్థం నుండి బరువైన నేలలకి నేలలు(మధ్య తెలంగాణ) స్వల్పకాలిక కూరగాయలను ఎంచుకోవాలి, పంటలలో నాటు వేయడం ఎంతో లాభదాయకం. కాకర, కందులు (4:1) నిష్పత్తిలో కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఆగస్టు 16 నుండి ఆగస్టు 31 వరకు రబీకి తేమ గల అన్ని రకాల నేలలు వేగంగా దిగుబడినిచ్చే టమోటా, పాలకూర, కొత్తిమీర, పెసర, మెంతి వంటి ఆకుకూరల సాగు చేయవచ్చు. పట్టిక 3. ఎల్‌నినో పరిస్థితుల్లో కూరగాయలు రకాలు, వంగడాలు పంట అనుకూలమైన రకాలు వెండర్ ఆరియా, నిత్యా, ఆరా అనామిక, పూసా సావని, వరా, ఉపార్, పుష్పా ఉత్సవి, భోగి లలిత, వినాస్, బీహెచ్-11, అద్వయాంత సోనాలి, బ్రిగేడియర్, గోరి వండి వంగడాలు వంకాయ తేజ, ఎల్వీ-334, ఆరా హైబ్రిడ్, పూసా జ్యోతి, అర్కా హర్షిత, ఎంఎస్ఆర్ 978, జ్యోతి హైబ్రిడ్ రకాలు వంకాయ శ్యామల, భాగ్యమతి, పూసా క్రాంతి, అర్కా నీలకాంత, మంజరి, ఉత్తర రకాలు టమాట అర్కా వికాస్, అర్కా రక్షక్, అర్కా సమ్రాట్, ప్రైవేట్ హైబ్రిడ్ రకాల్లో సాహారా, బహుబా, పీమిసెల్ 3348, ఆదిత్య, ఆర్క్ ఎఫ్1 సంకర రకాలు. ప్రాసెసింగ్ రకాల్లో పూసా గౌరవ్, రోమా, రంజిత్ ముచ్చట, పూసా ఉపహార్, అర్కా రక్షక్ వంటి రకాలు ఉన్నాయి. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ రకాలను సాగు చేయవచ్చు. చిక్కుడు(బీన్ రకాలు) అర్కా జయ, అర్గ్యసంద్ర, అర్కా అమోఘ, హెచ్చావల్లి ఆరెంజ్-4, కొంకణ్ భూషణ్ కాకర/అనపకాయ(బీన్ రకాలు) అర్కా గంగ, అర్కా సుమన్, పూసా హైబ్రిడ్, కోటి కాంత్ రకాలు. అధిక మాంగనీస్తత్వం (22%) కలిగిన, కోతకు 50–55 రోజుల్లో మొదటి కోతకు వచ్చే రకాలు (ఎంఐపి లు 1–1రకం) గోరుచిక్కుడు పూసా నవబహార్, పూసా సదాబహార్ దోసకాయలు అర్కా బీదర్, అర్కా పూర్ణి, అర్కా సుప్రీత్ పాలకూర ఆల్ గ్రీన్, అర్కా అనుపమ గోంగూర స్థానిక రకాలు బీట్రూట్ సోనాకాయ (అర్కా బీట్రూట్), కాకరకాయ (అర్కా హారిత), బీరకాయ (అర్కా సుప్రీత్), నల్లగుల్లికాయ కూరగాయలు రకాలు ఎల్‌నినో పరిస్థితులకు అనువైనవి పట్టిక 4. బెట్ట పరిస్థితుల్లో మొక్కలలోని ఒత్తిడిని తగ్గించడానికి పిచికారీ చేయాల్సిన రసాయన వివరాలు ఒత్తిడి పరిస్థితి అవసరమైన రసాయన పిచికారీ పరిస్థితి, ప్రయోజనాలు తొలి దశలో నీటి ఎద్దడి లీటరు నీటికి 5–7 గ్రా చొప్పున 19:19:19 ఎన్.పి.కె. ఎరువులను రెండు సార్లు పిచికారీ చేయాలి. మొక్కల ప్రారంభ పెరుగుదలకు కావాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం అందుబాటులోకి వస్తాయి. తీవ్రమైన బెట్ట, వేడిమి 1% నుండి 1.5% పొటాషియం నైట్రేట్ (లేదా 13:0:45) ఆకులపై పిచికారీ చేయాలి. ఆకుల్లో పత్రరంధ్రాల నియంత్రణ బాగుండి బాష్పోత్సేకం తగ్గుతుంది, కాయ పరిమాణం పెరుగుతుంది. కాయ రాలడం, పగుళ్లు 0.2% బోరాన్ లేదా డై-సోడియం ఆక్టాబోరేట్ లీటరు నీటికి 1.5–2.0 గ్రా కలిపి స్ప్రే చేయాలి. పూత, పిందె కాండం బలంగా మారి రాలడం తగ్గుతుంది. టొమాటో కాయలు పగలకుండా నిరోధించవచ్చు. సన్ స్కాల్డ్ నివారణ 3% నుండి 5% కయోలిన్ ద్రావణం పిచికారీ చేయాలి. ఆకులపై ఒక తెల్లని పొర ఏర్పడి హానికరమైన సూర్యకిరణాలను పరావర్తనం చేస్తుంది, కాయ ఎండ దెబ్బకు గురికాదు. పట్టిక 5. వైరస్ తెగులు వ్యాప్తి చేసే వాహక పురుగుల నియంత్రణ సిఫార్సు చేసిన రసాయనాలు. తెగులు లేదావాహక పురుగు వ్యాప్తి చేసే వైరస్, లక్షణాలు రసాయన నియంత్రణ చర్యలు తామర పురుగులు పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్; ఆకుల అంచులు వెనక్కు ముడుచుకోవడం. ఫిప్రోనిల్ 5% ఎస్.సి., 2 మి.లీ / లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి. (0.25 మి.లీ / లీటర్ నీటికి) లేదా స్పైనెటోరమ్ 11.7% ఎస్.సి., 1 మి.లీ / లీటర్ నీటికి పిచికారీ చేయాలి. తెల్లదోమ జెమిని వైరస్, బెండలో పల్లాకు తెగులు; ఆకులు పసుపు రంగులోకి మారడం. ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్.ఎల్. (లీటరు నీటికి 0.3 మి.లీ లేదా 10 లీటర్ల నీటికి 3 మి.లీ) లేదా పైరిప్రాక్సిఫెన్ 18% ఎస్.ఎల్. 1.6 మి.లీ / లీటర్ నీటికి పిచికారీ చేయాలి. పేనుబంక, పచ్చదోమ లేత ఆకుల అడుగుభాగంలో చేరి రసం పీల్చడం; ఆకులు ‘వి’ ఆకారంలో మారడం. థియామెథాక్సామ్ 0.25 డబ్ల్యూ.జి. 0.4 గ్రా లేదా పసుపు రంగులోకి మారడం. ఎసిటామిప్రిడ్ 20% ఎస్.పి. 0.2 గ్రా / లీటర్ నీటికి పిచికారీ చేయాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు