ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే (Digital Crop Survey - DCS) ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే (Digital Crop Survey - DCS) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) సహకారంతో రూపొందించిన సమగ్ర సాంకేతిక ఆధారిత వ్యవస్థ. రాష్ట్రవ్యాప్తంగా పంటల వివరాలను నమోదు చేసి, వ్యవసాయ ప్రణాళిక, పరిపాలన, రైతు సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన అధీకృత పంట సమాచారాన్ని ఒకే వేదికపై అందిస్తుంది.ఈ ప్రక్రియలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో భూమిని పరిశీలించి, జియో-ఫెన్సింగ్ (Geo-Fencing) సాంకేతికతతో మొబైల్, వెబ్ అప్లికేషన్ ద్వారా ప్రతి భూకమతానికి సంబంధించిన పంట వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. ఈ-పంట ముఖ్య ఉద్దేశం ఈ-పంట ప్రధాన ఉద్దేశం కచ్చితమైన, అధీకృత సాగు చేసిన పంటల సమాచారాన్ని రూపొందించి అన్ని స్థాయిలలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా, శాస్త్రీయ పంట ప్రణాళిక, పర్యవేక్షణ, వ్యవసాయ వనరుల సమర్థవంతమైన కేటాయింపు, రైతు సంక్షేమ పథకాల పారదర్శక అమలు, వ్యవసాయ గణాంకాలు, అంచనాలు, ప్రణాళికకు విశ్వసనీయ సమాచారం అందుబాటులో ఉంచుతుంది. ఈ-పంట సర్వే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూ కమతాలను నమోదు చేస్తూ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సాగు, సామాజిక అటవీ విభాగాల పంట వివరాలను నమోదు చేస్తుంది. సమగ్ర CCRC మాడ్యూల్ అభివృద్ధి పరిచి కౌలు రైతుల వివరాలను నమోదు చేస్తుంది. ఈ-పంట ద్వారా రూపొందించే అధీకృత సమాచారం కనీస మద్దతు ధర సేకరణ, పంట నష్టం పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా, వడ్డీ లేని పంట రుణాలు, ఎరువుల వంటివి, ఇతర రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలకు అనుగుణంగా, డేటా నాణ్యతను మరింత మెరుగుపరచడానికి కొన్ని కొత్త అంశాలు చేర్చబడ్డాయి. ప్రతి భూ కమతానికి భూ వినియోగ పరంగా వర్గీకరించడం అనగా వ్యవసాయం, వ్యవసాయేతర, ఆక్వా సాగు, బీడు భూములు, ఇతరాలుగా వర్గీకరించడం, క్షేత్రస్థాయిలో తీసిన ఫోటోలను కృత్రిమ మేధ (AI) సాయంతో 100 శాతం కచ్చితత్వం నిర్ధారణ. 20 మీటర్ల జియో-ఫెన్సింగ్‌తో పంటల నమోదు, జియో సేఫ్టీ షీల్డ్ ద్వారా ప్రతి రైతు సేవ కేంద్రానికి కేంద్రానికి పూర్తిస్థాయి, శాశ్వత సరిహద్దులను నిర్ధారిస్తుంది. ఈ-పంట నమోదులో పారదర్శకత, కచ్చితత్వం, రైతులను భాగస్వాములను చేసేందుకు ప్రతి రైతుకి 3 సంక్షిప్త సమాచారాలు తెలుగులోనే వారి మొబైల్ ఫోన్లకు పంపుతారు. మొదటి సమాచారం పంట నమోదు చేసే తేదీ, రెండవ సమాచారం పంట నమోదు చేసిన తరువాత, మూడవది పంట నమోదు వివరాలు రైతు నిర్ధారించిన తర్వాత పంపటం జరుగుతుంది. అంతేకాకుండా రైతులే APAIMS 2.0 అప్లికేషన్ ద్వారా తమ పంటలను తామే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. పంట వివరాలను నిర్ధారించవచ్చు (ఈ-కేవైసీ). ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే వ్యవసాయ రంగంలో డిజిటల్ పరివర్తనకు ఒక ముఖ్యమైన ముందడుగు. మొబైల్ సాంకేతికత, జియో-ఫెన్సింగ్, కృత్రిమ మేధ (AI), రైతు ధృవీకరణ, రియల్ టైమ్ పర్యవేక్షణను సమన్వయం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్ంగా కచ్చితమైన, పారదర్శకమైన పంటల సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ-పంట ద్వారా రూపొందించబడే ధృవీకరించబడిన పంటల డేటాబేస్ వ్యవసాయ పరిపాలనను బలోపేతం చేయడంతో పాటు, వ్యవసాయ ఆధార విధాన రూపకల్పనకు తోడ్పడి, రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి దోహద పడుతుంది. తద్వారా స్థిరమైన వ్యవసాయాభివృద్ధి, రైతుల జీవనోపాధి మెరుగుదలకు ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ