రాజ్మా (Rajma / Kidney Beans) ఒక అపరాల పంట. దీనిలో 20-25% వరకు ప్రొటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్, ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. సాధారణ కంది, పెసర పంటలతో పోలిస్తే మార్కెట్ ధర ఎక్కువగా ఉండటం వల్ల. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసినా రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాతావరణం రాజ్మా చల్లని వాతావరణాన్ని ఇష్టపడే పంట. 15–25°C ఉష్ణోగ్రత పంట పెరుగుదలకు అనుకూలం. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పంట బాగా పెరుగుతుంది. అరకు లోయ, హార్స్లీ హిల్స్ వంటి కొండ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఖరీఫ్ కూడా సాగు చేయవచ్చు. మంచి నీటి సౌకర్యం ఉన్న గరప నేలలు లేదా ఒండ్రు నేలలు అనుకూలం. నేల pH విలువ 6.0-7.5 మధ్య ఉండాలి. నీరు నిలిచే బంక నేలలు అనుకూలం కాదు. రకాలు: HUR-137, VL-63, PDR-14 (స్వల్ప కాలిక తెగుళ్లను తట్టుకునే రకాలు), ఎర్రటి- మచ్చల గింజలు కలిగిన రకాలు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతాయి. విత్తే పద్ధతి విత్తన మోతాదు: ఎకరాకు 25-30 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి: విత్తనాలను రైజోబియం కల్చర్ తో పాటు, ఫంగస్ నివారణకు థైరమ్ లేదా కార్బండిజమ్తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. దీనివల్ల నేలలో నత్రజని స్థిరీకరణ మెరుగవుతుంది. ఎరువులు (ఎకరాకు) నత్రజని 8-10 కిలోలు (ప్రాథమిక మోతాదుగా), భాస్వరం 20 కిలోలు, పొటాష్ 15 కిలోలు వేయాలి. సేంద్రియ ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు వేయడం వల్ల నేల సారవంతంగా మారుతుంది. కోత మరియు నిల్వ : పంట వేసిన 90-110 రోజులకు కాయలు పండి, ఆకుపచ్చ రంగు మారి గోధుమ రంగుకు వచ్చినప్పుడు కోతకు సిద్ధమవుతుంది. కోసిన కాయలను 3– 4 రోజులు ఎండలో ఆరబెట్టి, తర్వాత నూర్పిడి చేయాలి. గింజలలో తేమ శాతం 10–12%కి తగ్గే వరకు ఆరబెట్టి, గాలి చొరబడని సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ చేసేటప్పుడు కీటకాల బెడద నుండి రక్షణ కోసం వేప ఆకులు లేదా సిఫారసు చేసిన నిల్వ మందులు వాడవచ్చు. రాజ్మాతో రుచికరమైన వంటకాలు రాజ్మా చావల్ : పంట నుండి పళ్ళెం వరకు ఒక పోషకాహార కథ : రాజ్మా చావల్ అనేది ఉత్తర భారతదేశపు వంటగదుల్లో పుట్టి, నేడు దేశమంతటా ప్రతి ఇంటిలో ఇష్టంగా వండుకునే ఒక సాధారణమైన, అత్యంత పోషకమైన వంటకంగా మారింది. కిడ్నీ బీన్స్ (రాజ్మా) కర్రీని వేడి వేడి అన్నంతో కలిపి తినే ఈ కాంబినేషన్లో రుచి ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా నిండుగా ఉంటుంది. అంతేకాక, రాజ్మా అనేది మన రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే ఒక విలువైన పప్పుధాన్యపు పంట కూడా. అవసరమైన పదార్థాలు చావల్ (అన్నం) కోసం బాస్మతి బియ్యం 1.5 కప్పులు నీళ్లు - 3 కప్పులు ఉప్పు - కొద్దిగా యాలకులు / లవంగాలు - రుచి కోసం. తయారీ విధానం నానబెట్టిన రాజ్మాను ప్రెజర్ కుక్కర్లో ఉప్పు వేసి 4-5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యేవరకు ఉడకాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. తర్వాత ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి. టమోటా పేస్ట్ వేసి, నూనె విడిపోయే వరకు బాగా వేయించాలి. పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఉడికించిన రాజ్మాను దాని నీటితో సహా మసాలాలో వేసి 10-15 నిమిషాలు మరిగించాలి. గరం మసాలా వేసి కలపాలి. కావాలంటే కొద్దిగా రాజ్మాను చెంచాతో మెత్తగా నొక్కితే కర్రీ చిక్కగా అవుతుంది. బియ్యాన్నికడిగి నీళ్లలో ఉప్పు వేసి మామూలుగా అన్నం వండుకో వాలి వేరుగా గానీ, కుక్కర్లో గానీ. వేడి వేడి అన్నం మీద రాజ్మా కర్రీ వేసి, పైన కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషక విలువలు సుమారు 350-400 కిలో కేలరీలు ప్రోటీన్: 12-15 గ్రాములు శాకాహారులకు మాంసం లేని ప్రోటీన్ మూలం. ఫైబర్: 8-10 గ్రాములు జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మేలు ఐరన్: రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫోలేట్, ఇతర B విటమిన్లు గర్భిణీ స్త్రీలకు, పెరుగుతున్న పిల్లలకు మేలు. కార్బోహైడ్రేట్లు: అన్నం నుండి శరీరానికి తక్షణ శక్తి. తక్కువ కొవ్వు, తక్కువ కొలెస్ట్రాల్: గుండె ఆరోగ్యానికి మంచిది. రాజ్మా అన్నం కలిపి తింటే, ఇది ఒక సంపూర్ణ ప్రోటీన్ గా మారుతుంది. ఎందుకంటే అన్నంలో లేని అమైనో ఆమ్లాలు రాజ్మాలో ఉంటాయి, రాజ్మాలో లేనివి అన్నంలో ఉంటాయి.ఇది తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలనిచ్చే పప్పుధాన్యపు పంట. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి, తగిన వాతావరణం ఉన్న రైతులకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయ పంటగా పరిగణించవచ్చు. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా.ఎం.దీప, విషయ నిపుణులు (హోమ్ సైన్స్), గుంటూరు.