వేరుశనగ పూత,కాయ దశల్లో మేలైన యాజమాన్యం జూన్-జులై నెలల్లో విత్తిన పంట సెప్టెంబర్ నెలలో ప్రధానంగా శాఖీయ దశ నుండి పూత, ఊడలు దిగే దశ (పెగ్గింగ్) కాయ అభివృద్ధి (పాడ్ ఫిల్లింగ్) దశల మధ్య ఉంటుంది. ఈ దశలు పంట కాలంలో అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో తీసుకునే యాజమాన్య పద్దతులు పంట దిగుబడిని, గింజ నాణ్యతను నిర్ధారిస్తాయి. పూత, ఊదలు దిగే దశ: విత్తిన 25-30 రోజుల నుండి పూత దశ ప్రారంభమై, 35-45 రోజుల మధ్య ఊడలు దిగే దశకు చేరుకుంటుంది. ఈ దశలో మొక్కకు అవసరమైన పోషకాలు, తేమ, వెలుతురు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతర కృషి : విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర కృషి చేసి మట్టిని మెత్తగా, వదులుగా చేయడం వలన ఊడలు సులభంగా నేలలోకి చొచ్చుకు పోయి, కలుపు నియంత్రణ కూడా జరుగుతుంది. అయితే ఊడలు దిగే దశలో లోతైన అంతరకృషి చేయకూడదు, దీనివల్ల ఏర్పడుతున్న ఊడలు దెబ్బతింటాయి.. మొదళ్ళకు మట్టి ఎగదోత : వరుసల మధ్య మట్టిని మొక్కల మొదళ్ళకు ఎగదోయడం వలన కాయలు బాగా ఊరి, తేమ నిలుపుదలకు కూడా తోడ్పడుతుంది. కలుపు నివారణ : ఈ దశలో కలుపు మొక్కలు పోషకాల కోసం పోటీపడకుండా ఎప్పటికప్పుడు నివారించాలి. ప్రత్యేకించి ఊడలు దిగే ముందు పొలం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అధిక దిగుబడులకు విత్తిన 45 రోజుల వరకు కలుపు లేకుండా చేయడం చాలా ముఖ్యం. తేమ సంరక్షణ-వర్షాభావ పరిస్థితుల్లో యాజమాన్యం సెప్టెంబర్లో వర్షాభావం, దీర్ఘకాల పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడితే పూత, ఊడ దిగే దశ, కాయ అభివృద్ధి దశల్లో దిగుబడు లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 7-10 రోజులకు మించి పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడితే, తేలికపాటి తదులు ఇవ్వాలి. నేలలో తేమను నిలవడానికి పంట అవశేషాలు లేదా ఎండుగడ్డితో నేలను కప్పి ఉంచడం (మల్చింగ్ వంటి తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలి, ప్రత్యేకించి వర్షాధార పంటలో ఇది ఎంతో ఉపయోగకరం. తుంపర లేదా బిందు సేద్య సదుపాయం ఉన్నవారు పుష్పించే, ఊడ దిగే దశ, కాయ ఏర్పడే దశల్లో తేమ లోటు రాకుండా ప్రాధాన్యతా క్రమంలో నీటిని అందించాలి. కలుపు నివారణ, సకాలంలో అంతరకృషి కూడా తేమ సంరక్షణకు పరోక్షంగా దోహదపడతాయని గుర్తుంచుకోవాలి. నీటి ఎద్దడి : పొడి పరిస్థితుల్లో మల్చింగ్, రక్షిత తడులు ఇవ్వడం ద్వారా మొక్కలపై ఒత్తిడిని తగ్గించాలి. ముంపు పరిస్థితులు : వేరుశనగ వేర్లు, అభివృద్ధి చెందుతున్న ఊడలు/కాయలు నీట మునిగితే త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి భారీ వర్షాలు కురిస్తే మురుగు నీరు పోయేందుకు కాలువలు తీసి, పొలంలో నీరు నిలవకుండా అదనపు నీటిని వెంటనే బయటకు పంపాలి. పొలం సమతలం: వీలైతే పొలాన్ని చదునుగా ఉంచడం, వాలుకు అనుగుణంగా కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా పొలంలో నీరు నిలవడాన్ని నివారించవచ్చు. జిప్సం / కాల్షియం ఆవశ్యకత వేరుశనగ కాయ ఏర్పడడం గింజ నిండుదలకు కాల్షియం చాలా కీలకమైన పోషకం. కాల్షియం లోపిస్తే కాయలు ఖాళీగా ఉండటం లేదా సరిగా నిండకపోవడం (పాప్స్) జరుగుతుంది. పూత దశ లేదా ఊడల దశలో ఎకరాకు 200 కిలోల జిప్సం మొక్క మొదళ్ల దగ్గర వేసి, తేలికపాటి తడితో నేలలో కలిసేలా చూడాలి. జిప్సం వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి, తద్వారా కాల్షియం వేర్ల ద్వారా, అలాగే నేరుగా అభివృద్ధి చెందుతున్న కాయల ద్వారా బాగా గ్రహించబడుతుంది. కాయ అభివృద్ధి, పరిపక్వ దశల్లో పర్యవేక్షణ జూన్ మొదటి పక్షంలో విత్తిన, స్వల్పకాలిక (90-95 రోజుల) రకాలు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పంట పరిపక్వత దశకు చేరతాయి. ఈ దశలో సరైన పర్యవేక్షణ, కోత సమయం, దిగుబడి, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. 15 రోజులకు ఒకసారి కొన్ని మొక్కలను పెకిలించి కాయలను పరిశీలించాలి. కాయ లోపలి పెంకు గోధుమ రంగులోకి మారడం, గింజల మీద సిరలు (వెనేషన్) స్పష్టంగా కనిపించడం పరిపక్వ దశకు సూచికలు. పైరు ఆకులు పసుపు రంగులోకి మారి రాలడం మొదలైనప్పుడు, అలాగే కాయలలో 70-80% పరిపక్వత చెందితే కోతకు సిద్ధం చేసుకోవాలి. పరిపక్వత చెందిన తర్వాత పంటను ఆలస్యంగా కోస్తే కాయలు నేలలోనే మొలకెత్తడం లేదా నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది, కాబట్టి సకాలంలో కోత చేపట్టాలి. కోత తర్వాత కాయలను బాగా ఎండబెట్టి (గింజలలో తేమ 8-9% ఉండేలా), సరైన నిల్వ పద్ధతులు పాటించాలి. సెప్టెంబర్లో ప్రత్యేకంగా చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు పూత, ఊడల దశలో మట్టి ఎగదోత, తేలికపాటి అంతరకృషి చేయాలి. వర్షాభావం ఏర్పడితే రక్షిత తడులు. మల్చింగ్ ద్వారా తేమను సంరక్షించాలి. ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ల కోసం వారానికి రెండుసార్లు పొలం పరిశీలన చేయాలి. రసం పీల్చే పురుగులు, ఆకులని తినే పురుగులను ముందుగానే గుర్తించి, జీవ/రసాయనాలతో సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. పూత, ఊడల దశలో ఎకరాకు 200 కిలోల జిప్సం వేయాలి. కాయ పరిపక్వతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సకాలంలో కోతకు సిద్ధపడాలి. సులభంగా, దశల వారీగా రైతులు చేపట్టవలసిన యాజమాన్య చర్యల క్యాలెండర్ వయస్సు దశ విత్తిన నాటి నుండి చేపట్టవలసిన చర్యలు మొలక/విత్తన దశ 0–20 రోజులు – కలుపు నివారణ పూర్ణ దశ 25–35 రోజులు – తేమ సంరక్షణ, పోషకాలు, చల్లడం అందించడం ఉదగిన దశ 35–50 రోజులు – అంతరకృషి కాయ ఏర్పడు దశ 45–70 రోజులు – నీటి నిర్దారణ, తెగుళ్ల పరిశీలన కాయ నిండే దశ 70–90 రోజులు – నీటి నిర్దారణ, కలుపు తొలగింపు పరిపక్వ దశ 90–120 రోజులు – కోతకు సంసిద్ధమవడం నేల, విత్తే కాలం, రకం, వాతావరణం బట్టి విత్తిన నాటి నుండి రోజులు కొంత మేర మారవచ్చు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక డా. టి. భాగవత ప్రియ, శాస్త్రవేత్త (సేద్య విభాగం), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి.