నిమ్మ పూత నియంత్రణతోనే అధిక దిగుబడులు ఆంద్రప్రదేశ్లో చీని, నిమ్మ తోటలు 1.12 లక్షల హెక్టార్లలో సాగవుతూ 22.58 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చీని, నిమ్మ తోటలు అనంతపురం, వై.ఎస్.ఆర్. కడప, శ్రీ సత్యసాయి, యస్.పి.యస్.ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా సాగు అవుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మార్పుల వల్ల సంవత్సరం పొడవునా చెట్ల పై పూత, పిందె, కాయలు కనిపిస్తాయి. దీనివల్ల రైతులకు సరైన రాబడి రావడం లేదు. మనకు సాధారణంగా వేసవి లో వచ్చే కాయ దిగుబడికి మార్కెట్ లో మంచి ధర ఉంటుంది. కాబట్టి రైతులు వేసవిలో అధిక దిగుబడులు పొందడానికి కొద్దిపాటి యాజమాన్యం అనగా పూత నియంత్రణ చర్యలు చేపట్టాలి. నిమ్మ జాతి చెట్లలో పూత దశకు రావటానికి కొమ్మలో పిండి పదార్థాలు అధికంగా, నత్రజని మోతాదు తక్కువగా ఉండాలి. నిమ్మకు వేసవిలో అధిక మార్కెట్ ఉండడం వల్ల కాయ దిగుబడులు ఎక్కువగా రావడానికి, అక్టోబరు మాసం మొదట్లో చెట్లకు నీరు ఇవ్వడం 10-15 రోజుల పాటు ఆపి బెట్టకు గురి చెయ్యాలి. తరువాత ఒకేసారి చెట్లకు నీరు, పోషకాలను అందించినట్టైతే కొమ్మలపై నవంబరులో కొత్త ఇగురు, పూత ఏర్పడి వేసవి కాలానికి మంచి దిగుబడులు వస్తాయి. ఈ విధంగా చెట్లను బెట్టకు గురి చేసే విధానాన్ని 'బహార్ పద్ధతి' అంటారు. కానీ మన రాష్ట్రంలో నిమ్మ సాగు చేసే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబరు– నవంబరు మాసాల్లో వర్షాలు ఎక్కువగా వస్తాయి. కనుక, చెట్లను సహజంగా బెట్టకు గురి చేయడం సాధ్యం కాదు కాబట్టి రైతులు తిరుపతి చీని, నిమ్మ పరిశోధన స్థానం సూచించిన అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులను పాటించినట్లయితే వేసవిలో అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలు పొందవచ్చు. పూత నియంత్రణ యాజమాన్య పద్ధతులు జూన్ లో 50 పి.పి.ఎం జిబ్బరిల్లిక్ ఆమ్లాన్ని, సెప్టెంబరులో 1000 పి.పి.ఎం సైకోసెల్ ద్రావణాన్ని, ఆ తరువాత అక్టోబరులో చివరగా 1% పొటాషియం నైట్రేట్ (13.0.45) ద్రావణాన్ని (10 గ్రా లీటరు నీటికి) పిచికారీ చేయాలి. నవంబరు మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేప పిండి, 500గ్రా. యూరియా, 1 కిలో సూపర్ పాస్ఫేట్, 400 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్ల పాదుల్లో వేసుకొని నీటిని అందించాలి. ఎరువులు వేసిన 10-15 రోజులకు చెట్లు ఇగురించి, పూత మొదలవుతుంది. ఇగుర్లు వచ్చిన 10-15 రోజులకు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని (జింకు సల్ఫేట్ 5 గ్రా. మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా. మెగ్నీషీయం సల్ఫేట్ 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రా. కాపర్ సల్ఫేట్ 3 గ్రా. బొరాక్స్ 1 గ్రా. సున్నం 6గ్రా. యూరియా 10 గ్రా. చొప్పున లీటరు నీటికి ) లేదా అర్కా సిట్రస్ స్పెషల్ - 5 మి.లీ. ఒక లీటరు నీటికి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు ఏదైనా పురుగు మందుతో ( ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందె బఠాణి సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వలన పిందె రాలుటను గమనించినట్లయితే 2,4- డి (1 గ్రా. ను 100 లీ నీటికి) లేదా ప్లానోఫిక్స్ (2.5 మి.లీ. ను 10లీ. నీటికి చొప్పున) ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. కాయ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి జనవరిలో (కాయ పెరిగే దశలో) 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేప పిండి, 300 గ్రా. యూరియా, 350 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్టు ఒక్కింటికి వేసుకొని నీటిని అందించాలి. ఫిబ్రవరిలో 2.5 సెం.మీ. మందంతో వేరుశనగ పొట్టు, వరి ఊక, వరి గడ్డి లాంటి వ్యవసాయ వ్యర్థాలతో పాదులను కప్పాలి. దీని వల్ల వేసవిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరిగి సేంద్రియ పదార్థం అందుబాటులో ఉంటుంది. కాయ గోళికాయ సైజులో ఉన్నప్పుడు మంగు ఆశించ కుండా నీటిలో కరిగే గంధకం (3 గ్రా./లీ.) లేదా ప్రొపర్ట్ (2 మి.లీ./లీ.) ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పైన సూచించిన యాజమాన్య పద్దతులను పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్య గమనిక 50 పి.పి.ఎం ద్రావణం తయారీ : మార్కెట్ లో లభించే జిబ్బరిల్లిక్ ఆమ్లం 2.5 గ్రా. (40% WSG )ప్యాకెట్ ను 20 లీటర్ల నీటికి కలిపితే 50 పి.పి.ఎం. ద్రావణం తయారవుతుంది. 1000 పి.పి.ఎం. సైకొసెల్ ద్రావణం తయారీ : మార్కెట్ లో లభించే లిహెూసిన్ (50% SL) క్లోరోమిక్వాట్ క్లోరైడ్ (2మి.లీ 1 లీ. నీటికి కలిపితే 1000 పి.పి.ఎం.ద్రావణం తయారవుతుంది. 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం తయారీ మార్కెట్లో లబించే మల్టీ - కే (13.0.45) అనగా పొటాషియం నైట్రేట్-10 గ్రా. 1 లీటరు నీటికి కలిపితే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం తయారవుతుంది. పూత నియంత్రణ ఉంటే లభించే ప్రయోజనాలు పుష్పించే కాలాన్ని నియంత్రించడం వల్ల చెట్టు శక్తి వృథా కాకుండా కాయల అభివృద్ధికి వాడబడుతుంది. మార్కెట్ ధరల ప్రకారం అధిక లాభం పొందవచ్చు. చెట్టు శక్తిని కోల్పోకుండా ఎక్కువ కాలం పాటు దిగుబడి ఇవ్వగలదు. కాయల నాణ్యత మెరుగవుతుంది. ఒకే సమయంలో ఎక్కువ పండ్లు రావడం వల్ల శ్రమ, ఖర్చులు తగ్గుతాయి. చెట్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండడం వల్ల దీర్ఘకాలంగా పండ్లు ఇవ్వగలవు. నిమ్మ పంటలో పూతను నియంత్రించగలిగితే, దిగుబడిని మాత్రమే కాదు, ఆర్థిక లాభాలను కూడా నియంత్రించగలుగుతాం. ఇది సరైన విధానంతో సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయ మార్గం అవుతుంది. ఆధారం : పాడి పంటలు , డా.కె.సి.భాను మూర్తి, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), చీని, నిమ్మ పరిశోధన స్థానం, డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయం, తిరుపతి.