ఆముదం సాగులో కీలక మెళకువలు భారతదేశంలో వాణిజ్యపరంగా సాగవుతున్న అత్యంత ముఖ్యమైన నూనెగింజల పంటలలో ఆముదం అగ్రగామిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆముదం ఉత్పత్తి, ఉత్పాదకత రెండింటిలోనూ భారతదేశం మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆముదం గింజల్లో 40 నుండి 50 శాతం వరకు నూనె ఉండటం వల్ల దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. పారిశ్రామికంగా, ఔషధపరంగా, రసాయన రంగంలో ఆముద నూనెకు ఉన్న ప్రాధాన్యత కారణంగా, ప్రపంచవ్యాప్త ఆముద నూనె అవసరాల్లో సుమారు 90 శాతం వరకు మన దేశం నుంచే సరఫరా అవుతుండటం భారతదేశం ప్రత్యేకత. మన దేశంలో సుమారు 10.89 లక్షల హెక్టార్లలో పంట సాగు చేస్తూ, 21.57 లక్షల టన్నుల ఉత్పత్తిని, హెక్టారుకు 1981 కిలోల ఉత్పాదకతను సాధిస్తున్నాం. ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో నీటి వసతి కింద, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో వర్షాధారంగా ఆముదం సాగు చేస్తున్నారు. వర్షాధారంగా సాగవుతున్న ఆముదం పంటలో బూజు తెగులు, దాసరి పురుగు, లద్దె పురుగులు ఆశించి పంటకు చాలా వరకు నష్టం చేస్తున్నాయి. అందువలన రైతులు ఆముదం పంట పండించడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనికారణంగా పంట సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. వీటికి తోడు, సాంప్రదాయ ఆముదం సాగులో సుదీర్ఘ కాలపరిమితి, బహువార్షిక స్వభావం, మొక్కలు నిరంతరం పెరుగుతూ విడతల వారీగా కాపుకు రావడం వంటివి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. దీనివల్ల ఒకేసారి పంట కోత సాధ్యం కాక, విడతల వారీగా చేతులతో కోయాల్సి వస్తోంది. ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉండటం, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ సాంప్రదాయ పద్ధతి రైతులకు ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ చర్యలు సరికొత్త వృద్ధి నియంత్రణ సాంకేతికతలు, యాంత్రిక కోతకు అనుకూలమైన మార్పులను అవలంబించడం ద్వారా ఆముదం సాగును అత్యంత లాభసాటిగా మార్చుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులకు ఆముదం ఒక చక్కని ప్రత్యామ్నాయ పంటగా చెప్పవచ్చు. ఇతర పంటలతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా ఉండటం వల్ల వర్షాభావ ప్రాంతాల్లో కూడా తక్కువ వర్షపాతాన్ని తట్టుకుని పెరిగే సామర్థ్యం కలిగి, రైతులకు స్థిరమైన దిగుబడిని అందించగలదు. అందువల్ల, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదం సాగు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చు. రైతులను మళ్ళీ ఆముదం వైపు మళ్ళించడానికి ఇది తోడ్పడుతుంది. ప్రథమ శ్రేణి ప్రదర్శనల ద్వారా ఆముదం సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా హెక్టారుకు 1256 కిలోల దిగుబడి సాధించవచ్చని నిరూపించారు. అనువైన వాతావరణం, నేలల ఎంపిక, నేలతయారీ: ఆముదం పంటకు 20–27 డిగ్రీల ఉష్ణోగ్రతలు, తక్కువ తేమ గల వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండకుండా, త్వరగా ఇంకిపోయే నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. మెరుగైన నేల తయారీ వేసవి దుక్కులు: వేసవి కాలంలో రెండు లేదా మూడు సార్లు లోతుగా దుక్కి దున్నడం వల్ల నేల పలుచబడుతుంది, లోపల ఉన్న కలుపు మొక్కల విత్తనాలు నశిస్తాయి, హానికర పురుగుల గుడ్లు సూర్యరశ్మికి నశిస్తాయి. తేమ సంరక్షణ: తొలకరి వర్షాలు వచ్చిన వెంటనే నేలను చదును చేసుకోవాలి. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా మెరుగైన నేల తయారీ చేయడం వల్ల విత్తినప్పుడు మొలక శాతం గణనీయంగా పెరుగుతుంది. అధిక దిగుబడులకు అనుకూలమైన రకాలు విత్తన శుద్ధి : పంట విజయవంతం కావడానికి సరైన సంకర రకాన్ని ఎంపిక చేసుకోవడం మొదటి ప్రాథమిక అడుగు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో సాగుకు ఈ కింది రకాలు ఎంతో అనుకూలమైనవి: ఐ.సి. హెచ్-5 : మొదటి గెల కోత సమయం: వర్షాధారం: 97-108 రోజులు; నీటి పారుదల: 108– 126 రోజులు. ఎండు తెగులు, పచ్చ దోమను తట్టుకుంటుంది. నూనె శాతం 47-49 %. దిగుబడి వర్షాధారం: 1600-1700 కిలోలు హెక్టారుకు, నీటిపారుదల: 2900-3500 కిలోలు హెక్టారుకు. ఐ.సి.హెచ్-6 : మొదటి గెల కోత సమయం: వర్షాధారం: 90-96 రోజులు; నీటి పారుదల: 107-121 రోజులు. ఎండు తెగులు, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. నూనెశాతం వర్షాధారం: 46– 48%, నీటి పారుదల: 47-48%. దిగుబడి వర్షాధారం: 950-1250 కిలోలు హెక్టారుకు, నీటిపారుదల: 1900 (150 రోజుల్లో) కిలోలు హెక్టారుకు. ఐ.సి. హెచ్-66 : మొదటి గెల కోత సమయం: వర్షాధారం: 94-97 రోజులు; నీటి పారుదల: 110– 124 రోజులు. ఎండు తెగులు, వేరు కుళ్ళు, పచ్చ దోమను తట్టుకుంటుంది. నూనెశాతం 46-49%. దిగుబడి వర్షాధారం: 1550-1600 కిలోలు హెక్టారుకు, నీటిపారుదల: 3300-3400 కిలోలు హెక్టారుకు. విత్తన శుద్ధి ప్రాధాన్యత: మొలక దశలో వచ్చే రకరకాల వ్యాధులను నివారించడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. రసాయన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్, లేదా 2 గ్రాముల కార్బెండాజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. జీవ నియంత్రణ నేల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రణ శిలీంధ్ర నాశకాలను ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుంది. భౌతిక రసాయన క్రాస్ లింకింగ్, ద్రావణ కాస్టింగ్ పద్ధతుల్లో పాలీమరీకరణ ద్వారా తయారు చేసిన బయోఫిల్మ్ లను విత్తనాలపై పైపూతగా వినియోగించవచ్చు. ఇవి అధిక తన్యత బలంతోపాటు పంట విత్తనాలను 94% అధికంగా పట్టివుంచే సామర్థ్యాన్ని కలిగి వుంటాయి. విత్తే సమయం : ఆముదం పంటను సకాలంలో విత్తడం వల్ల పురుగులు, తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ఖరీఫ్ కాలం: జూన్ నుండి జూలై చివరి వారం లోపు విత్తుకోవడం ఉత్తమం. ఆలస్యంగా విత్తితే పురుగులు, తెగుళ్ల ప్రభావం పెరిగి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. విత్తన మోతాదు, విత్తే దూరం : ఎకరానికి, సంకర రకాలు (హైబ్రిడ్లకు) 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. వర్షాధార పరిస్థితుల్లో మొక్కల మధ్య 90 x 60 సెం.మీ. లేదా 90 × 90 సెం. మీ. దూరం పాటించాలి. నీటి వసతి ఉన్నప్పుడు – 120 × 60 సెం. మీ. దూరం ఉంచడం వల్ల మొక్కలకు తగిన గాలి, వెలుతురు లభించి గెలలు బాగా అభివృద్ధి చెందుతాయి. అధిక సాంద్రత సాగు పద్ధతి : వరుసల మధ్య, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి 60 × 45 సెంటీమీటర్లు లేదా 90 x 30 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. యాంత్రిక కోతకు అనుకూలంగా మొక్కల సాంద్రతను రెట్టింపు చేయడం మేలైన వ్యూహం. సమతుల్య ఎరువుల వినియోగం ఆముదం పంటలో ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించాలంటే మట్టి పరీక్షల ఆధారంగా సమతుల్య పోషకాలు అందించడం చాలా అవసరం. సేంద్రియ ఎరువులు: విత్తడానికి 2-3 వారాల ముందు ఎకరాకు 2 నుండి 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలుపుకోవాలి. రసాయన ఎరువులు: వర్షాధార పంటకు ఎకరానికి 16–24 కిలోల నత్రజని, 6-24 కిలోల భాస్వరం,, 6-12 కిలోల పొటాష్ అందించాలి. నీటి వసతి ఉన్న పంటకు 32–48 కిలోల నత్రజని, 12–24 కిలోల భాస్వరం, 12 కిలోలు పొటాష్ ఎరువుల మోతాదును మరింత పెంచాల్సి ఉంటుంది.అధిక నూనె దిగుబడి కొరకు ఎకరాకు 8 కిలోల గంధకము వాడాలి. అలాగే సూక్ష్మపోషకాలైన జింక్, ఇనుము లోపం ఉంటే 4 కిలోల జింక్ సల్ఫేట్, 12 కిలోల ఫెర్రస్ సల్ఫేట్ వాడాలి. వర్షాధార పంటకు విత్తిన 50, 90 రోజులకు జింకు సల్ఫేటు పిచికారీ చేస్తే అధిక దిగుబడి, మంచి లాభాలు పొందవచ్చు. నీటి యాజమాన్యం : ఆముదం ప్రధానంగా వర్షాధార పంట అయినప్పటికీ, పంట కాలంలో కొన్ని కీలక దశల్లో నీరు అందిస్తే దిగుబడి అద్భుతంగా పెరుగుతుంది. ముఖ్యంగా పొడి వాతావరణంలో మొదటి గెల దశ లేక రెండో గెల మొదటిలో ఒకసారి నీరు అందిస్తే అధిక దిగుబడి వస్తుంది. అవసరాన్ని బట్టి 10–15 రోజుల వ్యవధిలో నీరు పెట్టడం మంచిది. కలుపు నివారణ, అంతరకృషి: ఆముదం పంట వేసిన మొదటి 20 రోజుల వ్యవధిలో చేతితో కలుపు తీసి, 40 రోజులలోపు 2-3 సార్లు గుంటక తోలాలి. విత్తిన 20 రోజుల వ్యవధిలో కలుపు తీసి, రెండు లేదా మూడు సార్లు గుంటక తోలి అంతరకృషి చేయడం ద్వారా వేర్లకు గాలి ఆడి మొక్కలు బలంగా పెరుగుతాయి. రసాయన కలుపు నివారణ: కూలీలు దొరకని చోట్ల అలాక్లోర్ 1 లీ./ఎ. గాని, ప్లూకోరాలిన్ లేక ట్రైప్లురలిన్ 0.8 లీ/ఎ. విత్తనం విత్తిన మరుసటి రోజు నేల తడిచే విధంగా పిచికారీ చేసి కలుపు నివారించవచ్చును. విత్తిన 15-20 రోజులకు కలుపు మొక్కలు 3-4 ఆకుదశలో క్విజలోఫాప్ ఇథైల్ ఎకరాకు 400 మి.లీ. చొప్పున పిచికారీ చేసి గడ్డిజాతి కలుపును నివారించవచ్చు. తరువాత వచ్చే కలుపును డిజిల్ యంత్రాలు లేదా ట్రాక్టర్లతో నడిచే గుంటకల ద్వారా వాడి నిర్మూలించవచ్చు. అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం ఆముదం వరుసల మధ్య ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి, దీనిలో అంతర పంటలు సాగు చేయడం రైతులకు ఎంతో లాభసాటి. ఆముదము + కంది (1:1); ఆముదము + బొబ్బర్లు (1:2) : ఆముదము + మినుము (1:2); ఆముదము + పెసర (1:2); ఆముదము + గోకర (1:2); ఆముదము + వేరుశనగ (1:5): ఆముదము + పసుపు / అల్లం (1:5); ఆముదము + మిరప (1:8): పప్పుధాన్యాల వేర్లలోని గింజలు నత్రజనిని స్థిరీకరిస్తాయి, దీనివల్ల ప్రధాన పంటకు పోషకాలు లభించడమే కాకుండా తెగుళ్ల ప్రభావం కూడా తగ్గుతుంది. సమగ్ర పురుగు, తెగుళ్ల యాజమాన్యం: ఆముదం పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి. పురుగుల యాజమాన్యం: పంటను ప్రధానంగా దాసరి పురుగు, లద్దె పురుగు, కాయ తొలిచే పురుగు, తెల్లదోమ, పచ్చదోమ వంటి కీటకాలు ఆశించి నష్టం కలిగిస్తాయి. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా పురుగులను నియంత్రించవచ్చు. చేతితో ఏరివేత : పొగాకు లద్దె పురుగు, గొంగళి పురుగుల గుడ్ల సముదాయాలను, గుంపులుగా ఉన్న చిన్న పురుగులను ఆకులతో సహా ఏరివేసి నాశనం చేయాలి. లద్దె పురుగు లార్వా ఆరంభ దశలో: హెక్టారుకు 250 ఎల్.ఇ. చొప్పున ఎస్.ఎల్.ఎన్.పి.వి ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఆకులు తినే పురుగులు (నష్టం 25% పైగా ఉంటే): లీటరు నీటికి బాసిల్లస్ తురింజెన్సిస్ (బి.టి.కె) 1 గ్రాము లేదా 3 మిల్లీలీటర్లు, లేదా ప్లూబెండియమైడ్ 39.35 ఎస్.సి. 0.2 మిల్లీలీటర్లు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్.సి. 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ గమనింపు: మొక్కకు 1-2 దాసరి పురుగు పరాన్నజీవి గూళ్లు కనిపిస్తే పురుగుమందుల పిచికారీని ఆపాలి. కాయ తొలిచే పురుగు (నష్టం 10% చేరినప్పుడు) : లీటరు నీటికి స్పెయినోసాడ్ 45 ఎస్.సి. 0.4 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి. 0.4 గ్రాములు లేదా ప్లూబెండియమైడ్ 39.35 ఎస్.సి. 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్.సి. 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు : 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప ఆధారిత మందులను పిచికారీ చేయాలి. 10 శాతం ఆకులు ముడత లక్షణాలు చూపిస్తే, లీటరు నీటికి అసిటామిప్రిడ్ 20 ఎస్.పి. 0.2 గ్రాములు లేదా క్లోథియానిడిన్ 50 డబ్ల్యూ. డి. జి. 0.1 గ్రాము లేదా డయాఫెంతియురాన్ 50 డబ్ల్యూ.పి. 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల యాజమాన్యం ఆముదంలో బూజు తెగులు, ఎండు తెగులు, మొలక కుళ్లు వ్యాధులు సాధారణంగా వస్తుంటాయి. విత్తన శుద్ధి: ట్రైకోడెర్మా 10 గ్రా./కిలో విత్తనానికి లేదా కార్బండజిమ్ 2 గ్రా./కిలోతో విత్తన శుద్ధి చేయాలి. నేలలో 2.5 కిలోల ట్రైకోడెర్మా ఏస్పరెల్లమ్ లేదా హర్జియానమ్ ను 125 కే.జి.ల పశువుల ఎరువుతో కలిపి వేయాలి. పంట మార్పిడి: తెగుళ్ళ నివారణకు తృణ ధాన్యాలతో పంట మార్పిడి చేయాలి. ఎండు తెగులు: ఈ వ్యాధిని తట్టుకునే ఐసిహెచ్–66, ఐసిహెచ్-5 సంకరాలను సాగు చేయాలి. బూజు తెగులు: వాతావరణ హెచ్చరికలను అనుసరించి ముందు జాగ్రత్తగా కార్బండజిమ్ 50 డబ్ల్యుపి 1 గ్రా./లీ. లేదా ప్రొపికోనజోల్ 25 ఇసి 1 మి.లీ./లీ. * కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గగానే రెండవ సారి పిచికారీ చేయాలి. తీవ్రంగా తెగుళ్ళు సోకిన కాయలు తీసివేసి 1 హెక్టారుకి 20 కె.జి.ల యూరియాను వేస్తే కొత్త విలకలు, మొదలవుతాయి. కాయలు మొలక కుళ్ళు తెగులు: కాపర్ ఆక్సి క్లోరైడ్ 50 డబ్ల్యుపి 3 గ్రా./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. అధిక సాంద్రత సాగు పద్ధతి సాంప్రదాయ ఆముదం సాగులో అతి పెద్ద సమస్య ఒకేసారి కోతకు రాకపోవడం. మొక్కలపై ప్రాథమిక గెల మొదట పక్వానికి వస్తుంది, ఆ తర్వాత ద్వితీయ, తృతీయ కొమ్మలపై గెలలు వేర్వేరు సమయాల్లో పూత, కాపుకు వస్తాయి. ఈ సమకాలీన పక్వత లేకపోవడం, మొక్కలు విపరీతంగా గుబురుగా పెరగడం వల్ల కంబైన్ హార్వెస్టర్ల వంటి యంత్రాల ద్వారా ఒకేసారి కోత కోయడం సాధ్యపడదు.ప్రస్తుతం జన్యుపరంగా ఒకేసారి పక్వానికి వచ్చే రకాలు అందుబాటులో లేనందున, వృద్ధి నియంత్రణ రసాయనాలు, ఆధునిక సస్యరక్షణ చర్యల ద్వారా పంటను యాంత్రిక కోతకు అనుకూలంగా మలచడమే ఏకైక మార్గం. ప్యాక్లోబ్యూట్రజోల్ తో వృద్ధి నియంత్రణ ఆముదం మొక్కల విపరీతమైన ఎదుగుదలను అరికట్టి, కొమ్మలు, గెలలు ఒకే సమయంలో పక్వానికి వచ్చేలా చేయడానికి ఈ రసాయనం అద్భుతంగా పనిచేస్తుంది. మోతాదు: ఎకరానికి 16 గ్రాముల క్రియాశీల పదార్థం చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సమయం: పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేయాలి. మొదటిసారి ప్రాథమిక కొమ్మలపై 6 నుండి 8 ఆకులు దశలోను, రెండోసారి ద్వితీయ కొమ్మలపై 3 ఆకులు దశలోను పిచికారీ చేయాలి.ప్రయోజనం: దీనివల్ల మొక్కల ఎత్తు, గెల పొడవు నియంత్రించబడి అన్నీ ఒకే ఎత్తులో సమానంగా పెరుగుతాయి. అయితే, కాయల సంఖ్యలో కానీ, గింజల దిగుబడిలో కానీ ఎటువంటి తగ్గుదల ఉండదు. మొక్కలు పొట్టిగా, సమానంగా ఉండటం వల్ల యంత్రాలతో కోత సులువవుతుంది. పారాక్వాట్ డైక్లోరైడ్తో పంటను ఎండబెట్టడం యంత్రాల ద్వారా కోసేటప్పుడు మొక్కలలో పచ్చిదనం లేదా ఆకులు ఎక్కువగా ఉంటే గింజలు సరిగ్గా వేరుచేయవు, హార్వెస్టర్ యంత్రాలు మొరాయిస్తాయి. అందువల్ల కోతకు ముందు పంటను పూర్తిగా ఎండబెట్టడం అవసరం. విధానం: పంట పక్వానికి వచ్చిన దశలో 'పారాక్వాట్ డైక్లోరైడ్' అనే కలుపు మందును 1 మిల్లీలీటర్ లీటరు నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి.ఫలితం: ఈ రసాయనం పడగానే ఆకులు, కాండం, పచ్చిగా ఉన్న భాగాలు పూర్తిగా ఎండిపోతాయి. దీనివల్ల కంబైన్ హార్వెస్టర్ల ద్వారా గింజలను ఎటువంటి నష్టం లేకుండా, వేగంగా సేకరించవచ్చు. యాంత్రిక కోత పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులకు చేకూరే బహుముఖ ప్రయోజనాలు పంట కాలపరిమితి తగ్గింపు: సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ ఆధునిక పద్ధతుల ద్వారా ఆముదం పంట కాలపరిమితిని సుమారు 2 నుండి 3 నెలల వరకు తగ్గించవచ్చు. రెండవ పంటకు అవకాశం: పంట కాలం తగ్గడం వల్ల ఆముదం కోతలు త్వరగా ముగిసి, అదే పొలంలో రైతులు తక్కువ కాలపరిమితి కలిగిన ఇతర లాభసాటి రెండో పంటను (ఉదాహరణకు వేరుశనగ, శనగలు లేదా పప్పుధాన్యాలు) వేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల రైతు నికర ఆదాయం రెట్టింపవుతుంది. సాగు ఖర్చుల తగ్గింపు: విడతల వారీగా చేతులతో కూలీల ద్వారా కాయలు కోయించే అవసరం తప్పుతుంది. కంబైన్ హార్వెస్టర్ ద్వారా కొన్ని గంటల్లోనే ఎకరాల కొద్దీ కోత పూర్తి కావడం వల్ల కూలీల ఖర్చు భారీగా తగ్గుతుంది. సకాలంలో మార్కెటింగ్: పంట అంతా ఒకేసారి చేతికి రావడం వల్ల నాణ్యమైన గింజలను ఒకే విడతలో మార్కెట్కు తరలించి మంచి ధరను పొందవచ్చు. కోత అనంతరం గింజలను బాగా ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. పంట కోత సాంప్రదాయ పద్ధతిలో ఆముదం పంట 100-120 రోజులకు మొదటి కోతకు వస్తుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా మూడు కోతలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆరు కోతల వరకు కూలీల ద్వారా కోస్తారు.ఆముదం పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన రకం ఎంపిక నుండి పంట కోత వరకు ప్రతి దశలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో అవసరం. మారుతున్న కాల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన కూలీల కొరతను అధిగమించడానికి ఆముదం సాగులో యాంత్రీకరణ అత్యంత అనివార్యంగా మారింది. రైతులు ఎరువుల సమతుల్య వినియోగం, సకాలంలో నీటి యాజమాన్యం, సమగ్ర పురుగు-తెగుళ్ల నియంత్రణ, అంతర పంటల సాగు వంటి సాంకేతికతలతో పాటు ఈ ఆధునిక యాంత్రిక పద్ధతులను విస్తృతంగా అవలంబిస్తే, తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఆముదం సాగును అత్యంత లాభదాయకమైన, స్థిరమైన వ్యాపారంగా మార్చుకోవచ్చు. అయితే, రసాయనాల వాడకంలో నాణ్యతను, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులను ఖచ్చితంగా పాటించడం, సరైన సమయంలో వాడడం ద్వారా మాత్రమే ఆశించిన ఫలితాలను సాధించగలరని గమనించాలి. తెలంగాణలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలలో నమోదైన దిగుబడి వివరాలు వివరాలు నూతన సాంకేతిక పరిధిలో రైతుల పద్ధతి దిగుబడి(హెక్టారుకు కిలోలు) 1256 970 దిగుబడిలోపెరుగుదల (%) 29.4% - సాగు ఖర్చు(హెక్టారుకు రూ.ల్లో) 28218 27037 ఆదాయము(హెక్టారుకు రూ.ల్లో) 68532 52500 నికర ఆదాయం(హెక్టారుకు రూ.ల్లో) 40314 25463 ప్రత్యాయనం-వ్యయ నిష్పత్తి 2.43 1.94 ఆధారం: వ్యవసాయ పాడి పంటలు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి- భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్.