తెలంగాణ రాష్ట్రంలోని వర్షాధారంగా పండించే పంటలలో వరి, పత్తి తరువాత మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా (ఖరీఫ్ సీజన్లో ) 5. 4 లక్షల ఎకరాలలో సాగు చేశారు. ఎరువుల యాజమాన్యం మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన, సేంద్రియ ఎరువుల రూపంలో మనం అందించే పోషకాలకు మొక్కజొన్న త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంటలో సాధ్యమైన ఎక్కువ దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. సాధారణంగా రైతులకు వారి పొలాల్లో భూసార పరీక్షను నిర్వహించి, వాటికి అనుగుణంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటించాల్సిందిగా చేప్తాము. ఒక వేళ భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే ఒక ఎకరాకు 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును ఆఖరి దుక్కిలో వేసి దున్నాలి. ప్రతి 2-3 పంటలకొకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలో జింకు సల్ఫేట్‌ను వేయాలి. నత్రజనిని దఫదఫాలుగా వేసుకోవాలి. మొత్తం నత్రజనిని మూడు సమాన భాగాలుగా చేసి ఒక భాగాన్ని దుక్కిలో, రెండవ భాగాన్ని పైరు మోకాలు ఎత్తు దశలో, మిగిలిన మూడవ భాగాన్ని పూత దశలో వేయాలి. నత్రజని ఎరువును పై విధంగా వేసినట్లయితే వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. భాస్వరం ఎరువు పైరు వేర్లు, మొక్కలు మేలు చేసే సూక్ష్మజీవుల అభివృద్ధికి తోడ్పడుతుంది. మొక్కజొన్న పంటలో భాస్వరం ఎరువును విత్తిన 3–6 వారాలకు ఎక్కువగా గ్రహించి పంట కాలం మొత్తం ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తం భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేయాలి. దఫదఫాలుగా వేయరాదు. పొటాష్ ఇచ్చే ఎరువు మొత్తాన్ని బరువు నేలలో అయితే ఆఖరి దుక్కిలో అదే తేలిక నేలల్లో అయితే సగం పొటాష్ ఎరువును విత్తే సమయంలో మిగతా సగం పొటాష్‌ను పీచు దశలో వేసుకోవాలి.వర్షాధార మొక్కజొన్నకు నేల స్వభావాన్ని బట్టి ఎకరాకు 72-80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవాలి. వర్షాధార మొక్కజొన్నలో ఎరువులను మూడు దఫాలుగా వేయాలి. రైతు సోదరులు సాధారణంగా యూరియా, డి.ఎ.పి., ఎం.ఒ.పి., ఎస్.ఎస్.పి., 20:20:20 రూపంలో పోషకాలను అందిస్తుంటారు. వర్షాధార మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్య పట్టిక ఆఖరి దుక్కిలో విత్తనం విత్తే సమయంలో (కిలోలు/ఎకరాకు) విత్తనం విత్తిన 30-35 రోజులకు (కిలోలు/ఎకరాకు) విత్తనం విత్తిన 50-55 రోజులకు (కిలోలు/ఎకరాకు) యూరియా 55 55 55 డి.ఎ.పి. 52 - - ఎం.ఓ.పి. 17 - 17 యూరియా 58 58 58 ఎస్.ఎస్.పి. 150 - - ఎం.ఓ.పి. 17 - 17 యూరియా 50 50 50 20:20:20 120 - - ఎం.ఓ.పి. 17 - 17 ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.టి. అరుణ్ బాబు, డా.పి.మధుకర్‌రావు, డా.కె.బి. సునీతాదేవి. వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల, పి.జె.టి.ఎ.యు