వరి నారుమడులు పోసి నాట్లు వేయు రైతులు పాటించవలసిన మెలకువలు ప్రధాన పొలాన్ని 3-4 సార్లు దమ్ము చేసి బాగా చదును చేసుకోవాలి. ఆయా మండలాలకు సిఫారసు చేసిన భాస్వరం ఎరువును ఆఖరి దమ్ములో వేసుకోవాలి. దీర్ఘ కాలిక, మధ్య కాలిక రకాలకు 25-30 రోజుల వయసున్న నారును ఊడ్చుకోవాలి. కుదురుకు 2 3 మొక్కలను పై పై న ఊడ్చాలి. ప్రతి 2 మీటర్లు కు కాలిబాటలు (20 సెంటిమీటర్లు ) విధిగా ఉండేటట్లు చూసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని మూడు సమ భాగాలుగా మొదటి సారి నాటటానికి ముందు, రెండవ సారి పిలకల దశలో, ఆఖరుగా అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. పొటాష్ లో సగ భాగాన్ని మొదటి దఫాలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. ప్రధాన పొలంలో కలుపు నివారణకు, నాట్లు వేసిన 3-5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి 1.0-1.25 లీటర్ల బుటాక్లోర్ లేదా 400మి.లీ ప్రిటిల్లాక్లోర్ లేదా బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రిటిల్లాక్లోర్ గుళికలు 4కిలోల చొప్పున సమానంగా పడేలాగా ఎకరానికి 20-25 కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలి. వెద పద్దతిలో సాగు చేస్తున్న రైతులు తీసుకోవలిసిన జాగ్రత్తలు ఉత్తర కోస్తాలో, కృష్ణా డెల్టాలో వెద పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు పడి పోని రకాలను ఎంపిక చేసుకోవాలి. సిఫార్సు చేసిన ఎరువులలో భాస్వరం పూర్తిగా, సగ భాగం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని మొదటి దఫా విత్తిన 15 రోజులకు, రెండవ సారి పిలకల దశలో, ఆఖరి సారి అంకురం ఏర్పడే దశలో పొటాష్ ఎరువుతో పాటుగా వేసుకోవాలి. దుక్కి దున్ని ఎద పద్ధతిలో విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 38.7% 700 మి.లీ/ఎకరానికి లేదా పెండిమిథాలిన్ 30% 1000 మి.లీ /ఎకరానికి భూమిలో తగినంత తేమ ఉన్నపుడు పిచికారీ చేసుకోవాలి. దమ్ము చేసి వెదజల్లిన పద్ధతిలో విత్తిన 3-7 రోజులకు భూమిలో తేమ ఉండేటట్లు చూసుకొని ఎకరానికి 600 మి.లీ ప్రిటిలాక్లోర్ + సేఫెనర్ లేదా 4 కిలోల బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ + ప్రిటిలాక్లోర్ గుళికలు 20 కిలోల ఇసుకలో కలిపి విత్తనం వెదజల్లిన లేదా డ్రమ్ము సీడర్ తో విత్తిన పొలంలో సమానంగా చల్లాలి. చౌడు భూములలో వరి సాగు - సూచనలు జీలుగ వంటి పచ్చి రొట్ట పైర్లను పెంచి 30-40 రోజుల వయసు గల పచ్చి రొట్ట మొక్కలను కాడ పలుచగా ఉన్నప్పుడు కలియ దున్నటం వల్ల చేనుకు అవసరమైన మూడవ వంతు ఎరువు అంది భూసారం పెరుగుతుంది చౌడు తీవ్రత తగ్గుతుంది. దమ్ము చేసిన తరువాత మంచి నీటిని పెట్టి 2-3 సార్లు నీరు బయటకు తీసివేయాలి. చౌడును తట్టుకునే వరి రకాలు ఎం.సి.ఎం.100, ఎం.సి.ఎం 103 లను సాగు చేయాలి. 25-30 రోజుల వయసు నారు ఉడ్చాలి. తరచు మంచి నీటితో పొలంలోని నీటిని మార్చుతూ ఉండాలి. వరి నారుమడి, ఎద వరి పంట నీట మునిగితే తీసుకోవలసిన చర్యలు అకాల వర్షాలకు నారుమడిలో, ఎద వరి సాగు పొలాలలో విత్తనం చల్లిన 2-3 రోజుల వయసులో 3 రోజుల కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. వీలైనంత త్వరగా నీటిని బయటకు తీసి వేయాలి.విత్తిన 7 నుంచి 30 రోజుల మద్యలో నారు 5 రోజుల కన్నా ఎక్కువగా నీటిలో మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంది. మునిగిన నారు మడి లో నుంచి 5 రోజుల లోపు నీరు పూర్తిగా బయటకు తీసివేసిన తర్వాత, 5 సెంట్ల నారుమడికి 1 కిలో నారుమడులు, యూరియా + 1 కిలో పొటాష్ వేసుకోవాలి. 1గ్రా.కార్బండిజం లేదా 2 గ్రా. కార్బండిజం + మాంకోజెబ్ లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి పంట పిలకల దశలో మునిగితే నీరు బయటకు పోయిన తరువాత ఎకరానికి 20 కిలోల యూరియా + 20 కిలోల పొటాష్ లను అదనంగా వేసుకోవాలి. ఇనుప ధాతులోపం మెట్ట నారుమడులు, చౌడు భూములలో దుక్కి దున్నిన ఎద వరి సాగులో లేత ఆకులు తెల్లగా పాలిపోయినట్లైతే ఇనుప ధాతులోపంగా గుర్తించి లీటరు నీటికి 20 గ్రా. అన్నభేది + 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకుని ఇనుప ధాతు లోపాన్ని సవరించుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే నీటికి 5 గ్రా. అన్నభేదితో పాటు చిటికెడు నిమ్మ ఉప్పు వాడుకోవాలి. ఆధారం: పాడి పంటలు డా.ఎం.గిరిజారాణి, ప్రధాన శాస్త్రవేత్త (వరి), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేరు, పశ్చిమగోదావరి.