వరిలో ఫలవంతమైన పిలకల సంఖ్యను పెంచే యాజమాన్య పద్దతులు వరి పంటకాలం మొత్తంలో పిలక (దుబ్బు) దశ నుంచి పూత దశ వరకు ఉన్న పంటకాలం దిగుబడులను ప్రభావితం చేయగల అత్యంత కీలకమైన సమయం. ఈ దశలోనే గరిష్ట పిలకల సంఖ్య, ఫలవంతమైన పిలకల సంఖ్య నిర్ణయమై కంకి ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది, దిగుబడిని నిర్ణయించే గింజల సంఖ్య, కంకి పొడవు వంటి అంశాలకు రూపకల్పన జరుగుతుంది. ఈ దశలో సరైన నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, కలుపు యాజమాన్యంతో పాటు, సమగ్ర చీడపీడల నివారణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు పొందడం సాధ్యమవుతుంది. పిలక(దుబ్బు) దశ వరి పైరు నాటిన/విత్తిన 20-25 రోజుల నుంచి 45-50 రోజుల వరకు ఉన్న పంటకాలాన్ని పిలకల(దుబ్బు) దశ అంటారు. ఈ దశలో తల్లి కాండం నుంచి కొత్త పిలకలు పుట్టుకొస్తాయి. ఈ దశలో ఏర్పడే గరిష్ట పిలకల సంఖ్యే దిగుబడికి పునాది. సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఫలవంతమైన పిలకల సంఖ్యను పెంచగలగడమే ఈ దశలో కీలకమైన అంశం. నీటి యాజమాన్యం దుబ్బు దశ ఈ దశలో పొలంలో 2-3 సెం.మీ. లోతు నీరు మాత్రమే ఉంచాలి. ఎక్కువ నీరు నిల్వ ఉంచడం వల్ల పిలకల సంఖ్య తగ్గుతుంది. పిలకల సంఖ్య గరిష్ట స్థాయికి చేరిన తర్వాత (నాటిన 45-50 రోజులకు), 7-10 రోజుల పాటు పొలాన్ని ఆరబెట్టడం ద్వారా వెన్ను వేయని పిలకల పెరుగుదలను నియంత్రించవచ్చు. అంకురం, పూత దశ అంకురం దశ మొదలు పూత దశ వరకు నీటి ఎద్దడి రాకూడదు. ఈ దశలో నీటి కొరత తీవ్ర దిగుబడి నష్టానికి దారితీస్తుంది. పొలంలో నిరంతరం 5 సెం.మీ. లోతులో నీటి మట్టం ఉండేలా చూసుకోవాలి. పూత దశలో ఉదయం వేళల్లో నీరు లేకపోతే పుప్పొడి దెబ్బతిని గింజలు తాలుగా మారే అవకాశం ఉంది. ఎరువుల యాజమాన్యం నత్రజని సిఫార్సు చేసిన మొత్తం నత్రజని (N)లో 25-30% రెండవ దఫా (దుబ్బు దశ - నాటిన 20-25 రోజుల వరకు) వేయాలి. 3వ దఫా నత్రజని పొట్ట దశ ప్రారంభంలో (అంకురం దశ – నాటిన 40-45 రోజులకు) వేయడం వల్ల కంకి పొడవు, గింజల సంఖ్య పెరుగుతాయి. భాస్వరం, పొటాష్ సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం ఆఖరి దుక్కిలో వేయాలి. సిఫార్సు చేసిన పొటాష్ (K2O) మోతాదును సగం ఆఖరి దుక్కిలోను, మిగిలిన సగం పొట్ట ప్రారంభ దశలోను రెండు దఫాలుగా వేయడం వలన పైరు పురుగులను, తెగుళ్ళను తట్టుకొనే శక్తిని సంతరించుకోవడంతో పాటు గింజల బరువు, నాణ్యత మెరుగుపడతాయి. సూక్ష్మ పోషకాలు దుబ్బు దశలో జింక్ ధాతు లోపం కనిపిస్తే ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ ను 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు యాజమాన్యం దుబ్బు దశ ప్రారంభం నుంచి నాటిన 20-25 రోజుల వరకు కలుపు నివారణ చేపట్టాలి. ఆలస్యమైతే పోషకాల కోసం పోటీ పెరిగి పిలకల సంఖ్య తగ్గుతుంది, దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. పొలంలో నీరు నిల్వ ఉంచడం, అలాగే సిఫారసు చేసిన కలుపు మందులు వాడటం ద్వారా కలుపును నియంత్రిం చాలి. కలుపును కూలీలతో తీయించటం ఉత్తమం. ఫలవంతమైన పిలకల సంఖ్యను పెంచే యాజమాన్య పద్ధతులు ఖరీఫ్‌లో ఒక చదరపు మీటరుకు 33 కుదుళ్ళు ఉండేలా చూసుకొంటే పిలకలు సంఖ్య పెరుగుతుంది. పైరుకు తగినంత సూర్యరశ్మి అందేలా చూడాలి. పొలం చుట్టూ నీడనిచ్చే చెట్లు ఉంటే తొలగించాలి. అంకురం దశలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు నాటిన 55-65 రోజులకు పొట్ట దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో నీటి ఎద్దడి, పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. ఇది కంకి పొడవు, గింజల సంఖ్యను నిర్ణయిస్తుంది. పూత దశలో పాటించవలసిన మెళకువలు నాటిన 70–85 రోజులకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో అధిక ఉష్ణోగ్రతలు (35°C పైన), నీటి ఎద్దడి, తీవ్రమైన చలి వల్ల పుప్పొడి దెబ్బతిని తాలుగింజలు ఏర్పడతాయి. పూత దశలో పురుగు మందులు, కలుపు మందుల పిచికారీని వీలైనంత వరకు నివారించాలి. తేనెటీగలు, ఇతర పరపరాగ సంపర్క కీటకాలకు హాని కలిగించే మందులను ఈ దశలో వాడకూడదు. పూత దశలో పొలంలో నిరంతరం 5 సెం.మీ. లోతు నీరు ఉండేలా చూడాలి. రైతులు దుబ్బు దశ నుంచి మొదలుకొని పూత దశ వరకు యాజమాన్య మెళకువలు పాటించినట్లయితే పిలకల సంఖ్య, కంకి పొడవు, కంకిలోని గింజల సంఖ్య, గింజల బరువు, నాణ్యత మెరుగుపడి అధిక దిగుబడులు సాధించవచ్చు. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.డి. సుధారాణి సీనియర్ శాస్త్రవేత్త (కీటక విభాగం), కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా జిల్లా