రబీ కంది విత్తే సమయం - దిగుబడికి తొలిమెట్టు కంది సాధారణంగా ఖరీఫ్ పంటగా పండించినా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వరి మాగాణుల్లో వరి కోతల తర్వాత సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మొదటి వారం వరకు విత్తుకోవడం బాగా ప్రాచుర్యంలో ఉంది. దీన్ని "రబీ కంది" లేదా "మాగాణి కంది” అని పిలుస్తారు. విత్తన ఎంపిక నీటి ఎద్దడిని తట్టుకునే స్వల్ప కాలిక రకాలైన ఎల్.ఆర్.జి. 133-33, ఎల్.ఆర్.జి. 105, ఎల్.ఆర్.జి. 52, టి. ఆర్.జి.59, లక్ష్మి (ఐ.సి.పి.ఎల్ 85063), బి.ఎస్.ఎం.ఆర్. 736, ఆశ (ఐ.సి.పి.ఎల్ . 87119) అనువైనవి. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 10గ్రా. ట్రైకోడెర్మావిరిడి జీవ శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసి ఎండు తెగులును ముందస్తుగా నివారించవచ్చు. అనంతరం కిలో విత్తనానికి ద్రవరూప రైజోబియం 10 మి.లీ. కలిపి విత్తన శుద్ధి చేసి విత్తినట్టైతే నత్రజని స్థిరీకరణకు సహాయపడడం వలన అధిక దిగుబడి పొందవచ్చు. భూమి ఎంపిక, తయారీ నీరు నిల్వ ఉండని, మురుగు నీరు సులభంగా పోయే వసతి ఉన్న గరప/ఒండ్రు నేలలు అనుకూలం. వరి కోత తర్వాత పొలంలో మిగులు తేమను ఉపయోగించుకొని, ఒకటి-రెండు దుక్కులు దున్ని బాగా చదును చేయాలి. విత్తే కాలం, విత్తన మోతాదు రబీ పంటగా సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లోనూ విత్తుకోవచ్చు. హెక్టారికి 12-15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి, విత్తే దూరం నాగలి వెంబడి కాని, సాళ్ళలో గొర్రుతో కాని విత్తుకోవాలి, సీల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో ఆరుతడిగా 75-90X10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఎర్ర నేలల్లో వర్షాధారంగా 45-60X 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఆరుతడి పంటగా 75-90X 10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొడి విత్తనాన్ని నేరుగా నేలలోని తేమ ఆధారంగా విత్తడం అలవాటుగా ఉంది. అంతర కృషి మొలక వచ్చిన 20-25 రోజులకు మొదటి కలుపు తీయాలి. 35-40 రోజులకు రెండవసారి కలుపు నివారణ. అవసరమైతే గొర్రుతో అంతర కృషి చేయాలి.మొక్కలు దగ్గరగా ఉంటే థిన్నింగ్ చేసి సరైన మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోవాలి. పూత, కాయ దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. ఎరువుల వాడకం ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు నేల స్థితిగతులను మెరుగుపరచి పంటకు పోషకాలు అందిస్తాయి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఆఖరి దుక్కిలో వేయాలి. పంట 35-40 రోజుల దశలో పైపాటుగా మరో 8 కిలోల నత్రజని వేసుకోవాలి. దీని వల్ల మొలక దశ నుండే మొక్కలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. నీటి నిర్వహణ ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాలలో, 2 తేలికపాటి తడులు, పైరు పెరుగుదల దశలో (40-50 రోజులు), కాయ ఏర్పడు దశలలో ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా మురుగు వసతి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలి. కలుపు నివారణ ఎకరాకు పెండిమిథాలిన్ 30% 1.0- 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 50% లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున పిచికారీ చేయాలి. మళ్లీ కలుపు పెరిగితే, విత్తిన 30,60 రోజులప్పుడు గుంటకతో లేదా గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరానికి 300 మి.లీ. ఇమజితాఫిర్ 5% 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతర పంటలు నీటి వసతి గల ప్రాంతాలలో కంది+పెసర/మినుము/మొక్కజొన్న (1:2) అంతరపంటలుగా వేసుకో వచ్చు . అయితే అంతర పంటలుగా కంది + మొక్కజొన్న (1:2) వేసినప్పుడు విత్తన మోతాదు కంది ఎకరాకు 2-3 కిలోలు, మొక్కజొన్న 6 కిలోలు, కంది+ వేరుశనగ (1:7) వేసినప్పుడు కంది 2-3 కిలోలు, వేరుశనగ 42-45 కిలోల చొప్పున వేసుకోవాలి. అంతర పంటలుగా కంది + మొక్కజొన్న (1:2) వేసినప్పుడు ఎకరాకు నత్రజని కందికి 8 కిలోలు, మొక్కజొన్నకు 22 కిలోలు, భాస్వరం కందికి 20 కిలోలు, మొక్కజొన్నకు 11 కిలోలు, అదేవిధంగా కంది+ వేరుశనగ (1:7) వేసినప్పుడు ఎకరాకు నత్రజని కందికి 8 కిలోలు, వేరుశనగకు 18 కిలోలు, భాస్వరం కందికి 20 కిలోలు, వేరుశనగకు 35 కిలోలు చొప్పున రెండు పంటలకు వేరువేరుగా వేసుకోవాలి. సస్యరక్షణ పంటను వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. పంట పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులు, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటే నివారణకు 2.0 మి.లీ. క్వినాల్ ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయ తొలుచు పురుగు లేదా శనగ పచ్చ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక కె.వి. శివారెడ్డి శాస్త్రవేత్త ( సేద్య విభాగం), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం, గుంటూరు.