తెలంగాణ రాష్ట్రంలో పండించే అపరాలలో కంది, పెసర, మినుము చాలా ప్రధానమైనవి. ఈ పంటలను తొలకరి, యాసంగి, వేసవి కాలాల్లో ఏక పంటగానే కాకుండా పత్తి, పండ్లతోటల్లో అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. తక్కువ పంట కాలపు రకాలు అందుబాటులో ఉండడం వలన వివిధ పంటల సరళిలో పంట మార్పిడి పంటలుగా సాగు చేస్తున్నారు. నత్రజనిని స్థిరీకరించడంలో భూమికి సేంద్రియ పదార్థం అందించడంలో పప్పుధాన్యపు పంటల సరళిలో సుస్థిర దిగుబడులు, నాణ్యమైన ఆహార భద్రత, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడంలో అపరాల ప్రాధాన్యత చాలా అధికంగా ఉంది. వానాకాలంలో విత్తిన కంది 160-180 రోజుల కాలపరిమితి కలిగి ఉంటే, యాసంగిలో 120–-130 రోజులలో పరిపక్వత చెందుతుంది. కాబట్టి మధ్య కాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. కంది రకాలు వరంగల్ కంది (డబ్ల్యూ.ఆర్.జి.255) : కాల పరిమతి 120-130 రోజులు. దిగుబడి ఎకరానికి 6-8 క్వింటాళ్ళు. వ్యుజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది. రుద్రేశ్వర (డబ్ల్యూ. ఆర్.జి.65) : కాల పరిమతి 120-130 రోజులు. దిగుబడి ఎకరానికి 6-8 క్వింటాళ్ళు. ఫ్యుజేరియం ఎండు తెగులు, శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. తెలంగాణ కంది -3 (టి.డి.ఆర్.జి. 59) : కాల పరిమతి 120–130 రోజులు. దిగుబడి ఎకరానికి 6-7 క్వింటాళ్ళు. ఫ్యుజేరియం ఎండు తెగులు, వెర్రి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. హనుమ (టి.డి.ఆర్.జి.4) : కాల పరిమతి 120-130 రోజులు. దిగుబడి ఎకరానికి 5-6 క్వింటాళ్ళు. ఫ్యుజేరియం ఎండు తెగులు, వెర్రి తెగులు, శనగపచ్చ పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. ఆశ (ఐ.సి.పి.ఎల్.87119): 50 పరిమతి 120-130 రోజులు. దిగుబడి ఎకరానికి 5-6 క్వింటాళ్ళు. ఫ్యూజేరియం ఎండు తెగులు, వెర్రి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. పెసర రకాలు ఎం.జి.జి. 295 : కాల పరిమతి 65-70 రోజులు. దిగుబడి హెక్టారుకు 12-15 క్వింటాళ్ళు. కాయలు పైభాగాన గుత్తులుగా కాస్తాయి. గింజ లావుగా ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. ఆకుమచ్చ, మొవ్వకుళ్ళు, పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. ఎం.జి.జి.351 : కాల పరిమతి 70-75 రోజులు. దిగుబడి హెక్టారుకు 14-15 క్వింటాళ్ళు. కొంత వరకు పల్లాకు తెగులును తట్టుకుంటుంది. డబ్ల్యూ.జి.జి.37 : కాల పరిమతి 60-65 రోజులు. దిగుబడి హెక్టారుకు 12-15 క్వింటాళ్ళు. ఒకేసారి కోతకు వచ్చి పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎం.జి.జి.347: కాల పరిమతి 65 రోజులు. దిగుబడి హెక్టారుకు 12-15 క్వింటాళ్ళు. ఆకుమచ్చ తెగులు, పల్లాకు తెగులు, తామర పురుగు, బెట్ట పరిస్థితులను కొంత వరకు తట్టుకుంటుంది. ఎం.జి.జి.385 : కాల పరిమతి 70-76 రోజులు. దిగుబడి హెక్టారుకు 15-16 క్వింటాళ్ళు. మొవ్వకుళ్ళు, ఆకుముడతను, పల్లాకు, ఆకుమచ్చ, మారుకా మచ్చల పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. డబ్ల్యూ.జి.జి.42: కాల పరిమతి 55-60 రోజులు. దిగుబడి హెక్టారుకు 13-14 క్వింటాళ్ళు. పొడవైన కాయలతో పల్లాకు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. మినుము రకాలు ఎం.బి.జి. 207 : కాల పరిమతి 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వింటాళ్ళు. గింజ నలుపు రంగు కలిగి ఉండి, పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. డబ్ల్యూ.బి.జి.26 : కాల పరిమతి 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు. మధ్యస్థ లావు గింజ కలిగిన సాదారకం. తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది. ఎల్.బి.జి.752: కాల పరిమతి 85 రోజులు. దిగుబడి ఎకరాకు 7-8 క్వింటాళ్ళు. గింజ లావుగా ఉండి పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎల్.బి.జి. 20 : కాల పరిమతి 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వింటాళ్ళు. మధ్యస్థ లావు గింజను కలిగిన పాలిష్ రకం పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. జి.బి.జి 1 : కాల పరిమతి 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వింటాళ్ళు. అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఆధారం: పాడిపంటలు పి.గోన్యానాయక్, ఎం.మధు, వెంకట్ రెడ్డి, పద్మజ, ఆర్. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్.