యాసంగి కంది సాగు: అనుకూల రకాలు, మేలైన యాజమాన్య పద్ధతులు మరియు అధిక దిగుబడికి సూచనలు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే పప్పు ధాన్యపు పంటలలో కంది ముఖ్యమైనది. వానాకాలంలో స్వల్ప కాలిక పంటలైన పెసర, మినుము, మొక్కజొన్న, వేరుశనగ పంటల తర్వాత కందిని యాసంగిలో ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. యాసంగిలో కంది సాగు చేసినప్పుడు ఆ ప్రాంతానికి అనుకూలమైన రకాల ఎంపిక, విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం వలన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. యాసంగి కంది సాగుకు అనుకూలమైన పరిస్థితులు వర్షాభావ పరిస్థితులు (అతి వృష్టి లేదా అనావృష్టి) ఏర్పడి ఏ పంట విత్తుకోనప్పుడు తొలకరిలో విత్తుకున్న పంట వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్నప్పుడు తక్కువ కాలపరిమితి ఉన్న పంటలు (పెసర, మినుము, మొక్కజొన్న) కోసిన తర్వాత నీటి వసతి కలిగి ఉండి కంది సాగు చేసే ఏ ప్రాంతంలోనైనా యాసంగి కంది సాగు చేయవచ్చు యాసంగి కంది సాగుతో ఉపయోగాలు యాసంగి కంది తక్కువ ఎత్తు పెరగడం వలన సస్యరక్షణ చర్యలు సులువుగా చేసుకోవచ్చు. యాసంగిలో విత్తుకున్న కంది జనవరిలో పూత దశకి వస్తుంది కాబట్టి ఆ మాసంలో శనగ పచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. యాసంగి సాగుకు అనువైన రకాలు డబ్ల్యు.ఆర్.జి. 65 (రుద్రేశ్వర) : పంట కాలం 120-130 రోజులు. దిగుబడి ఎకరానికి 8-10 క్వింటాళ్ళు. ఫ్యుజేరియం ఎండు తెగులు, శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. నల్ల రేగడి భూములకు అనువైనది. డబ్ల్యు.ఆర్.జి.255: పంట కాలం 130-140 రోజులు. దిగుబడి ఎకరానికి 7-8 క్వింటాళ్ళు. ఎందుతెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. గింజ లావుగా ఉంటుంది. టి.డి.ఆర్.జి. 4 (హనుమ) : పంట కాలం 120–130 రోజులు. దిగుబడి ఎకరానికి 8-10 క్వింటాళ్ళు. వ్యజేరియం ఎండు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులు, శనగ పచ్చ పురుగును కొంత మేరకు తట్టుకుంటుంది. టి.డి.ఆర్.జి. 59 (హనుమ) : పంట కాలం 130–140 రోజులు. దిగుబడి ఎకరానికి 8-10 క్వింటాళ్ళు. ఫ్యుజేరియం ఎండు తెగులు, వెర్రి తెగులును కొంత మేరకు తట్టుకుంటుంది. శనగ పచ్చ పురుగును కొంత మేరకు తట్టుకుంటుంది. ఆశ (ఐ.సి.పి.ఎల్. 87119) : పంట కాలం 120-130 రోజులు. దిగుబడి ఎకరానికి 7-8 క్వింటాళ్ళు. మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. ఫ్యుజేరియం ఎండు, వెర్రి తెగుళ్ళను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. అనుకూలమైన సమయం : సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తన మోతాదు: 6-8 కిలోలు ఎకరానికి విత్తే దూరం: ఎర్ర చల్కా భూముల్లో 45 లేదా 60x10 సెం.మీ. నల్ల రేగడి భూముల్లో 75 లేదా 90x10 సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి. విత్తన శుద్ధి : కంది పంటను మొదటిసారిగా సాగుచేసుకొనే పొలాల్లో ప్రతి ఎకరానికి సరిపడే విత్తనానికి 250 గ్రా. రైజోబియం కల్చర్ ను పట్టించాలి, కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండిజం లేదా థైరాం తో విత్తనశుద్ధి చేయడం వలన పంట తొలిదశలో వచ్చే తెగుళ్ళను నివారించవచ్చు. ఎరువులు ముందుగా ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువుతో పొలమంతా కలిసేటట్లుగా దుక్కిలో కలియదున్నాలి. కందికి ఎకరాకు 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి, అనగా 36 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వాడాలి. భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. కంది మొక్కకు తొలి రోజులలో ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది. కావున పూర్తి నత్రజని, భాస్వరం ఎరువులను తప్పనిసరిగా విత్తనంతో పాటు గాని లేదా ఆఖరి దుక్కిలో గాని వేసుకోవాలి. కలుపు నివారణ, అంతర కృషి మొలకెత్తక ముందు: పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. మొలకెత్తిన తర్వాత: పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి. కందిలో 45 రోజుల వరకు మొక్కల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం వరకు కలుపును సమగ్రంగా అరికట్టేందుకు సాళ్ల మధ్య గుంటక సహయంతో 2-3 సార్లు అంతర సేద్యం చేసుకోవాలి. నీటి యాజమాన్యం యాసంగి కందికి సుమారు 250-300 మి.మీ. నీరు అవసరమౌతుంది. యాసంగి కంది సాగులో 4-5 తడులు ఇవ్వాలి. మొగ్గ ఏర్పడే ముందు, కాయ ఏర్పడే దశల్లో తప్పనిసరి నీటి తడి ఇవ్వాలి. నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో పంట బెట్టకు గురైనపుడు యూరియా 20గ్రా. లేదా 10గ్రా. మల్టీ-కె. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. యాసంగిలో సాగు చేసిన కందికి చీడపీడల బెడద తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ ఆకు ముడత పురుగు, మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, ఎండు తెగులు, వెర్రి తెగుళ్ళ సమస్య వచ్చినపుడు తొలిదశల్లో గమనించుకొని నివారణ చర్యలు తీసుకున్నట్లైతే మంచి దిగుబడులు పొందవచ్చు. ముఖ్య సూచనలు విత్తిన తొలి 60 రోజుల వరకు కంది ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కావున విత్తిన 50-60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అంతరకృషి చేసుకోవాలి. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలలో తేలిక పాటి నీరు (డ్రిప్ లేదా బోదెల ద్వారా) అందిస్తే అధిక దిగిబడులు సాధించవచ్చును. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితులలో పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. మొగ్గ తొడిగే దశ, మొగ్గ తొడిగిన 10 రోజులకు మెపిక్వాట్ క్లోరైడ్ 2000 పి.పి.యం. (40మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి) ఎకరానికి పిచికారీ చేస్తే పూత రాలడం చాలా వరకు తగ్గి ఎక్కువగా కాయలు నిలవడానికి దోహదపడి దిగుబడి పెరుగుతుంది. విత్తడం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబిస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆధారం: పాడిపంటలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం