వడలు తెగులు - టైకోడెర్మా విరిడి వినియోగం మన రాష్ట్రంలో ముఖ్యంగా, ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంటలు వరి, పత్తి తర్వాత మొక్కజొన్న, మిరప, కంది, పెసర, మినుము, మన రైతులు పంట మార్పిడి చేయకుండా ప్రతి సంవత్సరం అవే పంటలు ఒకే భూమిలో పండించడం వల్ల, మనం పండించే ప్రతి ముఖ్యమైన పంటలలో భూమి ద్వారా ఆశించే తెగుళ్ళ ఉధృతి ఎక్కువైపోతోంద వాటి నివారణ కష్టమైపోతుంది. వరి పంటలో పాముపొడ తెగులు, కాండం కుళ్ళు. వేరుకుళ్ళు, పత్తి పంటలో వేరుకుళ్ళు, వర్టిసీలియం వడలు తెగులు, మిరప పంటలో ఫ్యూజేరియం వడలు తెగులు, మొక్కజొన్న పంటలో పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు, మసి కుళ్ళు, కంది పంటలో ఫ్యూజేరియం వడలు తెగులు, పెసర, మినుము పంటల్లో మాక్రోఫోమినా వేరుకుళ్ళు, ఈ విధంగా మనం పండించే అన్ని పంటలలో పంట మార్పిడి చేయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వీటి ఉధృతి పెరుగుతూ వస్తోంది. భూమి ద్వారా ఆశించే తెగుళ్ళ నివారణకు పంట మార్పిడి తప్పనిసరి. ఈ సంవత్సరం గనక మన పొలంలో ఈ తెగుళ్ళు ఆశిస్తే, ఆ తెగుళ్ళకు సంబంధించిన శిలీంధ్రం సిద్ధ బీజాలు మన పొలంలో కనీసం మూడు సంవత్సరాలు ఉంటాయి. అంటే కనీసం మూడు సంవత్సరాలు గత సంవత్సరం వేసిన పంటను మనం వేయకూడదు. ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే తెగుళ్ళ లక్షణాలు పంట తొలిదశలో కనిపించవు. మిరప, కంది పంటలో ఈ తెగులు లక్షణాలు పూత సమయంలో కనిపిస్తాయి. ఆ సమయంలో నివారణ చర్యలు చేపట్టినా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి భూమి ద్వారా ఆశించే తెగుళ్ళకి పంట వేయకముందు నుంచే జాగ్రత్తలు పాటించాలి. భూమి ద్వారా ఆశించే తెగుళ్ళని నివారించడానికి ట్రైకోడెర్మా విరిడి బాగా పనిచేస్తుంది. ట్రైకోడెర్మా విరిడి వినియోగం ట్రైకోడెర్మాని విత్తనశుద్ధి చేయడానికి, నారును శుద్ధి చేయడానికి, వృద్ధి చేసిసాళ్ళలో వేసుకోవడానికి వినియోగించవచ్చు. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి కలిపి తర్వాత విత్తుకోవాలి. అయితే పత్తి, మిరప, మొక్కజొన్న పంటలలో హైబ్రిడ్ విత్తనాలనే రైతులు ఎక్కువగా విత్తుకుంటున్నారు. ఈ పంటల విత్తనాలు కీటకనాశినితో విత్తనశుద్ధి అయి ఉంటాయి. ఈ విత్తనాలను శిలీంధ్రనాశినితో కూడా విత్తనశుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. దీనివల్ల పంట తొలి దశలో భూమి ద్వారా ఆశించే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుతుంది. ట్రైకోడెర్మా పొడి విత్తనాలకు అంత తొందరగా అంటుకోదు. దీనికి గంజి గానీ, గమ్ గాని ఉపయోగించాలి. మనం ఇంట్లో చేసిన గంజిని కొంచెం విత్తనాల మీద పోసి తర్వాత ట్రైకోడెర్మా పొడిని చల్లి కలిపితే గంజికి అంటుకుంటుంది. నీడలో కాసేపు ఆరబెట్టాక విత్తనాలను విత్తుకోవాలి. నారుశుద్ధి నాట్లు వేసే పంటలైన వరిగాని, మిరపగాని నారును ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత వాడుకోవాలి. (1 లీటరు నీటికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి కలపాలి) ట్రైకోడెర్మా విరిడి వృద్ధి చేసే విధానం వంద కిలోల పశువుల ఎరువుకి ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి వేసి బాగా కలపాలి. దాని మీద గోనె సంచి కప్పి ప్రతి రోజు నీటిని చల్లుతూ ఉండాలి. ఒక 18 రోజుల తర్వాత తెల్లని బూజు తయారవుతుంది. దీన్ని మనం ఆఖరి దుక్కి చేసే ముందు పొలమంతా సమానంగా చల్లి తర్వాత దుక్కి చేసి ఆ తర్వాత విత్తనాన్ని కానీ, నారుని కాని నాటుకోవాలి. పంటలో తెగుళ్ళ ఉధృతిని బట్టి ట్రైకోడెర్మా వినియోగాన్ని, మోతాదుని పెంచుకోవాలి. పంట వేసిన తర్వాత కూడా ట్రైకోడెర్మాని వృద్ధిచేసి సాళ్ళలో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే భూమి ద్వారా ఆశించే తెగుళ్ళ లక్షణాలు తొలి దశల్లో కాకుండా పంట పూత దశలో కనిపిస్తాయి. దీనికి కారణం తెగులు కలిగించే శిలీంధ్రం మొక్క వేరు నుండి నాళిక కణాలలో ప్రవేశించి వృద్ధి చెందడానికి సమయం తీసుకుంటుంది. శిలీంధ్రం పూర్తిగా నాళిక కణాలలో వృద్ధి చెందే సమయంలో పంట పూత దశకు వస్తుంది. నాళిక కణాలలో శిలీంధ్రం వృద్ధి చెందడం వల్ల మొక్క దానికి కావాల్సిన పోషకాలు, నీరు తీసుకోలేక ఆకులు వడలిపోవడం, తర్వాత పసుపు రంగుకు మారడం, ఆకులు రాలిపోవడం, మొక్క చనిపోవడం జరుగుతుంది. వడలిపోయిన మొక్క కాండం గనుక చీల్చి చూస్తే నాళిక కణాలలో శిలీంధ్రం వృద్ధి చెందడం ద్వారా నల్లగా మారి ఉంటాయి.కీటకాలు కనిపించిన వెంటనే నష్టం చేసినట్లు కాదు. కానీ తెగులు విషయంలో తెగుళ్ళ లక్షణాలు కనిపించాయంటే నష్టం కలిగినట్లే. కాబట్టి రైతులు భూమి ద్వారా ఆశించే తెగుళ్ళకు పంట మార్పిడి పాటించాలి. లేదంటే ట్రైకోడెర్మా విరిడిని పైన సూచించిన విధంగా వృద్ధి చేసి వినియోగించుకొని తెగుళ్ళను నివారించుకోవాలి. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డి. అశ్విని, బి.క్రాంతి కుమార్, ఎల్. సుహాసిని, కె. కవిత, కృషి విజ్ఞాన కేంద్రం, మల్యాల