తెలంగాణ రాష్ట్రంలో పండించే పండ్ల తోటల్లో బత్తాయి తోటలు ప్రధానమైనవి. రాష్ట్రంలో సాలీన సుమారు 34,771 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ 6.78 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుంది. వినియోగదారునికి చేరక ముందే వివిధ దశలలో సుమారుగా 20-25 శాతం వరకు నష్టం సంభవిస్తుంది. కనుక కాయల కోత తరువాత సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే కోత అనంతరం సష్టాలు జరగకుండా సమర్థంగా అరికట్టి కాయ నాణ్యతను పెంచవచ్చు. పూత నుంచి కాయలు పక్వానికి రావడానికి సుమారు 9-10 నెలల సమయం పడుతుంది. కాయలను చెట్ల నుండి ఒకసారి కోసిన తరువాత కాయ నాణ్యతలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. కనుక కాయల నాణ్యత మంచిగా ఉన్నపుడు కాయలు బాగా ముదిరి మంచి పరిమాణం, ఆకర్షణీయమైన రంగు, తీపి, పులుపు సరైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే చెట్ల నుండి కోయాలి. కాయ రసం పీల్చే పురుగు, గ్రాన్యూలేషన్ సమస్య లేని ప్రాంతాలలో కాయలను 11-12 నెలలల వరకు కూడా కోయకండా చెట్లమీదే ఉంచవచ్చు. మన రాష్ట్రంలో కాయలు ప్రధానంగా సెప్టెంబర్ – మార్చ్, జూన్ నెలల్లో కోతకు వస్తాయి. తోటలో అక్కడక్కడా కొన్ని కాయలను కోసి ఆయారకాల రుచి, వాసన పరిశీలించి, చెక్కర, ఆమ్లం నిష్పత్తులను పరిగణలోకి తీసుకొని కాయలను కోయాలి. పూర్తి పరిపక్వ దశలో కోసేస్తే కాయలలో రసం అధికంగా ఉంటుంది. కాయల పరిపక్వతను గుర్తించడం కాయలు ముదురు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ, లేత పసుపు పచ్చ, పసుపు నారింజ రంగుకు మారడం (కాయల పరివక్వత గుర్తించడానికి పూర్తిగా రంగుమీదనే ఆధారపడకూడదు. ఎందుకంటే కాయరంగు వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది). బ్రిక్స్ సూచిక 9 ఉండాలి. గట్టిగా ఉన్న కాయ తోలు మెత్తబడడం, కాయతోలు ఆకర్షణీయ మెరుగుదల కలిగి నూనె చుక్కలు కనిపించడం. విదేశీ ఎగుమతుల కోసం బ్రిక్స్ 9-10 శాతం తక్కువ, కాకుండా, పులుపుదనం 0.7-0.8 శాతం కలిగి ఉండాలి. బత్తాయి పండ్లలో రసం 42 శాతం కంటే తక్కువ కాకుండా ఉండాలి. బ్రిక్స్ బాగా నాణ్యత గల కాయలలో 16.1 – 20 తక్కువ నాణ్యత గల కాయలలో 16 బ్రిక్స్ కన్నా తక్కువగా ఉంటుంది. 24 శాతం కంటే ఎక్కువ బ్రిక్స్ ఉన్నట్లయితే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. బత్తాయి కాయలలో విటమిన్ సి, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, విటమిన్ బి-6 లభ్యమవుతాయి. చెట్ల నుండి కాయలను కోసే పద్దతులు కాయలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా కత్తిరింపు సాధనంతో (క్లిప్పర్లు) ప్రత్యేకమైన కత్తెరతో గానీ, సికేచర్ లను గనీ ఉపయోగించి కొద్దిపాటి తొడిమతో (2 మి.మీ) కాయలను కోయాలి. కోసేటప్పుడు కాయలకు, కాయ చర్మానికి దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా రైతులకు కాయలను చేతులకో మెలితిప్పి లాగి కోయడం లేదా ఒక వెదురు కర్రకు చివర కొక్కెం పెట్టి, దానితో కొమ్మలను ఉపి కాయలను దులుపుతూ ఉంటారు. ఈ విధంగా కోయడం మంచి పద్ధతి కాదు. బాగా ఎండగా ఉన్నప్పుడు కాయలను కోయరాదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే కాయలను కోయాలి. కాయలను కోసిన తరువాత ప్లాస్టిక్ క్రేట్లలో ఉంచి నీడ ప్రాంతాలకు చేర్చాలి. ప్యాక్ హౌడ్ సౌకర్యం ఉన్నట్లయితే ప్యాక్ హౌజ్ కు చేర్చాలి. సైజుల వారీగా గ్రేడింగ్ బత్తాయి పండ్లను చెట్టు నుండి కోసిన తరువాత వాటి పరిమాణాన్ని బట్టి, నాణ్యతను బట్టి జాగ్రత్తగా గ్రేడింగ్ చేయాలి. దెబ్బలు తగిలినవి, పరిపక్వత చెందినవి, మరీ చిన్న పరిమాణం గలవి మూడు రకాలుగా వేరుచేయాలి. మన రాష్ట్రంలో బత్తాయి పండ్లకు నిర్ధేశించిన గ్రేడింగ్ పరిమాణం గ్రేడ్ పరిమాణం 1. 6.5 సెం.మీ. కంటే ఎక్కువ 2. 5-6.5 సెం.మీ 3. 5 సెం.మీ. కంటే తక్కువ శుభ్రపరచడం కాయలను ఒకశాతం సర్ప్ వంటి సబ్బుపొడిని ఉపయోగించి శుభ్రపరచాలి. 1 గ్రా. కార్బండాజిమ్ మందును లీటరు నీటికి కలిపి కాయలను ముంచి తీయడం వలన ఎలాంటి శీసీంధ్రాలు ఆశించకుండా కాయలు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి 5 మి.గ్రా. 2, 4-డి, 2-3 శాతం మైనం ద్రావణంలో అర నిమిషం పాటు ముంచి తరువాత కాయలను గాలికి బాగా ఆరనివ్వాలి. 24-72 గంటల సేపు ఇధిలిన్ వాయువుకు గురిచేసి పండ్లను మంచి ఆకర్షణీయమైన రంగును తెప్పించవచ్చు. ప్యాకేజింగ్ మారు మూల ప్రాంతాల నుండు మార్కెట్లు, అర్బన్ మార్కెట్ కు తీసుకెళ్ళేట్టప్పుడు గాలి సోకడానికి వీలైన అట్టపెట్టెలలో ప్యాక్ చేయాలి. సాధారణంగా 10-15 కిలోల కాయలు 3 వరుసలలో పేర్చి ప్యాక్ చేయాలి. సాధారణంగా 10-15 కిలోల కాయలు 3 వరసలలో పేర్చి ప్యాక్ చేయవచ్చు. ఈ మధ్యకాలంలో మనకు కావల్సిన సంఖ్యలో క్రియోలిక్ ఫిల్మ్ లో ష్రింక్ రాపింగ్ పద్ధతి ద్వారా ప్యాక్ చేస్తున్నారు. నిల్వ ఉంచడం బత్తాయి పండ్లను 5 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 90-95 శాతం వాతావరణంలో తేమ వద్ద సుమారుగా మూడు నెలల వరకు నిల్వ ఉండవచ్చు. పండ్లను కోసిన తరువాత నిల్వలో ఆశించే కొన్ని శీలీంధ్రాలు తెగుళ్ళు బత్తాయి, నిమ్మకాయలను కోసిన తరువాత భద్రపరచడం, భౌతిక పరిస్థితుల మార్పుల కారణంగా కొన్ని రకాల పెన్సిలియం జాతులకు చెందిన ఆకుపచ్చ, నీలి శీలీంధ్రాలు ఆశించి కాయలు పాడవుతాయి. అంత్రక్రోస్ మచ్చలు, యాస్పర్జిల్లస్ కుల్ళు, అలాగే తొడిమ కుళ్ళు పోర్ రాట్, బ్ర్రౌన్ రాట్ మొదలైన తెగుళ్ళు పండ్లను ఆశిస్తాయి. పండ్లను జాగ్రత్తగా కోయడం, దించడం, భద్రపరచడం, జాగ్రత్తగా రవాణా చేయడం, శుభ్రంగా ప్యాక్ చేయడం, అవసరం అయినప్పుడు శీలీంధ్రనాశిని పిచికారి చేయడం వలన, నిల్వ చేసే గదులు, ప్యాక్ హౌజ్ లు శుభ్రంగా ఉంచడం వలన నిల్వలో పండ్లను శిలీంధ్రాలు, తెగుళ్ళు ఆశించకుండా నివారించవచ్చు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక