ఏండ్ల తోటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చేసుకోవాల్సి వివిధ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం .ప్రస్తుతం కొమ్మ కత్తిరింపులు, ఎరువులు, కలుపు, నీటి యాజమాన్యం, చీడపీడ యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా రైతులు నాణ్యమైన పండ్లతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చు. కొమ్మ కత్తిరింపులు పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపులు కచ్చితంగా పాటించ వలసిన యాజమాన్య పద్ధతి. ఈ కొమ్మ కత్తిరింపుల వల్ల దిగుబడి గణనీ యంగా పెరుగుతుంది. కారణం ఏమిటంటే అధిక సూర్యరశ్మి మొక్క లోపలి భాగాలకు చొరబడి మొక్క ఎదుగు దల బాగుంటుంది. అలాగే చీడపీడలు కూడా నివారించబడతాయి, ముఖ్యంగా శాఖీయ పూల భాగాల మధ్యన సమన్వయం ఏర్పడి అధిక ఫల సాయం పొందవచ్చు. ఎండిన, వ్యాధి సోకిన కొమ్మలు కూడా తీసివేయబ డతాయి. ప్రధానంగా మామిడి, జామ, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగు, సీతాఫలం, సపోట వంటి పంటల్లో కొమ్మ కత్తిరింపులు అవసరమవుతాయి. కొమ్మ కత్తిరింపులు చేసే సమయం పంటను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మామిడిలో పంట కోసిన వెంటనే లేదా పంట కోసిన 15 రోజుల తర్వాత కొమ్మ కత్తిరింపులు చేయాలి. అదేవిధంగా జామ మరియు దానిమ్మలు పంటకు వదిలే 15 నుంచి 30 రోజుల ముందుగా కొమ్మ కత్తిరింపులు చేయాలి. సీతాఫలం రేగులో వేసవికాలంలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్మ కత్తిరింపు సమయంలో జాగ్రత్తలు కొమ్మ కత్తిరింపులు చేసే పరికరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపో ద్రావణంలో లేదా బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతనే మళ్లీ వాడుకోవాలి లేదంటే ఒక తోట నుంచి ఇంకో చోటికి రోగ కారక శిలీంధ్రాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. కత్తిరింపులు అయిన వెంటనే కత్తిరింపు భాగాన్ని బ్లైటాక్స్ పేస్ట్ లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ పేస్ట్ తో పూత పూయాలి. అధిక వర్షం ఉన్న సమయంలో కొమ్మ కత్తిరింపులు చేయరాదు. పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం పండ్ల తోటలకి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు పచ్చి రొట్ట ఎరువులు కూడా వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర పూత సమయంలో పొలంలో కలియదున్నాలి. పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేల సేంద్రియ శాతం పెరుగుతుంది. వీటితో పాటు మొక్కకి పోషకాలు అందించే నత్రజని, భాస్వరం, పొటాష్ వేసుకోవాలి. మామిడిలో మొక్కకి రెండు కేజిల యూరియా, 6 కేజిల సూపర్ ఫాస్ఫేట్ ఒక కేజి 600 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. అదే విధంగా జామలో మొక్కకి ఒక కేజి యూరియా, ఒక కేజి 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. పండ్ల తోటల్లో వాడాల్సిన వివిధ సూక్ష్మ పోషకాలు పండ్ల తోటల్లో సూక్ష్మ పోషకాలు మొక్క పెరుగుదలలో పూత, పిందె, కాయ నాణ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మార్కెట్లో ఫార్ములా 4 లేదా 7 అనే సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. సూక్ష్మ పోషకాలు అయిన బోరాన్, జింక్ మొక్కలో పూ మొగ్గ రావటానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. బోరాన్, జింక్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక డా.పి. పెద్ద నాగిరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఉద్యాన విభాగం) ఉద్యాన విభాగం, శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి