భూమి భూసారం భూమి అనేది ఒక మిశ్రమ సమ్మేళనం. దీనిలో ఖనిజలవణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి భూమిలో నిలువ ఉండడం వలన భూమిని పోషక కేంద్రంగా భావిస్తారు. భూమి దాని భూసారం మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏవిధంగా అంటే మొక్కలు వాటి పెరుగుదల అభివృద్ధి అనేది నేల నుండి గ్రహించే నీరు, పోషకాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన భూమిని దాని భూసారాన్ని కాపాడుకోవడం అనేది ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించాం. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడాలు రసాయన ఎరువుల వాడకం ద్వారా మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు, రసాయన మందులు వాడకం నానాటికి పెరిగిపోతున్నది. దీని ప్రభావంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతున్నది. దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి విషయంలో అధిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో మన వసాయరంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించారు. దీనిలో సేంద్రియ ఎరువులు వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవులు అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందిస్తుంది. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం అనేది జరగదు. పంటకు ఏ విధమైన హాని కలగదు. వీటి వాడకం వలన రసాయన ఎరువుల వాడకం అనేది కొంత మేరకు తగ్గుతుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందవచ్చు. భూసారం కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ, అధిక, సుస్థిరమైన దిగుబడులను పొందవచ్చు. అందువలన రైతులు పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకి ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవడం మంచిది. భూసార పరీక్ష అనేది నేలలోని పోషక పదార్థాల గురించే కాకుండా, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని నేల కాలుష్యాన్ని కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. భూసార పరీక్షల ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతులందరు భూసార పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రైతులందరు అధిక దిగుబడులు ఆశించి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడటం వలన మన భూమిలో పోషకాల సమతుల్యత అనేది లోపించింది. ఈ విధంగా భూసార పరీక్షలు చేయడం వలన భూమిలో అంటే మన పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకొని సరైన మోతాదుల్లో ఎక్కువ తక్కువ కాకుండా వేసుకోవచ్చు. మన రైతులు భూసార వ రీక్షలు చేయించుకోకుండా వాడిన రసాయన ఎరువులనే తరచుగా వాడి వాటి మోతాదును పెంచి మిగతా పోషక విలువలను తగ్గిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పంట భూములు క్రమంగా నిస్సారమైపోయి తక్కువ దిగుబడి ఇచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యలన్నింటికి భూసార పరీక్ష అనేది చక్కటి పరిష్కారం. మన రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ మండలాల వారీగా భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. భూసార పరీక్షల ఆధారంగా రైతు ఎరువుల వాడకంలో ప్రధానంగా మట్టి నమూనాను సేకరించడం అనేది కీలకమైనది. అందువలన మట్టి నమూనాను సేకరించడం అనేది ముఖ్యం. అందువలన మట్టి నమూనా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పక పాటించాలి. మట్టి నమూనా సేకరణ విధానం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటగా పొలంలో "వి" ఆకారంలో 15 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుండి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. కాబట్టి ఏ పోషకం ఎంత మోతాదులో ఉంది అనేది తెలుసుకొవాలి. భూసార పరీక్షలు చేయించుకోవాలి ఈ విధంగా భూసార పరీక్షలు చేయించుకోవడం వలన రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలు భూసార పరీక్షలు చేయించుకోవడం వలన భూమిలో లేదా వాళ్ళు పండించే పొలంలో మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. సమస్యాత్మకమైన భూములు ఉన్నా కూడా వాటి గురించి తెలుసుకొని వాటిని సవరించుకునే విధానాలు కూడా ఉపయోగించవచ్చు. మన రైతులు వచ్చే కాలంలో ఏ పంటలు వేసుకుంటున్నారు, ఆ పంటకు కావాల్సిన ఎరువులు, వాటిని ఎంత మోతాదులో వాడాలో కూడా రైతులు ఈ భూసార పరీక్షల వలన తెలుసుకోవచ్చు. అది కాకుండా ఈ కాలంలో పట్టణ పరిసరాల్లో చాలా వరకు పరిశ్రమలన్నీ బాగా పెరిగిపోయి అందులో వచ్చే విష పదార్థాలు కానీ, కాలుష్యం చెందించే పదార్థాలన్నీ నీటిలో గానీ లేదా నేలలో గానీ కలిసిపోయి అవి కూడా పంటకు చాలా వరకు నష్టాన్ని కలుగచేస్తున్నాయి. కాబట్టి ఈ భూసార పరీక్షలు చేయడం వలన ఏమైన విషపదార్థాలు నేలల్లో ఉన్నాయా కూడా రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు భూసార పరీక్షల ద్వారా ఉన్నాయి కాబట్టి రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ విధంగా ఒక ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టి మొత్తం ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి నాలుగు భాగాలుగా చేయాలి. పై విధంగా నాలుగు భాగాలు చేసిన మట్టిలో ఎదురు ఎదురు భాగాలు తీసుకొని అనగా 2, 3 లేదా 1, 4 భాగాలు తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టిని అర కిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు వేర్ల మొదళ్ళ లేకుండా చూసుకొని నీడలో ఆరనివ్వాలి. మట్టి నమూనా సేకరణకు రసాయనిక / సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. గట్ల దగ్గర్లోను, పంట కాల్వల్లోను, చెట్ల కింద భాగం నుండి, ఎరువు కుప్పలు వేసిన చోట నుండి ఎప్పుడు నీరు నిలువ ఉండే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. పండ్ల తోటల గురించి అయితే మట్టి నమూనాను భూసార పరీక్షకొరకు ఇచ్చే ముందు ఈ నమూనా పండ్ల తోటల కొరకు అని సూచించాలి. మట్టి నమూనాను భూసార పరీక్షా కేంద్రానికి ఈ కింది సమాచారంతో పంపాలి. రైతు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, కావాల్సిన పరీక్ష (భూసార / చౌడు / పండ్ల తోట ఎంపికకు). ఇంతకు ముందు వేసిన పంట, దానికి వాడిన ఎరువులు, వేయబోవు పంట. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక