మేలైన నువ్వుల దిగుబడికి నువ్వుల పంటను నూనె గింజల పంటల్లో రారాణిగా చెబుతారు. నువ్వులలో నూనె 49-55%, ప్రోటీన్ 20-25% మాత్రమే కాక విటమిన్లు, అమైనో ఆమ్లాలు, పాలీ అన్ సాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు కూడా ఉన్నందున ఈ నువ్వులను అనేక రకాల వంటకాలలో విరివిగా వాడతారు. ఏ, బి, కె విటమిన్లు కూడా ఉన్నందున చర్మ ఆరోగ్య పరిరక్షణలో తోడ్పడుతుంది. మన దేశం నువ్వుల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. వాతావరణం నువ్వులు ఉష్ణమండలాలు,వెచ్చని సమశీతలాలకు అనుకూలం ఇది మైదాన ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500-700 మి.మీ వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాలలో సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం, దీర్ఘకాల నీటి ఎద్దడిని తట్టుకో లేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. 25-37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల, అభివృద్ధి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 200 సెంటీగ్రేడ్ కంటే తగ్గితే పెరుగుదల ఉండదు. అలాగే పూత దశలో 400 సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉ న్నట్లయితే ఫలదీకరణ జరగక సరిగా గింజ కట్టదు. అనువైన రకాలు రైతులు అధిక దిగుబడికై అనువైన మంచి విత్తన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకుగాను ఎలమంచిలి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన గౌరి, మాధవి, వరాహ (వై.ఎల్.ఎం-11) గౌతం (వై.ఎల్.ఎం-17), శారద (వై.ఎల్.ఎం.–66) రకాలు, ఇటీవల జాతీయ స్థాయిలో విడుదలైన వై.ఎల్.ఎం.-146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు తక్కువ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిస్తాయి. గౌరి : పంట కాలం 90 రోజులు. నూనె 50%. దిగుబడి ఎకరాకు 250 కిలోలు. ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనువైనది. మాధవి : పంట కాలం 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 200 కిలోలు. నూనె 50%. లేత గోధుమరంగు విత్తనం. పలు పంటల సరళికి కూడా అనుకూలం. ఎలమంచిలి11(టీఎన్ఎన్ వరాహ): పంట కాలం 80- 85 రోజులు, నూనె 52%. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా రాయలసీమ జిల్లాలకు అనుకూలం పంట ఒకేసారి కోతకు వస్తుంది. ఎలమంచిలి 17 : పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరానికి 340-400 కిలోలు. నూనె 52.5%. లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఎలమంచిలి 66 (శారద) : పంటకాలం 80-90 రోజులు. దిగుబడి ఎకరాకు 500-600 కిలోలు. లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. బూడిద, ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. వై.ఎల్.ఎం.146 : పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరానికి 600 కిలోలు. నూనె 45%, కొంతవరకు మాక్రోఫోమినా వేరు, కాండం కుళ్ళు, వెర్రి తెగులు, ఆల్టర్నేరియా, సర్కోస్పర ఆకుమచ్చ తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. నేలలు మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వు పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు, తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అయితే మరింత అనువైనవి. నేల తయారీ : నేలను 2-3 సార్లు బాగా మెత్తగా దున్ని 2 సార్లు గుంటక తోలి చదును చేసుకోవాలి. విత్తన మోతాదు ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపో తుంది. విత్తనానికి సమ పాళ్ళలో ఇసుక కలిపి విత్తుకోవాలి. విత్తనశుద్ధి నేల నుంచి సంక్రమించే తెగుళ్ళను నివారించడానికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5 మి.లీ కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే సమయం కోస్తా జిల్లాలలో ముందస్తు ఖరీఫ్ గా మే రెండవ పక్షంలో, రబీలో/ రబీ వేసవి పంటగా డిసెంబరు రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. విత్తే పద్ధతి : వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 15 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. సాధారణంగా రైతులు వెదజల్లుతారు. కానీ వరుసలలో విత్తితే కలుపు తీసుకో వడానికి అనువుగా ఉండటమే కాక మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు. ఎరువులు ఆఖరి దుక్కిలో సేంద్రియ ఎరువుల రూపంలో బాగా మాగిన 4 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. సేంద్రియ ఎరువుతో పాటు ఎకరాకు 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేసు కోవాలి. సగ భాగం నత్రజని అనగా 8 కిలోల నత్రజనిని (యూరియా 18 కిలోలు) మొత్తం భాస్వరం (సింగిల్ సూపర్ పాస్ఫేట్ 50 కిలోలు), మొత్తం పొటాష్ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు) ను విత్తేటపుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత పైరులో కలుపు తీసి మిగిలిన సగ భాగం నత్రజనిని (18 కిలోల యూరియా) పై పాటుగా వేయాలి. ఎరువులు వేసినపుడు నేలలో తగినంత తేమ ఉండాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేటు రూపంలో వాడడం వల్ల అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది.గింజ నిండే దశలో పైరుపై 19-19-19 NPK ఎరువును 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. కలుపు నివారణ, అంతరకృషి పెండిమిథాలిన్ 4 మి.లీ లేదా ప్రిటిలాక్లోర్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున ఏదైనా ఒక కలుపు మందును విత్తిన వెంటనే గాని మరుసటి రోజున కానీ ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం వెనక్కి నడుస్తూ పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటపుడు నేతిలో తగినంత తేమ ఉండాలి. విత్తిన వెంటనే వర్షం' పడే సూచనలు ఉన్నట్లయితే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజులలోపు అదనపు మొక్కలను తొలిగించి పలుచన చేయాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత ఒకసారి మనుషులతో కలుపుతీయించటం వల్ల కలుపు మొక్కలు నశించడమేగాక భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిలువ ఉంటుంది. దీనివల్ల పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాకుండా ఉ ంటుంది. పంటను వరుసల్లో విత్తినట్లయితే కలుపుతీయడానికి అనుకూలంగా ఉంటుంది. నీటి యాజమాన్యం విత్తనం మొలకెత్తడానికి నేలలో సరైన తేమ అవసరం. అలాలేని పక్షంలో విత్తిన వెంటనే అదేరోజు నీటి తడి ఇవ్వాలి లేదంటే మొలక శాతం తగ్గుతుంది. పూత, కాయ అభివృద్ధి, గింజ కట్టు దశల్లో తడులు తప్పక ఇవ్వాలి. నువ్వు పంట నీటి ముంపును తట్టుకోలేదు కనుక తేలికపాటి తడులు ఇవాలి. విత్తిన తరువాత 35-60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. లేదంటే తాలు గింజలు ఏర్పడి గింజ నాణ్యత క్షీణిస్తుంది. మేలైన పోషక, నీటి యాజమాన్యం పాటించి అధిక దిగుబడులు పొందవచ్చు. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక ఎం.బి.జి.ఎస్. కుమారి, శాస్త్రవేత్త, నువ్వుల పరిశోధనా స్థానం, ఎలమంచిలి, అనకాపల్లి.