కంది సాగు - సమగ్ర చీడపీడల యాజమాన్యం మన రాష్ట్రంలో పండించే అపరాల పంటలలో కంది ముఖ్యమైనది. కంది పంటను సాధారణంగా తొలకరి పంటగాను పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో అంతర పంటగాను సాగు చేసుకోవచ్చు. కంది పంటను వర్షాధా రంగా సాగుచేయడం వల్ల బెట్టకు గురవుతుంది. చీడపీడలు ఆశించడం వల్ల రైతులు తక్కువ దిగుబడిని పొందుతున్నారు. ఇది దీర్ఘకాలిక పంట అయినందువల్ల, ముఖ్యంగా పూత దశలో చీడపీడలు ఎక్కువగా ఉండి సగటు ఉత్పాదకత తగ్గుతుంది. కంది పంటను ఆశించే పురుగులు మారుక మచ్చల పురుగు దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. కంది పంట పూత దశలో చిరు జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఆశిస్తుంది. పిల్ల పురుగులు పూమొగ్గలలోని లేత భాగాలను, ఆకులు, పువ్వులను, కాయలను గూడుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలని తొలిచి తింటాయి. పైరు పూత దశకు రాకముందే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణ: పురుగు ఉదృతిని బట్టి పూత, మొగ్గ దశలో వేపనూనె 1500 పి.పి.ఎం.5 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ. పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు/కాయ తొలుచు పురుగు మొగ్గ, పూత, కాయ దశలో వర్షం పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది. తొలి దశ పిల్ల పురుగులు పువ్వులు, కాయలు, పిందెలను గోకి తింటాయి. తర్వాత మొగ్గ ల్ని తొలిచి, కాయల పై గుండ్రని రంధ్రం చేసి తల లోపలికి దూర్చి గింజలను తింటాయి. కాయలలో గింజలు లేకుండా డొల్ల చేస్తాయి. నివారణ: పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్ళను ఒక అడుగుమేర కత్తిరించాలి. ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగు ఉధృతిని తెలుసుకోవాలి. ఈ పురుగులను తొలి దశలోనే గుర్తించి 5% వేపగింజల కాషాయం పిచికారీ చేయాలి. ఎసిఫేట్ 1.5 గ్రా. పిచికారీ చేయాలి. పురుగు పెరిగినప్పుడు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లేదా ప్లూబెండిమైడ్ 0.2 మి.లీ. లేదా లామ్డా సైహలోత్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలిచే ఈగ పూత పిందె దశలో బెట్ట వాతావరణ పరిస్థితులుంటే ఈ పురుగు ఆశిస్తుంది. ముఖ్యంగా పంట కాలం పొడిగించిన పొలాల్లో, దీర్ఘకాలిక రకాల్లో తల్లి ఈగ గుడ్డును లేత పిందెల్లో పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వృద్ధి చెందు తున్న గింజలను తింటా యి. ఒక్కొక్క పురుగు ఒక గింజను మాత్రమే నష్ట పరుస్తుంది. నివారణ :పిందె దశలో 5% వేప గింజల కాషాయం పిచికారీ చేస్తే గుడ్లు పెట్టకుండా నివారిం చవచ్చు. డైమేథోయేట్ 2.0మి.లీ. లేక ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేక థయోక్లోప్రిడ్ 0.7 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నష్టాన్ని నివారించవచ్చు. కంది పంటను ఆశించే తెగుళ్ళు స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఇరియోఫీడ్ నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకు పచ్చ రంగుకి మొక్కల ఆకులు మారుతాయి. శాఖీయ భాగాలు విపరీ తంగా వేయడం వల్ల మొక్కలు గుబురుగా కనిపిస్తా యి. ఈ తెగులు ఆశిం చడం వల్ల మొక్కలు పూత పూ యవు. కాపు కాయవు అందుకే ఈ తెగులుని గొడ్డుమోతు తెగులు అంటారు. యాజమాన్య పద్ధతులు: కంది పంటను ఏటా ఒకే పొలంలో వేయకూడదు. పంట మార్పిడి పాటించాలి.పంట పొలం చుట్టూ కలుపు మొక్కలు (వయ్యారిభామ, అడవి జాతి చిక్కుడు) లేకుండా చూసుకోవాలి. నీడ పడే ఎత్తైన, పొడవైన చెట్లను పంట పొలంలో ఉంచకూడదు. తెగులు 45-60 రోజుల దశలో ఆశిస్తుంది. కావున ముందు జాగ్రత్తగా నీటిలో కరిగే గంధకం పొడిని 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మాక్రోఫోమినా ఎండు తెగులు నేల ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండి, కందిని ప్రతిసారి ఒకే నేలలో / ఒకే పొలంలో పండిస్తే ఈ తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ తెగులు చిన్న దశలో అశిస్తే వేర్లన్నీ కుళ్ళి ఎండిపోతాయి, తద్వారా మొక్క మొత్తం ఎండి, పీకగానే సులభంగా బయటకు వస్తుంది. దీన్నే డ్రైరూట్ రాట్ అంటారు. మొక్క పెరిగి, పూత దశకు వచ్చిన తరువాత ఈ తెగులు సోకితే కాండంపై నూలుకండె ఆకారపు మచ్చలేర్పడతాయి. వీటి అంచులు ముదురు గోధుమ రంగులో ఉండి, మధ్య భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఉదృతి ఎక్కువైనప్పుడు ఆ మచ్చభాగంపై పగుళ్ళు ఏర్పడి, మొక్క అంతా ఎండిపోతుంది. కొన్ని సార్లు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండిపోతాయి. యాజమాన్య పద్ధతులు: 1 కిలో విత్తనానికి 10గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం పొడిని కలుపుకొని నీడలో అరబెట్టి తరువాత విత్తుకోవాలి. కాయతొలిచే పురుగులు, తెగుళ్ళ ఉదృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పైన సూచించిన జాగ్రత్త చర్యలు పాటిస్తే కందిలో అశించిన దిగుబడులు సాదించవచ్చు. ఆధారం: పాడి పంటలు డా.ఎన్.సాంబశివరావు, ప్రధాన శాస్త్రవేత్త (ఎంటమాలజి), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం, గుంటూరు.