ఎల్ నినో లో రకాల ఎంపికే సుస్తిర దిగుబడికి పునాది ఆంధ్రప్రదేశ్ లో సాధారణంగా ఖరీఫ్ లో 15.14 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేస్తారు. ఇటీవలి కాలంలో ఎల్ నినో ప్రభావంతో వస్తున్న వాతావరణ మార్పుల కారణంగా వర్షాభావ పరిస్థితులు, తక్కువ వర్షపాతం వలన వరి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రకాల ఎంపిక నుండి మొదలుకొని సరైన నారుమడి యాజమాన్య మెళకువలు పాటించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ మంచి దిగుబడులు పొందవచ్చును. రకాల ఎంపిక నారుమళ్ళు పోసుకోవడం ఆలస్యమై, ఆగష్టు మాసంలో నారుమడి పోసుకునే పక్షంలో ఎగుమతికి అనువైన, 120-125 రోజుల కాలపరిమితి కలిగినటువంటి యం.టి.యు 1293, యం.టి.యు 1290, ఎన్.ఎల్.ఆర్ 34449 (నెల్లూరు మసూరి), ఎన్.ఎల్.ఆర్ 3354 (నెల్లూరు ధాన్య రాశి), ఎన్.ఎల్.ఆర్-3238 స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆగష్టు మాసంలో నేరుగా విత్తడానికి యం.టి.యు-1121 (శ్రీధృతి), యం.టి.యు-1224 (మారుటేరుసాంబ) బి.పి.టి -3291 (సోనామసూరి) వంటి మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు, బోరు బావుల క్రింద స్వల్ప కాల పరిమితి రకాలైన యం.టి.యు 1121, యం.టి.యు 1293, యం.టి.యు 1290, యం.టి.యు 1426 సాగు చేయాలి. చౌడు నేలలకు ఆగష్టు మాసంలో యం.టి.యు 1290, యం.టి.యు 1293 వంటి రకాలను వేసుకోవాలి. విత్తన మోతాదు నారు పద్ధతికి ఎకరానికి 20-25 కిలోలు, వెదజల్లడానికి 25-30 కిలోలు, యాంత్రిక వరి సాగు విధానం, గొర్రుతో విత్తుట, తడి విత్తనం వెదజల్లడానికి 12-15 కిలోలు, డ్రమ్ సీడర్ తో 10-12 కిలోలు, శ్రీ పద్ధతిలో 2 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 3.0 గ్రా. కార్బండిజమ్ (50 శాతం) మందును కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళకైతే లీటరు నీటికి 1 గ్రాము (కార్బండిజమ్ 50 శాతం) మందును కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు ద్రావణం సరిపోతుంది. కార్బండిజమ్ 25 శాతం, మాంకోజెబ్ (50శాతం) మిశ్రమ శిలీంధ్రనాశిని వాడే పక్షంలో కిలో విత్తనానికి, లీటరు నీటికి 2 గ్రాముల వంతున వాడాలి. నారుమడి యాజమాన్యం నారుమడిని 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసి నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలు చేసుకోవాలి. మొలక కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారు మడిలో సెంటుకు 5 కిలోల చొప్పున సమానముగా పలుచటి నీటిపొర ఉంచి చల్లుకోవాలి. మరుసటి రోజు నారుమడిలో నీటిని పూర్తిగా తీసివేయాలి. నారు, ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు ఆరుతడిగా నీరు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వకట్టాలి. ఐదు సెంట్ల నారుమడికి దమ్ములో 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, నారుమడి చల్లిన వారం లేదా పది రోజులకు 2 కిలోల యూరియా, 2 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. నారుమడిలో జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. విత్తిన 10 రోజులకు కార్బోప్యురాన్ 3జి గుళికలు సెంటు నారుమడికి 160గ్రా. చొప్పున వేయాలి లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు, 17 రోజులకు పిచికారీ చేయాలి లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోప్యురాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వేయాలి. ప్రధాన పొలం తయారీ నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి, ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచిది. నాట్లు నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చదరపు మీటరుకు 33 కుదుళ్ళు ఉండేలా చూడాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్లు నాటాలి. 40-45 రోజుల ముదురు నారు నాటుకోవలసి వచ్చినప్పుడు, చ.మీ. కు 44 మూనలు తగ్గకుండా నాటుకోవాలి. కుదురుకు 4- 5 మొక్కల చొప్పున దగ్గర దగ్గరగా నాటు వేయాలి. బాగా మెత్తగా / బరువైన నేలల్లో దమ్ము చేసిన రెండు నుంచి పది రోజుల్లోపు నాట్లు వేయటం ముగించాలి. నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఉడ్చిన వెంటనే 5 సెం.మీ. వరకు నీరు నిలవగట్టాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త (అగ్రానమి) డా.పి.వి. రమేష్ బాబు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మారుటేరు, పశ్చిమ గోదావరి.