ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా సాగవుతున్న పండ్లు - డ్రాగన్ ఫ్రూట్,అవకాడో, రాంబూటాన్ సాంప్రదాయ మామిడి, బత్తాయి, జామ తోటలతోపాటు ఇప్పుడు రాష్ట్రంలోని రైతులు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, రాంబూటాన్ వంటి కొత్త (విదేశీ) పండ్ల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీటితో దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే పంటలు కొన్ని ఉండగా, అధిక తేమ, ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే పంటలు మరికొన్ని ఉన్నాయి. ప్రతి పంటకూ నేల, వాతావరణం, మార్కెట్ డిమాండ్ వేరుగా ఉంటాయి కాబట్టి. సాగుకు ముందు రైతులు స్థానిక ఉద్యానశాఖను సంప్రదించి, చిన్న విస్తీర్ణంలో ప్రయోగా త్మకంగా ప్రారంభించడం మేలు. డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ దీనిని 'సూపర్ ఫ్రూట్'గా పిలుస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థం, విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ మొక్క బాగా పెరగడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులు దీనిని సాగు చేస్తున్నారు. వాతావరణం: ఎండ ఎక్కువగా ఉండే పొడి ప్రాంతాలు అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 38°C దాటితే సన్‌బర్న్ ముప్పు ఉంటుంది కాబట్టి మార్చి-ఏప్రిల్‌లో నీడ కల్పించాలి.సాగు విధానం : సిమెంట్ స్తంభాలు లేదా ట్రెల్లీస్ పద్ధతిలో పాదులు వేసి కొమ్మ ముక్కలను నాటాలి. నేల పూర్తిగా ఆరినప్పుడే నీరు పెట్టాలి. ఎక్కువ నీరు పెడితే వేర్లు కుళ్లిపోతాయి.దిగుబడి, ఆదాయం: నాటిన 9 నెలలకే మొదటి కాపు వస్తుంది, 25-30 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. మార్కెట్లో కిలో రూ. 150-200 వరకు ధర లభిస్తుంది. రైతులు నేరుగా పొలం వద్దే అమ్ముకునే వీలుంది. 100గ్రా. లో పోషకాలు (సుమారుగా) కాలరీలు : 57-60 పీచు (ఫైబర్) : 1.5 విటమిన్ -సి, విటమిన్-ఎ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం బెటాలైన్స్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యప్రయోజనం : రోగనిరోధకశక్తిని పెంచడం, చక్కెరస్థాయి నియంత్రణ, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అవకాడో అఅవకాడో పోషక విలువలు కలిగిన పండు, దీనిని 'వెన్నపండు' అని కూడా అంటారు. ఇటీవల దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో దీని సాగు విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, ఏజెన్సీ ప్రాంతాల్లోని చల్లని, ఎత్తైన ప్రదేశాలు దీనికి కొంతమేర అనుకూలం. వాతావరణం : ఎక్కువ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన మంచు లేని సమశీతోష్ణ వాతావరణం అవసరం. నీటి పారుదల ఉన్న ఎర్రనేలలు, గరపనేలలు అనుకూలం.సాగు విధానం: అంటుకట్టిన నారుమొక్కలను నాటు కోవడం మేలు, మొక్కకు మొక్కకు మధ్య 6-8 మీటర్ల దూరం ఉండాలి. వీటికి కాపు త్వరగా వస్తుంది.దిగుబడి, ఆదాయం: నాటిన 4-6 సంవత్సరాలకు కాపు మొదలవుతుంది. పండ్లు చెట్టుపైనే మగ్గవు, కోసిన తర్వాత మగ్గుతాయి కాబట్టి రవాణాకు సులభం. మార్కెట్లో మంచి డిమాండ్, అధిక ధర లభిస్తుంది. 100 గ్రా.లో పోషకాలు (సుమారుగా) కాలరీలు: 160 మంచికొవ్వు (మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్): 15 గ్రా. పీచు (ఫైబర్): 7 గ్రా. విటమిన్-ఇ, విటమిన్-కె, ఫోలేట్ పొటాషియం (అరటికంటేఎక్కువ) ఆరోగ్యప్రయోజనం: గుండెఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ, చర్మసంరక్షణకు మేలు చేస్తుంది. రాంబూటాన్ రంబుటాన్ లిచీ, లాంగన్ జాతికి చెందిన ఉష్ణమండల పండు-వెలుపల ముళ్లవంటి ఆకారంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి అధిక తేమ, ఎక్కువ వర్షపాతం అవసరం కాబట్టి కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీలోని అధిక వర్షపాత ప్రాంతాలు (అరకు, పాడేరు, కోనసీమ) మాత్రమే కొంతమేర అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వాతావరణం : వార్షిక వర్షపాతం 2000 మి.మీ.కు పైగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అవసరం. మైదాన/పొడి ప్రాంతాల్లో సాగు కష్టం. డ్రిప్ + మిస్ట్ ఇరిగేషన్‌తో అదనపు తేమ కల్పించాల్సి రావచ్చు.సాగు విధానం : అంటుమొక్కలను వాడటం మేలు. మొదటి 2-3 సంవత్సరాలు నీడ కల్పించి, గాలితీవ్రత తగ్గించేందుకు విండ్ బ్రేక్ చెట్లు నాటాలి.దిగుబడి, ఆదాయం: నాటిన 4-5 సంవత్సరాలకు కాపు మొదలవుతుంది. తాజా పండుగా, ప్రీమియం ఫ్రూట్‌గా నగర మార్కెట్లలో మంచి ధర పలుకుతుంది.హెచ్చరిక : ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఇంకా అరుదైన, ప్రయోగాత్మక పంటగానే పరిగణించాలి. వాతావరణం సరిపోలకపోతే మొక్కలు ఎదగవు లేదా కాపు ఇవ్వవు. కావున పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఉద్యాన నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. 100 గ్రా.లో పోషకాలు (సుమారుగా) కాలరీలు : 68 విటమిన్లు: అధికమోతాదులో పీచు (ఫైబర్), కాపర్, మాంగనీస్ నీటిశాతం అధికం వేసవిలోమంచిది ఆరోగ్యప్రయోజనం : రోగనిరోధకశక్తి, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొత్త పండ్ల సాగుకు వెళ్లే రైతులు ముందుగా తమ ప్రాంత నేల, నీటి వసతి, వాతావరణాన్ని అంచనా వేసుకోవాలి. పెద్ద పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా సమీప ఉద్యాన పరిశోధనా స్థానం లేదా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి, ప్రభుత్వ రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాల గురించి తెలుసు కోవాలి. మొదట తక్కువ విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేసి, విజయవంతమైతేనే క్రమంగా విస్తరించడం శ్రేయస్కరం. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా. జి. తనూజ శివరాం, ప్రధాన శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) ఉద్యాన పరిశోధనా స్థానం అనంతరాజుపేట, తిరుపతి జిల్లా