కాఫీ బెర్రీ బోరర్ ఉత్పత్తికి ఒక ప్రధాన ముప్పు కాఫీ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన తోట పంటలలో ఒకటి. అనేక రైతు కుటుంబాలకు ఇది ప్రధాన జీవనాధారమైన పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతలలో కాఫీని విస్తృతంగా సాగు చేస్తున్నారు. అయితే, కాఫీ సాగులో వివిధ రకాల కీటకాలు, శిలీంధ్ర తెగుళ్లు ఆశించి పంట పెరుగుదల, దిగుబడి, ఉత్పత్తి నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కీటకాలలో అత్యంత విధ్వంసకరమైనది కాఫీ బెర్రీ బోరర్. సాధారణంగా మొక్కలను లేదా పండ్లను తినే అనేక కీటకాలతో పోలిస్తే, కాఫీ బెర్రీ బోరర్ యొక్క జీవిత చక్రంలోని ఎక్కువ సమయాన్ని కాఫీ బెర్రీలోనే గడుపుతుంది. ఇది కాఫీ గింజలోకి ప్రవేశించి, అభివృద్ధి చెందుతున్న గింజను నేరుగా దెబ్బతీస్తుంది. పండు లోపల దాగి ఉండే ఈ స్వభావం కారణంగా, కాఫీ బెర్రీ బోరర్ ను ప్రారంభ దశలో గుర్తించడం, సమర్థవంతంగా నియంత్రించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కాఫీ బెర్రీ బోరర్ కాఫీ బోర్డు ప్రచురించిన ఇండియా కాఫీ పత్రిక ప్రకారం, 2025 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ ప్రాంతంలో ఈ కీటకం గుర్తించ బడింది. క్షేత్రస్థాయి పరిశీలనలలో భాగంగా పాకనకుడి గ్రామంలో మిగిలిపోయిన కాఫీ పండ్లు మరియు పచ్చి కాఫీ బెర్రీలలో ఈ కీటకం గుర్తించడం జరిగింది. అరకు ప్రాంతంలోని గిరిజన కాఫీ రైతులకు కాఫీ ఒక ముఖ్యమైన జీవనాధార పంట కావడంతో, కాఫీ బెర్రీ బోరర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం మరియు సమగ్రసస్య రక్షణ చర్యలు చేపట్టడం అత్యంత అవసరం. కాఫీ బెర్రీ బోరర్ను గుర్తించడం కాఫీ బెర్రీ బోరర్ ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉండే అతి చిన్న కీటకం. మగ కీటకాలతో పోలిస్తే ఆడ కీటకాలు పరిమాణంలో కొంత పెద్దవిగా ఉంటాయి. ఆడ కీటకం సాధారణంగా కాఫీ బెర్రీ కొన భాగంలో చిన్న గుండ్రని రంద్రం చేసుకుని లోపలికి ప్రవేశించి, అభివృద్ధి చెందుతున్న కాఫీ గింజ వైపు సొరంగాన్ని ఏర్పరుచుకుంటూ బెర్రీ లోపలికి వెళుతుంది. ఈ కీటకం చాలా చిన్న పరిమాణంలో ఉండటం వల్ల, ప్రారంభ దశలో దీని ఉనికిని క్షేత్రస్థాయిలో గుర్తించడం కష్టంగా ఉంటుంది. కాఫీ బెర్రీ బోరర్ జీవిత చక్రంలోని అత్యంత ముఖ్యమైన దశ, బెర్రీలో దాగి ఉండే దశ. కీటకం ఒకసారి కాఫీ బెర్రీలోకి ప్రవేశించిన తరువాత, దాని అభివృద్ధి దశల్లో ఎక్కువ శాతం బెర్రీ లోపల ఉండటం వల్ల బయట నుంచి చేపట్టే నియంత్రణ చర్యల వల్ల ఎటు వంటి ప్రభావం ఉండదు. అందువల్ల, ఆడ కీటకం కాఫీ బెర్రీలోకి పూర్తిగా ప్రవేశించకముందు లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సమయంలో నియంత్రణ చర్యలు చేపట్టడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. కాఫీ బెర్రీ బోరర్ వల్ల కలిగే నష్టం అపరిపక్వ దశలు కాఫీ బెర్రీ లోపల సొరంగాలను ఏర్పరచుకొని కాఫీ గింజలోని ఎండోస్పెర్జన్ను ఆహారంగా తీసుకుంటాయి. దీని ఫలితంగా కాఫీ గింజ నాణ్యత మాత్రమే కాకుండా మొత్తం కాఫీ దిగుబడి కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల, కాఫీ బెర్రీ బోరర్ కేవలం దిగుబడిని తగ్గించే కీటకం మాత్రమే కాకుండా, కాఫీ గింజ నాణ్యతను తగ్గించే ముఖ్యమైన కీటకంగా పరిగణించబడింది. కాఫీ బెర్రీ బోరర్ యొక్క జీవిత చక్రం అభివృద్ధి చెందుతున్న కాఫీ బెర్రీల లభ్యతతో సంబంధం కలిగి ఉంటుంది. ఆడ కీటకాలు కాఫీ బెర్రీలలోకి ప్రవేశించి గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు కాఫీ గింజను ఆహారంగా తీసుకుంటాయి. ప్యూపా దశ కూడా కాఫీ బెర్రీ లోపలే పూర్తవుతుంది. పురుగు సోకిన కాఫీ బెర్రీల నుంచి బయటకు వచ్చిన పెద్ద కీటకాలు ఇతర తాజా కాఫీ బెర్రీలకు వ్యాపించి వాటిని ఆశ్రయిస్తాయి. మొక్కలపై లేదా నేలపై మిగిలిపోయిన కాఫీ బెర్రీలు కీటకానికి నిరంతర సంతానోత్పత్తి ప్రదేశాలుగా ఉంటాయి. కీటకం ఒకసారి కాఫీ బెర్రీలలోకి లోతుగా ప్రవేశించిన తరువాత, సాధారణంగా బయట నుంచి చేపట్టే నియంత్రణ చర్యల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి, కాఫీ బెర్రీ బోరర్ యొక్క సంఖ్య అభివృద్ధి చెందిన తరువాత నియంత్రించడం కంటే, కీటకం కాఫీ బెర్రీలోకి ప్రవేశించకుండా నివారించడం మరింత సమర్థవంత మైన విధానం. సమగ్ర సస్యరక్షణ చర్యలు కాఫీ బెర్రీ బోరర్ నియంత్రణలో ఎర పద్ధతిపై ఆధారపడటం వలన ప్రయోజనం లేదు. కాబట్టి యాంత్రిక, జీవన మరియు పర్యవేక్షణ ఆధారిత నియంత్రణ చర్యలను సమన్వయం చేసే సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులు పాటించాలి. తోట పరిశుభ్రత సకాలంలో మరియు పూర్తిస్థాయిలో కాఫీ పండ్లను కోయడం ద్వారా కాఫీ బెర్రీ బోరర్ ను నియంత్రించ వచ్చు. పంట కోత సమయంలో కాఫీ చెట్లపై ఉన్న బెర్రీలను మాత్రమే కాకుండా, నేలపై పడిపోయిన బెర్రీలను కూడా పూర్తిగా సేకరించాలి. నేలపై పడిపోయిన పండ్లు, అధికంగా పండిన బెర్రీలు, చెట్లపై మిగిలిపోయిన పండ్లు కాఫీబెర్రీ బోరర్కు సంతానోత్పత్తి కేంద్రాలుగా పనిచేయడం వలన పంట కాలాల మధ్య కూడా జీవితచక్రాన్ని కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి, పంట కోత అనంతరం తోటలో మిగిలిపోయిన కాఫీ బెర్రీలను పూర్తిగా తొలగించడం చాలా అవసరం. పంట అనంతర నిర్వహణ కాఫీ గింజలనుసూచించిన తేమ స్థాయికి వచ్చే వరకు సక్రమంగా ఎండబెట్టాలి. ఎండబెట్టడం ద్వారా కోత అనంతరం సేకరించిన కాఫీ బెర్రీలలో మిగిలి ఉన్న కీటక దశలను తగ్గించడంతో పాటు, నిల్వ, పంట అనంతర నిర్వహణ సమయంలో కీటకం జీవించి ఉండే అవకాశాన్ని తగ్గిస్తాయి. కాఫీ బోర్డు సూచనల ప్రకారం, పార్మెంట్ కాఫీకి సుమారు 10.5 శాతం తేమ, చెర్రీ కాఫీకి సుమారు 11 శాతం తేమ ఉండేలా ఎండబెట్టడం అనుకూలంగా ఉంటుంది. ఉచ్చులతో పర్యవేక్షణ కాఫీ బెర్రీ బోరర్ కీటకాల కదలికలను పర్యవేక్షించడానికి ఆల్కహాల్ ఆధారిత బ్రోకా ఉచ్చులు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉచ్చుల ద్వారా తోటలో కీటకాల స్థాయిని అంచనా వేయవచ్చు. అలాగే, కీటక ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. కాఫీ ఎండబెట్టే ప్రదేశాల్లో సుమారు హెక్టారుకు 25 ఉచ్చులను ఏర్పాటు చేయవచ్చు అని కాఫీ బోర్డు సూచిస్తోంది. జీవ నియంత్రణ వాడే విధానం 500 మి.లీ. వేరుశెనగ నూనెను 500 మి.లీ. సర్ఫ్ ద్రావణంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 20 లీటర్ల నీటిలో, 1 కిలో బెవేరియా బాసియానా బాగా కలిపి పిచికారీ చేయాలి. తయారుచేసిన ద్రావణాన్ని మస్లీన్ వస్త్రంలో వడకట్టి శిలీంద్ర బీజాణువుల సస్పెన్షనన్ను సిద్ధం చేయాలి. ఈ బీజాల సస్పెన్షన్ను పిచికారీ యంత్రం ద్వారా కాఫీ చెట్లపై ముఖ్యంగా కాఫీ బెర్రీలను లక్ష్యంగా చేసుకొని పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కాఫీ బెర్రీ బోరర్ నియంత్రణలో బెవేరియా బాసియానా శిలీంధ్రంను ముఖ్యంగా వాడవచ్చును. ఈ శిలీంధ్రం కీటక శరీరంపై పెరిగి తద్వారా పెద్దకీటకాల జనాభాను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆధారం: పాడిపంటలు