వరి వానాకాలం వరి పంటలో అక్టోబర్ మాసం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ మాసంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి " పంట ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నది. చిరుపొట్ట దశలో ఉన్న వరి పొలాలకు ఆఖరి దఫా ఎరువులను (30-35 కిలోల యూరియా, 15-20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) " బురద పదునులో వేయాలి. ప్రస్తుతం ఎల్ ల్నినో వాతావరణం వలన దీర్ఘకాల పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం నమోదు కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటలో అధిక చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు క్రమం తప్పకుండా పొలంలోను, గట్ల వెంబడి తిరుగుతూ పురుగుల / తెగుళ్ళ ఉధృతిని గమనిస్తూ ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో పురుగుల / తెగుళ్ళ నివారణ చేపట్టడం వలన ఖర్చు, వాతావరణ, ఆహార కాలుష్యం తగ్గుతుంది. నష్టపరిమితి స్థాయి దాటిన పరిస్థితుల్లోనే మందులు పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే పురుగు: చిరుపొట్ట దశలో రెక్కల పురుగులు లేదా గుడ్ల సముదాయాలు గమనించిన వరి పైర్లలో తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 శాతం ఎస్పి 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత: కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతో ఈ పురుగును నివారించవచ్చును. వీటికి అదనంగా ఫ్లూబెండమైడ్ 48 ఎస్సి 0.1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు ఆకు, కంకినల్లి: నల్లి ఆకుల వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు పచ్చగా మారతాయి. పొట్ట దశలో లేత కంకుల నుండి రసాన్ని పీల్చడం వలన గింజ తాలుపోవడం లేదా రంగు మారడం గమనించవచ్చును. నివారణకు స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సుడిదోమ: పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. చిరుపొట్ట దశలో దోమ ఉధృతికి దోహదపడే పురుగుమందులు పిచికారీ చేయరాదు. ఈ పురుగు పిల్ల దశలో గమనిస్తే బ్యుప్రొఫెజిన్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిల్ల, పెద్ద పురుగులు గమనిస్తే డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రా. లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా. ట్రైఫ్లూమెజోపైరిమ్ 0.48 మి.లీ. లీటరు నీటికి కలిపి మొదళ్ళ దగ్గర పడేలా పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు: ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపి వేయాలి. తొలిదశలో వ్యాప్తిని నివారించడానికి వరి పైరు చిరుపొట్టదశలో మాత్రమే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. + ప్లాంటామైసిన్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూతదశలో కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయకూడదు. అగ్గితెగులు: ఆకుమచ్చ దశలో ఈ తెగులును గుర్తించి నివారించాలి. లేకుంటే మెడవిరుపు తెగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో నత్రజని వేయడం, వాతావరణ పరిస్థితులు, గట్ల వెంబడి కలుపు అధికంగా ఉండటం వలన సన్నగింజ రకాలలో ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. గింజపాలు పోసుకునే దశలో లక్షణాలు గమనించిన వెంటనే నివారణకు ఐసోప్రోథయోలేన్ 1.6 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ + మాంకోజెట్ 2.5 గ్రా. లేదా ట్రైఫ్లోక్సోస్ట్రోబిన్ + టెబ్యుకొనజోల్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పంట పూతదశలో ఉన్నప్పుడు వర్షాలు కురిస్తే మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. గింజ గట్టి పడే దశలో తెగుళ్ళ మందులు పిచికారీ చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కనుక పూతదశలోనే మానిపండు తెగులు నివారణకు తెగుళ్ళ మందులు పిచికారీ చేయాలి. వరి పైరు ఈనే దశలో (10–15 శాతం పూతదశ) ఆ తర్వాత 7-10 రోజుల వ్యవధిలో రెండవసారి ఎకరానికి కార్బండాజిమ్ 200 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 200 మి.లీ. లేదా ట్రైఫ్లోక్సోస్ట్రోబిన్ + టెబుకొనజోల్ 80 గ్రా. పిచికారీ చేయాలి. వరి పంట పూతదశలో ఉన్నప్పుడు రసాయనిక మందులను మధ్యాహ్నం నుండి సాయంత్రం సమయంలో మాత్రమే పిచికారీ చేయాలి. ఉదయం పూట పిచికారీ చేయకూడదు. మొక్కజొన్న మొక్కజొన్నలో గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టి పడే దశలు చాలా సున్నితమైనవి కావున పంట బెట్టకు గురికాకుండా నీటిని అందజేయాలి. గింజ పాలు పోసుకునే దశలో పక్షులు, అడవి పందుల బెడద తీవ్రంగా ఉంటుంది. పక్షుల బెడద నుండి కాపాడడానికి కంకులను ప్రక్కనున్న ఆకులతో చుట్టాలి. పంట నలువైపులా 4 వరుసలలో ఈ పద్ధతి పాటించాలి. ఎరుపు రంగు మెరిసే రిబ్బన్లను ఉత్తర-దక్షిణ దిక్కుగా పంటకు అడుగు ఎత్తులో కట్టి పంటను పక్షుల బారినుండి కాపాడుకోవచ్చును. పక్వానికి వచ్చిన పైరులోని కండెల పైపొర ఎండిపోయి, గింజల అడుగు భాగంలో నల్లటి మచ్చ ఏర్పడినప్పుడు కోత చేపట్టాలి. కండెలను ఎండబెట్టి తేమను 15 శాతంకు తగ్గిన తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి అయిన గింజలను 10– 12 తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి నిలువ చేయాలి. యాసంగిలో మొక్కజొన్న విత్తుకోడానికి అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు సరియైన సమయం. ఈ సమయంలో విత్తుకున్నట్లయితే పంటలో దిగుబడులు అధికంగా పొందడానికి అవకాశముంది. కిలో విత్తనానికి 6.0 మి.లీ సయాంట్రానిలిప్రోల్ థయోమిథాక్సామ్ విత్తనశుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. విత్తేటప్పుడు యాసంగిలో ఎకరాకు 50 కిలోల యూరియా, 75 కిలోల డి.ఎ.పి., 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. చదును చేసిన పొలంలో 60 సెం.మీ. దూరంలో తూర్పు-పడమర దిశలలో బోదెలు వేసుకుని 20 సెం.మీ. దూరంలో బోదెకు దక్షిణం వైపున పై నుంచి 1/3 వ వంతు ఎత్తులో విత్తుకోవాలి. విత్తిన రెండు రోజుల లోపల నేలలో తేమ ఉండగానే అట్రజిన్ 50 శాతం, కలుపు మందును తేలిక నేలల్లో 800 గ్రా లేక బరువు నేలల్లో 1200 గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి విచికారీ చేస్తే వెడల్పాకు కలువును నివారించవచ్చును. చిరుధాన్యాలు జొన్న: జూన్ మాసంలో విత్తుకున్న జొన్నపంట కోతదశకు వస్తుంది. పంటకోత లక్షణాలు అంటే గింజ కిందిభాగంలో నల్లని చార ఏర్పడటం, గింజలోని పాలు ఎండిపోయి పిండిగా మారడం, గింజను నొక్కి చూస్తే గట్టిగా ఉండటం, మొదలగు లక్షణాలు గమనించి గింజలో తేమశాతం 12-15 శాతం ఉండేలా చూసుకొని పంటకోత చేపట్టాలి. యాసంగి జొన్న: అక్టోబర్ రెండవ వారం నుండి నవంబర్ రెండవ వారం వరకు విత్తుకోవచ్చు. కింద తెలిపిన రకాలు యాసంగి కాలానికి అనుకూలమైనవి.ఎం.35-1,సి.ఎస్.వి. 29, ఆర్.ఎస్.వి.టి. 68, ఎస్.వి.టి. 55. పైన తెలిపిన రకాలే కాకుండా సి.ఎస్.వి. 41, సి.ఎస్.వి. 31, పి.ఎస్.వి. 56, పి.వై.పి.ఎస్. 2 రకాలు కూడా యాసంగి కాలంలో సాగుచేసుకోవచ్చు. సజ్జ: ప్రస్తుతం సజ్జ పంట గింజ గట్టి పడే దశలో ఉంది. కావున వంట బెట్టకు గురికాకుండా నీటిని అందజేయాలి. తేనెబంక తెగులు నివారణకు పైరు పూత దశలో కార్బండాజిమ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. రాగి: రాగి పంట ప్రస్తుతం గింజ పాలుపోసుకునే దశల్లో ఉంది, కావున పంట బెట్టకు గురికాకుండా నీటిని అందజేయాలి యాసంగి పంటను అక్టోబర్ నుండి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. కొర్ర: ఈ మాసంలో పంట కోత దశలో ఉంటుంది. ఆలస్యంగా విత్తుకున్న పంటలను గులాబిరంగు కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగ వానాకాలంలో విత్తుకున్న వేరుశనగలో పురుగులు, తెగుళ్ళు రాకుండా నివారణ చర్యలు చేపట్టే సమయమిది. లద్దెపురుగు ఆశించినట్లైతే ఎకరానికి 40 మి.లీ. ఫ్లూబెండమైడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు ఆశించినట్లైతే క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు 400 గ్రా. క్లోరోథాలోనిల్ లేదా 200 మి.లీ. టెబుకొనజోల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగను ముఖ్యంగా యాసంగి (సెప్టెంబర్ 15–అక్టోబర్ 15) కాలంలో సాగుచేస్తారు. రబీలో సాగుచేసే వేరుశనగ పంటకు చీడపీడలు ఆశించే అవకాశం తక్కువగా, నాణ్యమైన విత్తనాన్ని అధిక మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు. ఎకరానికి 60-80 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.* కిలో విత్తనానికి 1 గ్రా. టెబుకొనజోల్ 2 డిఎస్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ పొడిమందును పట్టించాలి. కాండంకుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో 2.0 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్ఎస్ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్లో విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనశుద్ధి వరి మాగాణుల్లో లేదా కొత్తగా వేరుశనగ సాగుచేసేటప్పుడు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ని పట్టించాలి. వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండే విధంగా వరుసల మధ్య 22.5 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండే విధంగా విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10-15 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన 2 రోజులలోపు (24-48) గంటలలోపు ఎకరాకు డైక్లోసులాం 84 శాతం డబ్ల్యుడిజి 12.4 గ్రా. లేదా పెండిమిథాలిన్ 38.7 శాతం సి.ఎస్ 700 మి.లీ. 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలుకాని పరిస్థితులలో పైరులో మొలచిన కలుపును (వెడల్పాటి, గడ్డిజాతి) 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితాఫైర్ 10 శాతం ఎకరాకు 300 మి.లీ. లేదా ఎకరాకు ఇమాజామాక్స్ 35 శాతం + ఇమాజితా ఫైర్ 35 శాతం డబ్ల్యుజి కలుపు మందును 40గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆముదం వానాకాలంలో విత్తుకున్న ఆముదంలో పూత నుండి కాయలు ఏర్పడే సమయం. సమయంలో వాతావరణ సూచనలను అనుసరించి, వర్షపు సూచనలు గనక ఉన్నట్లైతే బూజు తెగులు రాకుండా ఉండేందుకు వర్షానికి 4-6 గంటల ముందు, వర్షాలు తగ్గాక ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువును అదనంగా వేసుకుంటే తర్వాత వచ్చే గెలలు ఆరోగ్యంగా వస్తాయి. యాసంగిలో ఆముదం పంటను అక్టోబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 2.0 నుండి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ (మొలక కుళ్ళు తెగులు నివారణ), 3 గ్రా. కార్బండాజిమ్ (వడలు తెగులు నివారణ) తో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 2-3 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్, 24 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వేసుకోవాలి. పంట విత్తిన 40-60 రోజుల వరకు గుంటకతో వరుసల మధ్య అంతరకృషి చేసి కలుపును నివారించవచ్చు. విత్తిన తరువాత ఒక నీటి తడినివ్వాలి. ఆముదంను యాసంగిలో నల్లరేగడి నేలల్లో వరుసకు వరుసకు మధ్య 120 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 90 సెం.మీ. ఎడంతో విత్తుకోవాలి. తేలిక నేలల్లో అయితే వరుసకు వరుసకు మధ్య 120 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 45 సెం.మీ. దూరం ఉంటే సరిపోతుంది.పంటలో మొలక కుళ్ళు తెగులు గమనించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళను తడపాలి. ఎండుతెగులు గమనించినట్లైతే కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళలో పోసుకోవాలి. పంట విత్తిన 40-60 రోజుల వరకు కలుపు లేకుండా తీసివేయాలి. అంతరకృషిలో మట్టిని మొక్క మొదళ్ళ పైకి తోయాలి. పంట పై పొగాకు లద్దె పురుగు ఆశించిన ఆకులను ఏరి నాశనం చేయాలి. పురుగు తొలిదశలో ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.0 మి.లీ. నొవాల్యురాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దాసరి పురుగు గమనించినట్లైతే తొలిదశలో వేపనూనె 5 మి.లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వులు ఆగష్టు మాసంలో వేసిన నువ్వులు ప్రస్తుతం పూత, కాయకట్టే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వెర్రితెగులు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు ఆక్సీడెమటాన్ మిథైల్ 1.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. బూడిద తెగులు గమనించినట్లైతే నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీహారి గొంగళి పురుగును గమనించిన వెంటనే క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా సైపర్మెత్రిన్ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసంపీల్చే పురుగుల నివారణకై ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయతొలిచే పురుగు ఆశించినట్లైతే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు వానాకాలంలో విత్తుకున్న పొద్దుతిరుగుడు ప్రస్తుతం ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఉంది. ఈ దశలో 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఎక్కువ. తొలిదశలో ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఉదృతి అధికంగా ఉన్నట్లైతే థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగును గమనించినట్లైతే నొవాల్యురాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నెక్రోసిస్ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలను పాటించాలి. పార్థీనియం కలుపును తీసివేయాలి. ఇమిడాక్లోప్రిడ్ 4.0 మి.లీ. 10 లీటర్ల నీటికి లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు ఉధృతిని గమనించినట్లైతే ప్రొపికొనజోల్ 25 శాతం ఇసి 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీహారి గొంగళి పురుగు పుష్పించే దశలో ఆశించి ఆకులను తినటం వలన మొక్కలు మోడుబారిపోతాయి. నివారణకై క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ వాతావరణ పరిస్థితులలో వానాకాలం పంట నష్టపోయినప్పుడు ఒక మంచి ప్రత్యామ్నాయ పంటగా కుసుమ పంటను సాగుచేసుకోవచ్చు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉండే మొక్కజొన్న, వేరుశనగ బదులుగా కుసుమను నిర్భయంగా సాగుచేయవచ్చు.ఈ పంటను యాసంగిలో అక్టోబర్ రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరమవుతుంది. మొక్క కుళ్ళు, వేరుకుళ్ళు వంటి అనేక రకాల శిలీంధ్ర వ్యాధులను నియంత్రించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా 1 గ్రా. కార్బండజిమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెం.మీ, వరుసలో మొక్కల మధ్య 20 సెం.మీ. ఎడం ఉండేలా చూసుకోవాలి. దుక్కిలో 10-12 కిలోల యూరియా, 10 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం ఉత్తమం. గంధకం లభ్యత పెరగడం వలన నూనెశాతం పెరిగి అధిక గింజ దిగుబడిని పొందవచ్చు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లైతే 70 కిలోలు అవసరం అవుతుంది. విత్తిన 30-40 రోజుల మధ్య 10-12 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన 20-35 రోజుల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. పంటతొలి దశల్లో పేనుబంక ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. సోయాచిక్కుడు సోయాచిక్కుడు ప్రస్తుతం పంట విత్తిన సమయం, రకాల కాల పరిమితిని బట్టి కీలకమైన గింజ గట్టిపడే దశ నుండి కోత సమయంలో ఉంది. గింజ గట్టిపడే దశలో వర్ష పరిస్థితులు ఏర్పడినట్లైతే 15 రోజులకొకసారి 1-2 నీటితడులు ఇవ్వాలి. ప్రస్తుతం సోయాలో అక్కడక్కడ మసి బొగ్గు తెగులు, రైజోక్టోనియా ఏరియల్ బ్లైట్ తెగుళ్లు ఆశించడం జరుగుతుంది. మసి బొగ్గు తెగులు, పొడి వాతావరణం, భూమిలో తక్కువ 0 తేమశాతం, పోషకాలు, ఉష్ణోగ్రత 25-35 సెం.గ్రే. ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు వేర్లు, కాండం, కాయల మీద కనిపిస్తాయి. ఈ తెగులు పంటకాలం మొత్తం ఉంటుంది. ఈ తెగులు వ్యాపించినప్పుడు మొక్కలు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కలు బలహీనపడి, ఎండిపోయి చనిపోతాయి. ఈ తెగుళ్ల నివారణకు, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు నీటి తడులతో పాటు పైపాటుగా పోషకాలను కూడా అందించాలి. ఈ తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటే, 2.5 గ్రా. థియోఫానేట్ మిథైల్ 70 డబ్ల్యుపి లేదా 0.6 మి.లీ. పైరాక్లోస్ట్రోబిన్ + ఫ్లక్సాపైరాక్సాడ్ లేదా 2.5 గ్రా. టెబుకొనజోల్ 10% + గంధకం 65 శాతం డబ్ల్యుజి లేదా 1 గ్రా. టెబుకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట పూర్తి కాలం తర్వాత లేదా మొక్కల పైన 95 శాతం కాయలు ఎండిన తర్వాత పంటను కోయాలి. పంట కోత సమయంలో గింజ తేమ శాతం 17-18 ఉండేటట్లు చూసుకోవాలి. కోత తర్వాత పంటను అలాగే ఒకరోజు పొలంలో ఆరనివ్వాలి. ఒకవేళ మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే అదే రోజు కుప్ప వేయాలి. ప్రతి రోజు సాయంత్రం కుప్పలను టార్పాలిన్లతో కప్పి ఉదయం తీసివేయాలి. కోత తర్వాత వీలైనంత తొందరగా నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసేటప్పుడు గింజ పగలకుండా తక్కువ వేగంతో నూర్పిడి చేయాలి. నూర్పిడి అనంతరం, గింజలను 8-10 శాతం తేమ వచ్చే వరకు బాగా ఎండబెట్టి కొత్త గోనె సంచులలో నిలువ చేయాలి. అపరాలు వానాకాలంలో విత్తిన కంది శాఖీయ దశలో ఉంది. అంతరకృషి ద్వారా కలుపు లేకుండా చూసుకోవాలి. మన రాష్ట్రంలో యాసంగిలో కందిని నీటి వసతి ఉన్న ప్రాంతాలలో సాగుచేసే అవకాశం ఉంది. యాసంగికి అనువైన కంది రకాలు: డబ్ల్యు.ఆర్.జి-65, డబ్ల్యు.ఆర్.జి - 53, డబ్ల్యు.ఆర్.జి - 255, టి.ఆర్.జి - 59, ఎల్.ఆర్.జి - 41, ఐ.సి.పి.ఎల్ -87119, ఐ.సి.పి.హెచ్ - 2740, టి.డి.ఆర్.జి-4 విత్తే సమయం: సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనుకూలం. విత్తన మోతాదు: 5-6 కిలోలు / ఎకరాకు విత్తే దూరం: 45-90 x 10 సెం.మీ. వరుసలు మొక్కల మధ్య దూరం నేల స్వభావం, వర్షపాతాన్ని బట్టి విత్తుకోవాలి. ఎరువులు: 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరంను ఆఖరి దుక్కిలో వేయాలి. పైరు 30-40 రోజులు ఉన్నప్పుడు మరో 20 కిలోల నత్రజనిని పైపాటుగా వేయాలి. అంతరకృషి: తొలిదశలో కంది పైరు పెరుగుదల తక్కువగా ఉంటుంది. మొదటి రెండు నెలల వరకు తరచుగా గొర్రు / దంతి / గుంటక ద్వారా అంతరకృషి చేసి కలుపు నివారణతో పాటు భూమిలో తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు యాజమాన్యం: పెండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.3-1.6 లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. సెప్టెంబర్ మాసంలో సాగుచేసిన కంది పైరులో అంతరకృషి చేసుకోవాలి. యాసంగికి అనువైన పెసర, మినుము రకాలు పెసర : ఎం.జి.జి-385, ఎం.జి.జి-351, ఎం.జి.జి-295, ఎం.జి.జి-347, డబ్ల్యు.జి.జి-42, ఐ.పి.ఎం-2-14, టి.ఎం-96-2, ఎం.జి.జి-389మినుము : ఎం.బి.జి-1070, ఎం.బి.జి-207, ఎల్.బి.జి-707, ఎల్.బి.జి-752, టి.బి.జి-104, జి.బి.జి-1, పి.యు-31, ఎం.బి.జి-1080 విత్తే సమయం: పెసర, మినుము సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు: 7-8 కిలోలు / ఎకరాకు విత్తనశుద్ధి: ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేసి తరువాత 5 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసంపీల్చే పురుగులు, తెగుళ్ళ బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. చివరగా విత్తే ముందు ఎకరానికి 200 గ్రా. రైజోబియం కల్చరును 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అంతరకృషి: పెసర / మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 - 30 రోజుల దశలో గొర్రు / దంతి ద్వారా అంతరకృషి చేస్తే కలుపు నివారణతోపాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉంటే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30 శాతం ఇసి ఎకరానికి 1.0-1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. శనగ దేశీ రకాలు: నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్-452, నంద్యాల గ్రామ్-776 (ఎన్ బిఇజి)-776, నంద్యాల గ్రామ్-857, నంద్యాల గ్రామ్ - 1267కాబూలీ రకాలు: కెఎకె-2, ఫూలేబి-95311, లాం శనగ-7 (ఎల్ బిజి-7) నంద్యాల గ్రామ్-119 (ఎన్ బిఇజి-119) నంద్యాల గ్రామ్-810 (ఎన్ బిఇజి-810), నంద్యాల గ్రామ్-844 ఎన్ బిఇజి-844 విత్తే సమయం: అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తన మోతాదు: 34-36 కిలోలు / ఎకరాకు దేశీ 40-44 కిలోలు / ఎకరాకు కాబూలీ రకాలు. ఎరువులు: 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. కలుపు నివారణ: పెండిమిథాలిన్ 30 శాతం ఎకరానికి 1.0-1.4 లీ. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే తగిన తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. పత్తి ప్రస్తుతం పంట పూత నుండి కాయలు అభివృద్ధి చెందే దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించకపోవడం వలన వడలిపోయినట్లు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో పైపాటుగా 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు, పూత, కాయలు ఏర్పడే దశలో జీవ సంరక్షక తడులు అందించాలి. వర్షాభావం వల్ల పత్తి పంటలో పైపాటుగా నత్రజని (25 కిలోల యూరియా / ఎకరా), పొటాషియం (10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ / ఎకరా) ఇచ్చే ఎరువులను 60, 80 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. పత్తిలో పచ్చదోమ, తామర పురుగులు గమనించినట్లైతే నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 1.25 గ్రా. డైఫెన్థియూరాన్ లేదా 0.3 గ్రా. ఫ్లోనికామిడ్ లేదా 0.75 గ్రా. సల్ఫాక్సాఫ్లోర్ మందును 5 మి.లీ. 1500 పిపియం వేపనూనెతోపాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబి రంగు పురుగు ఆశించడానికి అనుకూలమైన సమయం నివారణకు పొలం గట్టు మీద ఉన్న కలుపును నివారించాలి. ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజులలో 7-8 రెక్కల పురుగులను గమనించినట్లైతే, నివారణకు 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ + 5 మి.లీ. వేపనూనె (1500 పిపియం) తో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు నివారణకు ఉదయం 10 గంటలు గాని లేదా సాయంత్రం 4 గంటల తరువాత పిచికారీ చేసుకోవాలి. చెరకు నవంబర్ - డిసెంబర్ మాసాల్లో చెరకును నాటడానికి అక్టోబర్ నుండే నేలను తయారు చేసుకోవాలి. చెరకు పంట ఒక మొక్క తోట, రెండు మోడెం తోటలుగా 2-3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి నేలను 45 సెం.మీ. లోతు వరకు ఇనుప నాగలితో దున్ని మెత్తగా లోతు దుక్కి చేసుకోవాలి. 4-6 వారాల ముందు సేంద్రియ ఎరువులను వేసి కలియదున్నాలి. చదును చేసిన తరువాత కాలువలను, బోదెలను రిడ్జ్ మార్కర్ లేదా రెక్కల నాగలితో తయారుచేసుకోవాలి. కాలువ వెడల్పు 90 సెం.మీ. లోతు 30 సెం.మీ. ఉండాలి. నీటి ముంపునకు గురయ్యే నల్లరేగడి, ఒండ్రు నేలల్లో చెరకు నాటడానికి ముందే ప్రతి 24 మీటర్ల దూరానికి 60 సెం.మీ. వెడల్పు, 40 సెం.మీ. లోతు గల మురుగు నీటి కాలువలను తీసుకోవాలి. దీనివల్ల వేరు మండలం బాగా విస్తరించి పంట ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి చెరకును నాటడానికి 4 నుండి 6 వారాల ముందు పళ్ళెపు దంతితో భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. ఫిల్టరు మడ్డి దొరికే ప్రాంతాల్లో ఎకరానికి 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టరు మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. ఒక టన్ను ఫిల్టరు మడ్డి వాడడం వల్ల 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ పంటకు అందించవచ్చు. ఈ ఎరువులు లభ్యం కాని ప్రాంతాల్లో పచ్చిరొట్టె ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి వాటిని పెంచి 60 రోజుల తర్వాత నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్టె పైర్లను పళ్ళెపు దంతితో కలియదున్నితే పంట త్వరగా చివికి సారవంతమైన సేంద్రియ ఎరువుగా మారుతుంది. పచ్చిరొట్టె పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరిగి పంట బాగా పెరగడానికి దోహదపడుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే వర్షాలు, బలమైన గాలుల వలన చెరకు తోటలు పడిపోయి దిగుబడి, రసనాణ్యతలో తరుగుదల ఏర్పడుతుంది. ఈ పడిపోయిన చెరకు తోటల నుండి తయారుయిన బెల్లం నిల్వకు పనికి రాకుండా పోయి మార్కెట్లో సరైన ధర రాక రైతాంగం ఎంతో నష్టపోతున్నారు. ఎవుగా పెరిగే సమయంలో చెరకు తోటను జడచుట్టినట్లైతే ఎలాంటి నష్టం జరుగకుండా నివారించుకోవచ్చు. చెరకు పంటకాలం, ఎదుగుదలను బట్టి 2-3 సార్లు జడచుట్టు వేసుకుంటే తోట పడిపోకుండా నివారించుకోవచ్చు. చెరకులో ఆకురాల్చడం, జడ చుట్టడం వంటి పైపాటి పనులు పరోక్షంగా రసనాణ్యతను పెంచడానికి దోహదం చేస్తాయి. అదేవిధంగా మట్టిని ఎగదోయడం వలన చెరకు పడిపోకుండా, ఉండి, పిలకలు కూడా ఒకేసారి పక్యానికి వచ్చి రసనాణ్యతను పెంచేలా దోహదం చేస్తాయి. దీనివలన పీకపురుగులును, కాండం తొలిచే పురుగులను కూడా తగ్గించవచ్చును. ఆకులను రెల్చడం మొక్కలకు లాభదాయకం అయితే కొంతమంది రైతులు ఎండి ఎండని ఆకులను తీసివేసి 3 లేదా 4 పచ్చని ఆకులను మాత్రమే ఉంచి మిగిలినవి జడ కడుతుంటారు. కాని ఇలా చేయడం వలన తోటకు ప్రయోజనం చేకూరదు. అయితే జడ చుట్లు వేసుకునేటప్పుడు, అడుగు భాగాన, పక్కన ఉన్న ఆకులను మెలివేసి 5 సెం.మీ. వ్యాసం గల గడలకు వరస పొడవున జడచుట్టు వేసుకోవాలి. దీనివలన మొక్కకు సూర్యరశ్మి బాగా అందుతుంది. రైతాంగం జడ చుట్టేటప్పుడు చెరకు మొక్కపై కనీసం ఎనిమిది పూర్తిగా రూపాందిన పచ్చని ఆకులు ఉండేటట్లు జాగ్రత్త పడితే లాభదాయకంగా ఉంటుంది. (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో) ఆధారం: పాడి పంటలు మాస పత్రిక