కందిలో సాధారణ పంట కోత, విత్తనపు పంట కోతలో పాటించాల్సిన మెళకువలు, నిల్వలో జాగ్రత్తలు ప్రస్తుతం కంది పంట తెలంగాణలో 4 లక్షల 90 వేల ఎకరాలలో సాగుచేస్తున్నారు. చాలా మంది రైతులు సాధారణ పంటగా 99 శాతం సాగు చేశారు. కొద్దిమంది రైతులు 1 శాతం విత్తన పంటగా సాగుచేశారు. రైతులు ముఖ్యంగా కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా పంట కోత కోస్తున్నారు. సాధారణంగా సాగు చేసే రైతులు కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా జల్లెడలు శుభ్రపరచుకొని పంట కోత చర్యలు చేపట్టవచ్చు. విత్తనపు పంట కోత చేపట్టేటప్పుడు పొలంలో మొదలగా బెరకులు ఏరివేత కార్యక్రమం చేపట్టాలి. పొలంలో ఎలాంటి బెరకులు లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కోత మిషన్ లోని జల్లెడలు, विभिन्न భాగాలు విప్పి శుభ్రపరచుకొని పంటకోత చేపట్టాలి. కోత మిషన్ లోని వివిధ భాగాలు శుభ్రపరచినప్పటికీ మొదటగా కోసిన కొంత భాగాన్ని వేరుగా కుప్ప పోసుకోవాలి. విత్తనపు పంట కోత కోసిన కంది పంటను కొత్త టార్పాలిన్ మీద కుప్పగా పోసుకోవాలి. కల్లాల మీద కుప్ప పోసుకోవాల్సి వస్తే మొదటగా కల్లాను ఇతర రకాల కంది గింజలు లేదా వేరే పంట గింజలు, మట్టి పెళ్ళలు లేకుండా పరిశుభ్రం చేసుకోవాలి. కుప్ప వేసిన కంది పంటను 4-5 రోజులు ఎండ తీవ్రతను బట్టి 8 శాతం తేమ ఉండేటట్లు ఆరబెట్టుకోవాలి. అధిక ఉష్ణోగ్రత (38 డిగ్రీల కంటే ఎక్కువ) ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఆరబెట్టకూడదు. ఆరబెట్టినట్లయితే విత్తనం అతి తక్కువ సమయంలో మొలకశాతం కోల్పోయే ప్రమాదం ఉంది. కొంత వరకు ఎండిన తర్వాత విత్తనాన్ని తూర్పార పట్టి చెత్తను, మట్టి పెళ్ళలు, పగిలిన, పురుగు తిన్న గింజలను వేరు చేసుకోవాలి. మంచిగా ఎండిన తర్వాత (8 శాతం తేమ) కంది గింజలను ప్రాసెస్సింగ్ ప్లాంట్ కు తరలించి ప్రాసెస్సింగ్ చేసుకోవాలి. ఎండిన కంది గింజలను ప్రాసెస్సింగ్ ప్లాంట్ కు తరలించే ముందుగా ప్లాంట్ లోనే జల్లెడలను, గ్రేడర్లను పరిశుభ్రంగా వేరే రకాల కంది గింజలు లేకుండా శుభ్రపరచుకోవాలి. ప్రాసెస్సింగ్ చేసిన కంది విత్తనాలను కొత్త సంచులలో అనగా ముద్రణ చేసిన సంచులలో పాకెటింగ్ చేసుకొని సీలింగ్ చేయాలి (3 కిలోలు). ప్రాసెస్సింగ్ చేసి నింపిన కొత్త సంచులను గోదాములకు తరలించే ముందు, విత్తన గోదాములను శుభ్రపరచి ఎలాంటి పురుగు అవశేషాలు చెత్త లేకుండా ఊడ్చి, పురుగు, తెగులు మందులైన (మలాథియాన్) వాటితో గోదాములలో పిచికారీ చేసిన తర్వాత ఎత్తు స్టాండ్లపై విత్తనపు సంచులను అమర్చాలి. అమ్మకం జరిగిన తర్వాత మిగిలిన విత్తనాన్ని నిల్వ చేసేటప్పుడు ప్రతి 20 రోజులకు ఒకసారి విత్తనపు గోదాములను మలాథియాన్ అనే మందుతో పిచికారీ చేసి నిల్వలో వచ్చే పురుగుపై నిఘా ఉంచాలి. లేకపోతే కంది నిల్వలో వచ్చే బ్రుచిడ్ (పెంకు పురుగు) విత్తనాన్ని / సంచులను లోపలనే పురుగు రంధ్రాలు చేసి విత్తనాన్ని పాడుచేస్తాయి. పెంకు పురుగు గోదాములలో గమనించిన వెంటనే సంచులను విప్పదీసి ఎండలో ఆరబెట్టి మరల సంచులపై మలాథియాన్ (50 శాతం. ఇ.సి.) మందును పిచికారీ చేసి తర్వాత నింపుకొని నిల్వ చేసుకోవాలి. గోదాములను ప్రతి 15 రోజులకు ఒకసారి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని శుభ్రపరుచుకోవాలి. ఆధారం :పాడి పంటలు మాసపత్రిక