అరికల సాగు లో మెళకువలు డా. దీపిక1, శ్రీమతి. గాయత్రి2, డా.స్వర్ణ1 మరియు డా. అనురాధ 1ఐసిఎఆర్ -భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ, హైదరాబాద్, తెలంగాణ 2ఐసిఎఆర్ -జాతీయ వరి పరిశోధన సంస్థ, కటక్, ఒడిశా అరికలు లేదా కోడో మిల్లెట్ మన దేశం లో ఆవిర్భవించిన చిరు ధాన్యాలలో ఒకటి. ఈ పంట ఉష్ణమండల ప్రాంతాలలో అధికం గా పెరుగుతుంది. మన దేశం లో మధ్య ప్రదేశ్ , ఛస్త్తస్గఢ్ , ఉత్తరప్రదేశ్ , తమిళనాడు , మహారాష్ట్ర , కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో ఈ పంట ఎక్కువ గా పండిస్తారు. ఈ పంట దేశం లో షుమారుగా 2.44 లక్షల హెక్టార్లలో(2005-06) విస్తరించి, హెక్టార్ కు 312 kg వరకు దిగుబడి ని ఇస్తుంది. అరికల్లో మిగతా ధాన్యాలు తో పోలిస్తే అనేక పోషకవిలువలు ఉంటాయి. వీటిలో37–38 శాతం పీచు పదార్థం(Dietary fibre) ఉండటం వలన సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇతర ఉపయోగకరమైన కొవ్వులు (PUFA) మరియు కాల్షియమ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి లవణాలు మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే లెసిథిన్ (lecithin) అనే కొవ్వు పదార్ధం నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. రోజు వారి ఆహారం లో అరికలని వాడటం వల్ల హృదయ సంబంధిత రోగాలను, అధిక రక్తపోటును నియంత్రించవచ్చును.అరికలు తక్కువ నేల సారాన్ని మరియు నీటి ఎద్దడి తట్టుకుని పెరగడం వలన అవి ఎలాంటి నేలల్లో ఐనా మంచి దిగుబడి ఇవ్వగలవు. అరిక పంట సాగు లో పాటించవలసిన మెళకువలు 1. వాతావరణం అరికలు అధిక ఉష్ణోగ్రత ని తట్టుకుని పెరగగలవు. ఐతే పంట కు 26 -30° సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలమైనది. పంట కాలం లో షుమారుగా 25 -30 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. ఎక్కువ తడులు ఇచ్చిన లేదా 50-60 సె.మీ. వర్షపాతం ఉన్నట్లైతే మంచి పంట దిగుబడి ఆశించవచ్చు. 2. నేలలు అరికలు ఎలాంటి నేలల్లో ఐనా పండించవచ్చు. తేలికపాటి ఇసుక నేలలు, ఎర్ర నేలలు మరియు నల్ల రేగడి నేలలు కూడా అరిక పంట కు అనువైనవే. నీరు నిలబడి ఉండే నేలలో మాత్రం ఈ పంట సాగు కు పనికి రావు. పొలాన్ని రెండు సార్లు వ్యతిరేక దిశల్లో దుక్కి చేసి మట్టిని మెత్తటి పొడిలా చేసుకున్నట్లైతే కలుపు ని నియంత్రించవచ్చును. 3. విత్తనాలు, విత్తే సమయం, విత్తన శుద్ధి అరికలు జూన్ మధ్య నుండి జులై నెల ఆఖరి వరకు విత్తు కోవచ్చు. మంచి పంట కోసం జూన్ నెల రెండవ పక్షం లో విత్తడం శ్రేయస్కరం. సాళ్లలలో వేసుకోడానికి హెక్టార్ కు 5 -6 కేజీలు మరియు ఎదజల్లడానికి 8 -10 కేజీల విత్తనం అవసరం.సాళ్లకి మధ్య 25 సె. మీ. మరియు మొక్క కి మధ్య 10సె. మీ. దూరం ఉన్నట్లు చూసుకోవాలి.విత్తనాన్ని కార్బెన్డజిమ్ లేదా క్లోరోఠాలోనిల్ @ 2 గ్రా./కేజీ విత్తనం తో విత్తన సూది చేయడం వలన నేల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించవచ్చును. 4. ఎరువులు మరియు నీటి యాజమాన్యం పంటకు పశువుల ఎరువు వేయడం శ్రేష్టం. ఇది రసాయనిక ఎరువుల మోతాదు తగ్గిస్తుంది. అరికల్లో ఎరువులు మోతాదు ముఖ్యమైన సాగు చేసే రాష్ట్రాలకు వేరు వేరుగా ఉన్నాయి. హెక్టార్త కు తమిళనాడు లో 40 కేజీల నత్రజని మరియు 20కేజీల భాస్వరం; మధ్య ప్రదేశ్ లో 20 కేజీల నత్రజని మరియు 20కేజీల భాస్వరం; ఈశాన్య రాష్ట్రాలలో 60 కేజీల నత్రజని 30కేజీల భాస్వరం మరియు 30కేజీల పోటాష్ ; ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర సాగు చేసే రాష్ట్రాలలో 20 కేజీల నత్రజని, 20కేజీల భాస్వరం మరియు 20కేజీల పోటాష్ సిఫార్సు చేయబడ్డాయి. అరికలు వర్షాధార పంట. నీటి పారుదల సదుపాయం ఉంటే పంట కాలం మధ్యలో 2 -3 తడులు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. 5. కలుపు యాజమాన్యం గడ్డి జాతి మరియు వెడల్పాకు జాతి మొక్కలను గడ్డ పార సాయం తో తీసివేయాలి. 2-3 సార్లు కలుపు తీయడం వలన కలుపు ని పూర్తిగా నియంత్రించవచ్చు. విత్తిన వెంటనే ఐసోప్రోటురోన్ ఎకరాకు 400 గ్రా., చొప్పున పిచికారీ చేయాలి. 6. పంట మార్పిడి మరియు అంతర పంటలు అరికలలో అంతరపంటలుగా కంది, పెసర, మినుము, సోయాబీన్ వంటి పంటలను 2:1 నిష్పత్తి లో వేయవచ్చును. సోయాబీన్/ఒడిసలును అరికల తో పంట మార్పిడి చేయడం ద్వారా మంచి పంట దిగుబడులు ఆశించవచ్చు. 7. పురుగులు మరియు తెగుళ్లు i. మొవ్వు తెగులు: ఇది సోరోస్పోరియం పసిపాలితున్బర్జిని అనే సిలింద్రం వలన సోకుతుంది. ఇది ముఖ్యం గా వ్యాధిసోకినా విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్న లేదా పంట కోత కు ముందు వర్షం తో తడిసిన ఈ సిలింద్రం వృధి చెందుతుంది. విత్తనాన్ని క్లోరోఠాలోల్ లేదా మాంకోజెబ్ @ 2 గ్రా./ కేజీ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ii. కాండం తొలుచు పురుగు: పంట ను ముందు గా నాటుకోడం ద్వారా ఈ పురుగు బెడద ను నివారించవచ్చు.